యాంగర్ టేల్స్ - వెబ్ సిరీస్ రివ్యూ

  • డిస్నీ హాట్ స్టార్ నుంచి 'యాంగర్ టేల్స్'
  • నాలుగు కథల సమాహారంగా సాగిన  వెబ్ సిరీస్ 
  • సుహాస్ .. బిందుమాధవి ఎపిసోడ్స్ హైలైట్ 
  • బలహీనంగా అనిపించిన మిగతా రెండు ఎపిసోడ్స్  
  • ఎదుటి వ్యక్తి సహనాన్ని పరీక్షించకూడదనేదే సందేశం 

ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం లేని ఓ నలుగురు వ్యక్తుల జీవితాలను తీసుకుని, ఆ నలుగురు తమ జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? చివరికి తమ సమస్యకి తామే ఒక ఎండ్ కార్డు వేయాలనే ఉద్దేశంతో వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? అనే కథాంశంతో రూపొందిన సినిమాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ లలోను ఈ తరహా కథలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాంటి కంటెంట్ తో వచ్చినదే 'యాంగర్ టేల్స్'. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ రోజునే స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది చూద్దాం. 
 
ఈ సిరీస్ ను నాలుగు ఎపిసోడ్స్ గా .. నాలుగు కథలుగా కనిపిస్తుంది. ఒక కథకి .. మరోకథకి సంబంధం ఉండదు. చివర్లో నాలుగు కథలు కలవడం వంటిది జరగదు. మొదటి కథలో .. రంగా (వెంకటేశ్ మహా) తన అభిమాన హీరో సినిమా బెనిఫిట్ షో తన ఊళ్లో తప్పకుండా పడాలనే పట్టుదలతో వెళ్లి అవమానం పాలవుతాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? అనే దిశగా ఈ  కథ నడుస్తుంది.ఈ ఎపిసోడ్ లోనే 'పచ్చబొట్టు శీను'గా సుహాస్ సందడి చేశాడు. 

రెండో ఎపిసోడ్ లో పూజా రెడ్డి (మడోన్నా సెబాస్టియన్) గర్భవతిగా ఉంటుంది. భర్త రాజీవ్ (తరుణ్ భాస్కర్) .. అత్తగారు నాన్ వెజ్ ను దగ్గరికి కూడా రానీయరు. పూజ ఆరోగ్యంగా ఉండాలంటే 'గుడ్డు' తినవలసిందే అని డాక్టర్స్ చెబుతారు. కానీ అందుకు భర్తగానీ .. అత్తగారు గాని ఎంతమాత్రం ఒప్పుకోరు. అలాంటి పరిస్థితుల్లో పూజ ఏం చేస్తుంది? పర్యవసానాలు ఎలాంటివి? అనేదే కథ.

ఇక మూడో కథ .. ఇంటి యజమానుల తీరు .. అద్దెకి ఉండేవారి అవస్థలకు సంబంధించి కొనసాగుతుంది. ఆనంద్ ఒక సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య రాధ (బిందుమాధవి) మిషన్ కుడుతూ ఉంటుంది. ఒక పాత ఇంట్లోని చిన్న పోర్షన్ లో వాళ్లు అద్దెకి ఉంటూ ఉంటారు. రాధ మైగ్రేన్ తో బాధపడుతూ ఉంటుంది. ఇంటి యజమానులురాలు .. ఆమె చుట్టాలు చేసే గందరగోళాన్ని ఆమె భరించలేకపోతుంది. అప్పుడు ఆమె తీసుకునే నిర్ణయం ఏమిటనేది కథ. 

నాలుగో కథ గిరిధర్ (ఫణి ఆచార్య) బట్టతల చుట్టూ తిరుగుతుంది. ఉద్యోగం పరంగా అతను బైక్ పై తిరుగుతూ ఉంటాడు. అందువలన హెల్మెట్ పెట్టుకోవాలి. చిరాకుపడి హెల్మెట్ తీసిన ప్రతిసారి చలాన్ కట్టవలసి వస్తుంది. హెల్మెట్ కారణంగా అతనికి బట్టతల వస్తుంది .. బట్టతల కారణంగా తనకి ఎవరూ పిల్లనివ్వరు. విసిగిపోయిన తను ఏం చేస్తాడు? అనేదే కథ. 

ఇలా నాలుగు సమస్యలతో బాధలు పడుతూ వచ్చిన నలుగురు వ్యక్తుల కథ ఇది. దర్శకుడు ప్రభల తిలక్, బెనిఫిట్ షోకి సంబంధించిన ఫస్టు ఎపిసోడ్ లో టెన్షన్ ను బాగానే బిల్డప్ చేశాడు. అలాగే బింధుమాధవి అద్దె ఇల్లు - నిద్ర ఎపిసోడ్ ను సహజత్వానికి చాలా దగ్గరగా తీసుకుని వెళ్లాడు. మడొన్నాకి సంబంధించిన ఫుడ్ ఎపిసోడ్ .. ఫణి ఆచార్య బట్టతల ఎపిసోడ్స్ అంతంత మాత్రంగా అనిపిస్తాయి. ఈ రెండు ఎపిసోడ్స్ చాలా సాధారణంగా అనిపించటం .. ఇంట్రెస్టింగ్ గా లేకపోవడం మైనస్ గా మారిందని చెప్పచ్చు. 

నటీనటుల విషయానికొస్తే, సుహాస్ .. వెంకటేశ్ మహా .. బిందుమాధవి .. తరుణ్ భాస్కర్ పాత్రలు ఈ వెబ్ సిరీస్ లో హైలైట్ అవుతాయి. నలుగురూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీకి సంబంధించి నాలుగు ఎపిసోడ్స్ కి నలుగురు పనిచేశారు. కెమెరా పనితనం సాధారణంగానే కనిపిస్తుంది. అలాగే కోదాటి పవన్ కల్యాణ్ ఎడిటింగ్ కూడా ఓ మాదిరిగానే అనిపిస్తుంది. డైలాగ్స్ మాత్రం బయట మాట్లాడుకుంటున్నట్టుగా చాలా సహజంగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫరవాలేదు.

ప్లస్ పాయింట్స్: సుహాస్ ఎపిసోడ్ .. బిందుమాధవి ఎపిసోడ్ .. డైలాగ్స్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. కెమెరా పనితనం .. తక్కువ పాత్రలతో కథలను నడిపించిన తీరు. తెగినదాకా లాగితే ఏమౌతుంది? ఒక మనిషి సహనాన్ని అదే పనిగా పరీక్షిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు? అనే కోణంలో ఇచ్చిన సందేశం.    

మైనస్ పాయింట్స్: మడోన్నా ఎపిసోడ్ .. ఫణి ఆచార్య ఎపిసోడ్ .. వైవిధ్యం లేని కథలు .. ఆసక్తికరంగా సాగని కథనం .. బట్టతల ఎపిపోడ్ లో హెల్మెట్ విషయంలో హీరో తీసుకున్న నిర్ణయం. అంతంత మాత్రంగా అనిపించిన నిర్మాణ విలువలు.

Movie Details

Movie Name: Anger Tales

Release Date: 2023-03-09

Cast: Suhas, Bindu Madhavi, Venkatesh Maha,Tarun Bhaskar

Director: Prabhala Thilak

Producer: Sridhar Reddy- Suhas

Music: Smaran Sai

Banner: Fan Made Films

Review By: Krishna

Anger Tales Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews