మలయాళంలో ఈ ఏడాది విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసిన సినిమాల జాబితాలో 'వాలా 2' ఒకటిగా కనిపిస్తుంది. 'బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బ్రోస్' అనేది ట్యాగ్ లైన్. విపిన్ దాస్ అందించిన ఈ కథను దర్శకుడు సావిన్ తెరకెక్కించాడు. ఏప్రిల్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా, 235 కోట్లను వసూలు చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను జియో హాట్ స్టార్ వారు దక్కించుకున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి మలయాళంతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.
మధ్యతరగతి కుటుంబాలకి చెందిన హషీర్ .. అలెన్ .. వినాయక్ .. అజిన్ అనే నలుగురు కుర్రాళ్ల కథ ఇది. ఈ నలుగురూ ఒక కాలేజ్ లో చదువుతూంటారు. చదువుపై పెద్దగా దృష్టి పెట్టకుండా స్వేచ్ఛగా తిరుగుతుంటారు. సినిమాలు .. షికార్లతో లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాలేజ్ మొదలు.. సినిమా థియేటర్ల వరకూ వాళ్లు గొడవ చేయని ప్రదేశమంటూ ఉండదు. తాగుడుతో పాటు డ్రగ్స్ వరకూ వెళ్లిపోతారు. చివరికి కాలేజ్ నుంచి బయటికి గెంటేసే పరిస్థితి వస్తుంది.
అలాంటి పరిస్థితులలో మనోజ్ సార్ (అజూ వర్గీస్) చెప్పిన మంచి మాటలు వారిపై ప్రభావం చూపుతాయి. అప్పటి నుంచి యూకేకి వెళ్లాలనే ఒక లక్ష్యంతో చదువుకోవడం మొదలుపెడతారు. విదేశాల్లో జీవితం ఎంతో అందంగా ఉంటుంది. చదువుకుంటూనే ఎక్కువ డబ్బు సంపాదిస్తూ ఉండొచ్చు. ఆ డబ్బుతో ఆనందంగా గడపొచ్చునని వాళ్లంతా ఆశపడతారు. అయితే హాషీర్ మినహా మిగతా వాళ్లంతా పాస్ అవుతారు. దాంతో హాషీర్ ఊళ్లోనే ఉండిపోవలసి వస్తుంది.
విదేశాలకు వెళ్లే అవకాశం లేక హాషీర్ బాధపడుతూ ఉంటాడు. తండ్రి మాట కాదనలేక, అజిన్ అంతటితో చదువు ఆపేసి, దుబాయ్ లో తన అన్నయ్య పనిచేసే చోటుకి వెళ్లిపోతాడు. ఇక అలెన్ .. వినాయక్ ఇద్దరూ కూడా నానా అవస్థలు పడి డబ్బు సమకూర్చుకుంటారు. తమ ఆశలు నిజం చేసుకోవాలనే ఉత్సాహంతో యూకే వెళ్లిపోతారు. అక్కడ వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటిని వాళ్లు ఎలా ఎదుర్కొంటారు? అనేదే కథ.
మిడిల్ క్లాస్ కి చెందిన పేరెంట్స్ తమ పిల్లలను మంచిగా చదివించడం కోసం తమ అవసరాలను ఎన్నింటినో త్యాగం చేస్తారు. తమ స్థాయికి మించి కష్టపడతారు. అయితే పిల్లలు మాత్రం ఆ చదువును పక్కన పెట్టేసి ప్రేమలు .. అల్లర్లు .. డ్రగ్స్ అంటూ పక్కదారి పడతారు. ఎలాంటి ఆశయం లేకముందు ఆ కుర్రాళ్లు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశారు? తమకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న తరువాత ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు? అనే అంశం చుట్టూ ఈ కథను అల్లుకోవడం జరిగింది.
నలుగురు కుర్రాళ్ల కాలేజ్ లైఫ్ ను కళ్ల ముందుంచే కథ ఇది. కాలేజ్ లో వాళ్ల ప్రవర్తన .. గొడవలు .. లెక్చరర్స్ మందలింపులు .. పేరెంట్స్ చీవాట్లతో ఫస్టాఫ్ నడుస్తుంది. ఇక తామేంటన్నది నిరూపించుకోవడం కోసం ఆ కుర్రాళ్లు విదేశాలకు వెళ్లడం దగ్గర నుంచి సెకండాఫ్ కొనసాగుతుంది. నాణానికి ఇవతల .. అవతల అన్నట్టుగా రెండు వైపులా కుర్రాళ్ల జీవితాలను ఆవిష్కరించే కథ ఇది అని చెప్పుకోవచ్చు.
మిడిల్ క్లాస్ జీవితాలు .. వారి స్వభావాలు .. చదువుకునేటప్పుడు పిల్లల స్వభావాలు .. టీనేజ్ లో వాళ్లు వ్యాసనాల బారిన పడే తీరు .. ప్రేమకి .. ఆకర్షణకి మధ్యలో నలిగిపోయే విధానం .. రిజల్ట్ సమయంలో పడే టెన్షన్ ఇవన్నీ కూడా దర్శకుడు ఆవిష్కరించిన తీరు, సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తూ ఆకట్టుకుంటాయి. ఇంటి దగ్గర పేరెంట్స్ .. కాలేజ్ లో లెక్చరర్స్ పట్టించుకోకపోతే స్టూడెంట్స్ ఎలా తయారవుతారనే విషయాన్ని ప్రస్తావించిన విధానం ఆకట్టుకుంటుంది.
తగినంత డబ్బు లేకపోతే విదేశాలలో ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సరైన చదువు లేకుండా వెళితే ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది అనేది బాగా చూపించారు. ఇక్కడ ఉండే స్టూడెంట్స్ .. విదేశాలకు వెళ్లలేకపోవడం తమ దురదృష్టం అనుకుంటారు. అక్కడికి వెళ్లివారు అసలు నిజాన్ని గ్రహించినా ఆ విషయాన్నీ బయటకి చెప్పుకోలేక అవస్థలు పడుతుండటాన్ని గొప్పగా ఆవిష్కరించారు.
ఇక పిల్లల కలలను నెరవేర్చడం కోసం ఫారిన్ పంపించే పేరెంట్స్ కొందరైతే, తమ అప్పులు తీర్చడం కోసం పంపించేవారు మరికొందరు. ప్రేమించడానికి ఎలాంటి అర్హత అవసరం లేదు .. కానీ పెళ్లి చేసుకోవడానికి అర్హత అవసరమే అనే విషయాన్ని స్పష్టం చేసిన తీరు బాగుంది. కాలేజ్ క్యాంపస్ లో కలిసి చేసే పోరాటంలో కిక్ ఉంటుంది. కానీ జీవితమనే పోరాటం ఎవరికి వారు ఒంటరిగా చేయాల్సిందే .. ఆ పోరాటంలో గెలవాల్సిందే అనే సందేశమిచ్చిన సినిమా ఇది.
ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించిన కుర్రాళ్లంతా చాలా బాగా చేశారు. ఎవరికి వారికి తమ కాలేజ్ రోజులు గుర్తుకు వచ్చేలా సన్నివేశాలు సాగుతాయి. అఖిల్ ఫొటోగ్రఫీ .. రజత్ ప్రకాశ్ నేపథ్య సంగీతం .. కన్నన్ మోహన్ ఎడిటింగ్ బాగున్నాయి.
మిడిల్ క్లాస్ జీవితాల నేపథ్యాల నుంచి .. కాలేజ్ స్టూడెంట్స్ వైపు నుంచి .. విదేశాలలో ఉన్న పరిస్థితుల వైపు నుంచి ఈ కథను ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది. 'కష్టపడి చదువుకుంటేనే ఎదగడానికి ఎంతో సమయం పడుతుంది. అలాంటిది మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే, ఆ మత్తులో నుంచి తేరుకునేలోగా ఈ ప్రపంచం అందుకోలేనంత ముందుకు వెళ్లిపోతుంది' అంటూ యువతను ఆలోచింపజేసి డైలాగ్ ఈ సినిమా మొత్తానికి హైలైట్ అని చెప్పాలి.ప్రేమ .. స్నేహం .. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా తప్పకుండా కనెక్ట్ అవుతుంది.
'వాలా 2' (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!
Vaazha 2 Review
Movie Details
Movie Name: Vaazha 2
Release Date: 2026-05-08
Cast: Hashir, Alan Bin, Ajin Joy, Vinayak, Veda Shankar, Devaraj, Aju Varghese
Director: Savin SA
Music: Rajath Prakash
Banner: Imagin Cinemas
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer