దసరా - మూవీ రివ్యూ

  • మాస్ యాక్షన్ మూవీగా వచ్చిన 'దసరా'
  • గ్రామీణ నేపథ్యంలో నడిచిన కథ 
  • స్నేహం .. ప్రేమ ప్రధానమైన అంశాలు  
  • నాని - కీర్తి సురేశ్ నటన హైలైట్
  • సముద్రఖని .. సాయికుమార్ పాత్రల్లో కనిపించని పవర్
నాని ఇంతవరకూ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలను .. పాత్రలను చేస్తూ వచ్చాడు. మాస్ టచ్ ఉన్న పాత్రలను కూడా చేశాడుగానీ, ఆ పాత్రలపై ఆ ప్రభావం పరిమితిగానే ఉండేది. ఈ సారి అలా కాకుండా ఫస్టు ఫ్రేమ్ నుంచి చివరివరకూ పూర్తి మాస్ లుక్ తో ఆయన చేసిన సినిమానే 'దసరా'. ఆయన కెరియర్లో ఫస్టు పాన్ ఇండియా సినిమా ఇదే. అలాంటి ఈ సినిమా ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. తన ఇమేజ్ కి భిన్నంగా నాని చేసిన ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిందనేది చూద్దాం.

'వీర్లపల్లె' గ్రామంలోని ప్రజలంతా బొగ్గు గనులపై ఆధారపడి బ్రతుకుతుంటారు. ధరణి (నాని) వెన్నెల (కీర్తి సురేశ్) .. సూరి ( దీక్షిత్ శెట్టి) అదే ఊరిలో పుట్టి పెరుగుతారు. చిన్నప్పటి నుంచే ధరణి .. వెన్నెలను ఇష్టపడుతూ వస్తాడు. ఆమె పట్ల అతనికి గల ప్రేమ, వయసుతో పాటు పెరుగుతూ వెళుతుంది. అయితే తన స్నేహితుడు సూరి .. వెన్నెల ప్రేమించుకుంటున్న విషయం అతనికి తెలుస్తుంది. దాంతో వెన్నెల పట్ల తనకి గల ప్రేమను మనసులోనే సమాధి చేసుకుంటాడు. 

ఈ క్రమంలోనే ఆ ఊరిలో సర్పంచ్ పదవికి గట్టి పోటీ ఉంటుంది. ఎవరు గెలిస్తే వారు ఆ ఊళ్లోని మద్యం దుకాణాన్ని నిరంతరం నిర్వహించుకోవచ్చు అనే నియమం ఉంటుంది. అందువలన సర్పంచ్ గిరి కోసం పెదనంబి సవతి కొడుకులైన శివన్న (సముద్రఖని) రాజన్న (సాయికుమార్) పోటీపడతారు. సర్పంచ్ గా అవినీతిపరుడైన శివన్న గెలవడంతో, అతని కొడుకైన చిననంబి మద్యం దుకాణాన్ని నడుపుతూ చక్రం తిప్పుతుంటాడు.

ఈ నేపథ్యంలోనే ధరణి .. సూరి .. మిగతా స్నేహితులు రాజన్న వైపు వెళతారు. ఆయనకి తమ మద్దతును ప్రకటిస్తారు. ఇది నచ్చని శివన్న - చిననంబి తీవ్రమైన అసహనానికి లోనవుతారు. సూరి - వెన్నెల పెళ్లిని దగ్గరుండి జరిపించడం కోసం ధరణి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ సమయంలోనే ఓ రాత్రివేళ కొంతమంది ఆగంతుకులు ఊరుపై విరుచుకుపడతారు. సూరిని చంపేసి పారిపోతారు. అప్పుడు ధరణి ఏం చేస్తాడు? సూరిని చంపించిన కారణం ఏమిటి? సూరిని ప్రేమించిన వెన్నెల పరిస్థితి ఏమిటి? అనేవే ఆ తరువాత చోటుచేసుకునే ప్రధానమైన అంశాలు. 

ఈ కథ ప్రధానంగా నాని .. కీర్తి సురేశ్ .. దీక్షిత్ చుట్టూ తిరుగుతుంది. రెండో వరుసలో సముద్రఖని .. పూర్ణ .. షైన్ టామ్ చాకో కనిపిస్తారు. ఈ సినిమాకి వెళ్లాడనికి ముందు వరకూ ఇది బొగ్గు గనుల నేపథ్యంలోని ఒక ఊరు .. అక్కడి పెత్తందారితనం .. దానిని హీరో ఎదిరించే తీరు అనుకుంటారు. కానీ అందుకు పూర్తి భిన్నంగా ఈ కథ నడుస్తుంది. స్నేహం .. ప్రేమ .. ప్రతీకారం అనే ఈ మూడు అంశాలను దసరా పండుగతో పాటు కలుపుకుంటూ కథా ముందుకు వెళుతుంది. 

దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకి ఇంతకుముందు సుకుమార్ టీమ్ లో కలిసి పనిచేసిన అనుభవం వుంది. ఇది దర్శకుడిగా ఆయన తొలి సినిమా. అయినా ఎక్కడా కూడా కొత్తదనం కనిపించదు. కథ .. స్క్రీన్ ప్లే .. పాత్రలను మలిచే విధానం అన్నీ కూడా పెర్ఫెక్ట్ గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ - క్లైమాక్స్ ఈ రెండూ కూడా ఆడియన్స్ అంచనాలకి తగినట్టుగా ఉంటాయి.  ఫస్టు పార్టు అంతా కూడా స్నేహితుడి కోసం నడిస్తే .. సెకండ్ పార్టు స్నేహం కోసం నడుస్తుంది. ఈ రెండిటి నేపథ్యంలో ప్రేమ ఉంటుంది. 

ఈ సినిమా చూస్తున్నంత సేపు ధరణి పాత్ర తప్ప నాని ఎక్కడా కనిపించడు. కథా నేపథ్యంలో .. గ్రామీణ వాతావరణంలో ఇమిడిపోయాడు. ఇక కీర్తి సురేశ్ నటన నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. పాట మధ్యలో ఆమె ఇంట్రడక్షన్ కొత్తగా అనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లి సంబరంలో పెళ్లి కూతురు కూడా మాస్ డాన్సులు చేయడం జరుగుతుంటుంది. అలా కీర్తి సురేశ్ వేసిన స్టెప్పులకి  విజిల్స్ వర్షం కురుస్తుంది.  ఈ సినిమాలో కీర్తి సురేశ్ చేసింది డీ గ్లామర్ రోల్ .. అయితే ఒక్కోసారి నలుపు .. ఒక్కోసారి తెలుపు మేనిఛాయతో ఆమె కనిపించింది.

దీక్షిత్ ... షైన్ టామ్ చాకో ఎవరి పాత్రకి తగినట్టుగా వారు చేశారు. సముద్రఖని పాత్రకి ఉన్న ప్రాధాన్యత చాలా తక్కువ. అలాగే సాయికుమార్ పాత్రకి ఉన్న ప్రాధాన్యత కూడా అంతంత మాత్రమే. సంగీతం విషయానికి వస్తే, సంతోష్ నారాయణ్ బాణీ కట్టిన 'చమ్కీలా అంగీలేసి' పాట బాగా పాప్యులర్ అయింది. అయితే మంచి పల్లవితో మొదలైన పాటలు, చరణాల విషయంలో తడబడటం వినిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది.

సత్యన్ సూర్యన్ కెమెరా పనితనం బాగుంది. పాటలను .. సన్నివేశాలను తెరపైన ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటుంది. గూడ్స్ లోని రైలుబొగ్గును దొంగిలించడం .. హీరో గ్యాంగ్ ను కొంతమంది దుండగులు వెంటాడి చంపడం .. క్రికెట్ ఎపిసోడ్ .. పెళ్లి కూతురుగా కీర్తి మాస్ డాన్స్ ఫస్టాఫ్ కి హైలైట్ నిలుస్తాయి. ఇక సెకండాఫ్ లో వెన్నెల విషయంలో హీరో తీసుకునే కీలకమైన నిర్ణయం హైలైట్ గా నిలుస్తుంది.

ప్లస్ పాయింట్స్: కథ .. కథనం .. ప్రధానమైన పాత్రలను మలిచిన విధానం .. పాటలు .. స్నేహం - ప్రేమ నేపథ్యంలో సాగే ఎమోషన్స్ .. ఫొటోగ్రఫీ. 

మైనస్ పాయింట్స్: సముద్రఖని .. సాయికుమార్ పాత్రలను అవసరమైనంత పవర్ఫుల్ గా తీర్చిదిద్దకపోవడం .. నానితో పాటు అతని స్నేహితులతో అర్థంకాని విధంగా కొన్ని డైలాగ్స్  ను ఫాస్టుగా చెప్పించడం .. పాటల్లో పల్లవిలోని సొగసు చరణాల్లో లోపించడం. ఈ విషయాలను అంతగా పట్టించుకోకపోతే, మాస్ ఆడియన్స్ తో మంచి మార్కులు అందుకునే సినిమానే ఇది.

Movie Details

Movie Name: Dasara

Release Date: 2023-03-30

Cast: Nani, Keerthi Suresh, Deekshith Shetty, Samudrakhani, Sai Kumar, Shine Tom Chacko

Director: Srikanth Odela

Producer: Sudhakar Cherukuri

Music: Santosh Narayan

Banner: Sri Lakshmi Venkateswara Cinemas

Review By: Peddinti

Dasara Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews