'రాఖ్' (అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ!

గతంలో అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ' పాతాళ్ లోక్' సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సీజన్ వన్ కి దర్శకత్వం వహించిన ప్రోసిత్ రాయ్, తాజాగా 'రాఖ్' సిరీస్ ను అందించాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన సిరీస్ ఇది. సీజన్ వన్ గా 8 ఎపిసోడ్స్ ను వదిలారు.  హిందీలో రూపొందిన ఈ సిరీస్, ఈ నెల 12వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అలీ ఫజల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్,  తెలుగుతో పాటు ఇతర భాషల్లోను అందుబాటులో ఉంది.

ఢిల్లీ నగరంలో కర్నల్ అశోక్ (ఆమీర్ బషీర్) ఫ్యామిలీ నివసిస్తుంటుంది. భార్య మోనా (సోనాల్ బెంద్రే) టీనేజ్ లోకి అడుగుపెట్టిన సుమన్ (దివ్య శర్మ) సోహెల్ (వివాన్ శర్మ) ఇదే అతని కుటుంబం. పాప సుమన్ .. బాబు సోహెల్ ఇద్దరూ చదువుతున్న స్కూల్ లోనే మోనా టీచర్ గా పనిచేస్తుంటుంది. సుమన్ ఆల్ ఇండియా రేడియోలో తరచూ పాటలు పాడుతూ ఉంటుంది.అలాగే ఒక రోజున తమ్ముడు సోహెల్ తో కలిసి ఆమె పాటలు పాడటానికి వెళుతుంది. కానీ ఆ తరువాత ఇద్దరు పిల్లలూ తిరిగిరారు.

మిస్సింగ్ కేసును నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ కేసును సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలనే పట్టదలతో ఎస్ ఐ జయప్రకాశ్ (అలీఫజల్) ఉంటాడు. సిటీకి దూరంగా ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో పిల్లలిద్దరి డెడ్ బాడీలు లభిస్తాయి. అత్యంత కృరంగా వాళ్లపై దాడి చేసిన తీరు, ఢిల్లీ నగరాన్ని భయపెడుతుంది. ఓ ప్రముఖ దిన పత్రికలో రిపోర్టర్ గా పనిచేస్తున్న 'నిసార్' కూడా ఆధారాలు సేకరించే పనిలో పడుతుంది. 

జయప్రకాశ్ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళుతున్నా కొద్దీ, తెరపైకి వచ్చిన రజ్జో (రమణ్ దీప్ యాదవ్) బాబు (ఆకాశ్ మఖిజా) అనే వారి పేర్లు పెద్దవవుతూ ఉంటాయి. ముంబైలో చిల్లర దొంగతనాలు చేస్తూ ఉండే ఈ ఇద్దరే, జరిగిన హత్యలకు కారకులనే అనుమానాలు బలపడుతూ ఉంటాయి. దాంతో వాళ్లను పట్టుకోవడానికి జయప్రకాశ్ రంగంలోకి దిగుతాడు. ఈ ప్రయత్నంలో ఆయనకి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? వాటిని ఆయన ఎలా అధిగమిస్తాడు? అనేదే కథ.

1978లో ఢిల్లీలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన సిరీస్ ఇది. ఇటు ఢిల్లీ .. అటు ముంబై నగరాల నేపథ్యంలో ఈ కథ మొదలవుతుంది. ఢిల్లీలో జరిగిన ఇద్దరు టీనేజర్స్ హత్యలకీ .. ముంబైలో చిల్లర దొంగతనాలకు పాల్పడే ఇద్దరు దుర్మార్గులు ఎలా కారకులయ్యారు? అనే అంశం చుట్టూ ఈ కథ నడుస్తుంది. అనేక చిక్కుముడులతో కూడుకున్న ఈ కేసును పోలీస్ ఆఫీసర్ జయప్రకాశ్ ఎలా ఛేదిస్తాడు? అనేది ఉత్కంఠను రేకెత్తించే అంశం. 

ఈ కథ విన్నప్పుడు, హత్యలు .. దొంగతనాలు .. ఇన్వెస్టిగేషన్ తో  కూడుకున్న కథలు గతంలో చాలానే వచ్చాయి గదా .. ఇందులో కొత్తేముంది? అనిపించడం సహజం. కానీ ఈ సిరీస్ ఫస్టు ఎపిసోడ్ చూసిన తరువాత ఇక చివరి ఎపిసోడ్ చూసేవరకూ వదిలిపెట్టరు. గతంలో ఈ తరహా కథలు వచ్చినప్పటికీ, దర్శకుడు స్క్రీన్ ప్లేతో మేజిక్ చేశాడని చెప్పాలి. ఆ స్క్రీన్ ప్లేనే ఆడియన్స్ ను మొదటి ఎపిపోడ్ నుంచి 8వ ఎపిసోడ్ వరకూ కదలనీయకుండా చేస్తుంది.

ఒక వైపున తాము బిందాస్ గా గడపడం కోసం ఏం చేయడానికైనా తెగించే ఇద్దరు దొంగలు. మరో వైపున ఆర్మీ ఫ్యామిలీలో పద్ధతిగా పెరిగిన ఇద్దరు అక్కా తమ్ముళ్లు. ఒక పోలీస్ ఆఫీసర్ గా తానేమిటనేది నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్న జయప్రకాశ్. ఈ మూడు వైపుల నుంచి కథ పరిగెడుతూ ఉంటుంది.  మూడు వైపుల నుంచి పడుతున్న సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఒక కుతూహలం ఆడియన్స్ మనసులో ఆందోళన కలిగించడం మొదలుపెడుతుంది.

టీనేజర్స్ కి సంబంధించిన సన్నివేశాలు మనలను కలవరపాటుకు గురిచేస్తాయి. హంతకులకు సంబంధించిన ట్రాక్ ఆడియన్స్ ను కచ్చితంగా టెన్షన్ కి గురిచేస్తుంది. ఇక ఈ కేసు విషయంలో తనకి ఎదురవుతున్న ఆటంకాలను దాటుకుంటూ పోలీస్ ఆఫీసర్ ముందుకు వెళ్లిన తీరు ఆ  పాత్ర పట్ల అభిమానాన్ని పెంచుతుంది. ఈ మూడు ట్రాకులలో ఎక్కడా కూడా అనవసరమైన సన్నివేశమనేది కనిపించదు. ప్రతి సన్నివేశం మన కళ్లముందు జరుగుతున్నట్టుగా ఉంటుంది.  

 నిజానికి ఇది 1978లో జరిగే కథ అయినప్పటికీ, ఆ కాలాన్ని మరిచిపోయి కళ్లప్పగించి చూసేలా చేసే సిరీస్ ఇది. ఒక కుటుంబమనేది లేకుండా .. ఒక అడ్రెస్ అనేది లేకుండా .. ఈజీ మనీకి అలవాటు పడిపోయిన నేర స్వభావం కలిగిన వ్యక్తులు సమాజానికి ఎంతటి ప్రమాదకరమనేది ఈ సిరీస్ చూస్తే అర్థమవుతుంది. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో  ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మూల్యం చెల్లించక తప్పదనే సందేశాన్ని ఈ సిరీస్ ఇస్తుంది.

మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకూ కథ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రిమోట్ పక్కన పెట్టేస్తారు. 7 .. 8 ఎపిసోడ్స్ మరింత టెన్షన్ పెట్టేస్తాయి. ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా తమ పాత్రలలో ఇమిడిపోయారంటేనే కరెక్టుగా ఉంటుంది. హంతకులలో 'బాబు' పాత్రను పోషించిన నటుడు, ఆ పాత్రలో జీవిస్తూ ఆడియన్స్ ను భయపెట్టాడనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే సైకో కిల్లర్స్ నటనే ఈ సిరీస్ కి హైలైట్.

 ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధానమైన బలం అని చెప్పాలి. నైట్ ఎఫెక్ట్ సీన్స్ .. రెయిన్ ఎఫెక్ట్ సీన్స్ ఆవిష్కరణ బాగుంది. ఆ తరువాత స్థానంలో నేపథ్య సంగీతం నిలుస్తుంది. సన్నివేశాలలో నుంచి ఆడియన్స్ ఎక్కడా జారిపోకుండా చేస్తుంది. ఎడిటింగ్ ఫరవాలేదు. 

ఈ తరహా కథలు గతంలో చాలానే వచ్చినప్పటికీ, స్క్రీన్ ప్లే పరంగా ఈ సిరీస్ మెప్పిస్తుంది. సన్నివేశాలు చాలా సహజంగా అనిపిస్తూ, మన కళ్లముందు జరుగుతున్నాయనేమో అనేంత ఫీల్ ను కలిగిస్తాయి. పాత్రలను .. ఆ పాత్రల స్వరూప స్వభావాలను డిజైన్ చేసిన తీరు ఎమోషనల్ గా  కనెక్ట్ చేస్తాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ను గురించి చెప్పుకోవచ్చు.   

Movie Details

Movie Name: Raakh

Release Date:

Cast: Ali Fazal, Akash Makhija, Ramandeep Yadav, Divya Sharma, Vivaan Sharma, Sonali Bendre

Director: Prosit Roy

Producer: Deepak Dhar - Rishi Negi

Music: -

Banner: Endemol Shine India

Raakh Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews