'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

ప్రదీప్ రంగనాథన్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన ఎంచుకునే కథలు .. పాత్రలే అందుకు కారణమని చెప్పాలి. ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలు 100 కోట్ల మార్కును టచ్ చేయడంతో, సహజంగానే ఆయన తదుపరి సినిమాల పట్ల ప్రేక్షకులకు అంచనాలు పెరిగిపోతూ వచ్చాయి. అలా ఆయన చేసిన సినిమానే 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'(LIK) ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజు (మే 6వ తేదీ) నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ కథ 2040లో మొదలవుతుంది. యువత ఎప్పుడూ ప్రేమ వెనుక పరుగులు తీస్తూనే ఉంటుంది. అలాంటి యువత బలహీనతను ఆసరాగా చేసుకుని, సూర్య (ఎస్ జె సూర్య) లవ్ ఇన్సూరెన్స్ కంపెనీని నెలకొల్పుతాడు. యువతీ యువకులకు తన యాప్ ద్వారా ప్రేమించుకుని .. పెళ్లి చేసుకునే ఒక అవకాశాన్ని కల్పిస్తాడు. ఆ యాప్ ను సబ్ స్క్రైబ్ చేసుకుని, తమకి కావలసిన జోడీని సెట్ చేసుకోవచ్చు. పెళ్లి చేసుకోవాలంటే 'లవ్ స్కోర్' ఎక్కువగా ఉండాలి. అది లేకపోతే బ్రేకప్ చెప్పుకోవచ్చు. 

అలాంటి ఒక యాప్ ను 'దీమా' (కృతి శెట్టి) సబ్ స్క్రైబ్ చేసుకుంటుంది. తనకి తగిన జోడీ కోసం ఆమె సెర్చ్ చేస్తూ ఉంటుంది. అనుకోకుండా ఆమెను చూసిన వాసు ( ప్రదీప్ రంగనాథన్) మనసు పారేసుకుంటాడు. 'దీమా'కి చేరువ కావాలంటే తాను ఫోన్ వాడాలి .. సబ్ స్క్రైబర్ కావాలి. కానీ అందుకు అతని తండ్రి ఒప్పుకోడు. మొబైల్ వాడటానికి అతను పూర్తి వ్యతిరేకి. అందుకు ఒక బలమైన కారణం కూడా ఉంటుంది. అయినా తండ్రికి తెలియకుండా అతను ఫోన్ తీసుకుని, దీమాకి టచ్ లోకి వెళతాడు. 

అలా  దీమా .. వాసు మధ్య పరిచయం మొదలై ప్రేమగా మారుతుంది. ఒకానొక సందర్భంలో వాళ్లు తమ లవ్ స్కోర్ చెక్ చేసుకుంటారు. లవ్ స్కోర్ చాలా తక్కువగా ఉండటంతో, వాసూకి దీమా బ్రేకప్ చెబుతుంది. తన ప్రేమలో లోపం లేదనీ, ఆ యాప్ లోనే లోపం ఉందని వాసు భావిస్తాడు. ఆ విషయాన్ని నిరూపిస్తానని సూర్యతో ఛాలెంజ్ చేస్తాడు. ఆ ప్రయత్నంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనేదే కథ.

ఇప్పటికే లెక్కలేనన్ని యాప్ లు స్మార్ట్ ఫోన్ లను వెతుక్కుంటూ వస్తున్నాయి. స్మార్టు ఫోన్ ఉంటే చాలు అన్ని రకాల వ్యవహారాలు అందుబాటులో ఉన్నట్టే. అలా ఇద్దరు వ్యక్తుల మధ్య గల ప్రేమను కొలిచే యాప్ కూడా 2040 కాలం నాటికి రావచ్చనీ .. అలాంటి ఒక యాప్ వస్తే ఎలా ఉంటుందనే ఊహకు దృశ్య రూపమే ఈ సినిమా. 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' పేరుతో దర్శకుడు ఈ కథను తయారు చేసుకున్నాడు. 

ఒకప్పటి ప్రేమలు వేరు .. అప్పటి పరిస్థితులు వేరు. కాలం మారిపోయింది .. మనుషులు మారిపోయారు .. ప్రేమకు అర్థాలు - నిర్వచనాలు మారిపోయాయి. ఇప్పటికే విడిపోవడం .. మరిచిపోవడం అనేవి చాలా వేగంగా జరుగుతూ వస్తున్నాయి.  2040 నాటికి యూత్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ప్రేమికుల ధోరణి ఎలా ఉంటుంది? ప్రేమలు ఎలా ఉంటాయి? అనే ఒక అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

హీరో తన తండ్రికి ఇచ్చిన మాటను పక్కన పెట్టేసి యాప్ వైపు రావడం .. ప్రేమను యాప్ ఎప్పుడూ కొలవలేదని నిరూపిస్తానని విలన్ తో ఛాలెంజ్ చేయడంతో, సెకండాఫ్ పై అందరిలో అంచనాలు పెరుగుతాయి. అయితే తాను అనుకున్నది సాధించడానికి హీరో అనుసరించే మార్గం అంత ఆసక్తికరంగా అనిపించదు. అతను చేసే ప్రయత్నాలు కుతూహలాన్ని రేకెత్తించవు.

ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ .. అందుకు సంబంధించిన ఎమోషన్ తప్ప, ఈ కథలో కదిలించే అంశాలేవీ లేవు. ఫస్టాఫ్ లోని కామెడీయే అంతంత మాత్రంగా ఉందనుకుంటే, సెకండాఫ్ లో కామెడీ మరింత బలహీనపడుతుంది. ప్రేమకథలకు ఫీల్ గుడ్ సాంగ్స్ ప్రాణమని చెబుతుంటారు. కానీ 2040 నాటికి పాటలు ఇలాగే అర్థం లేకుండా .. అర్థం కాకుండా ఉంటాయనుకున్నారేమో అలాగే కొనసాగుతూ వెళతాయి. 

కృతి శెట్టి నటన విషయం పక్కన పెడితే, అంతకుముందు సినిమాలలో మాదిరిగా ఆమెను అందంగా చూపించలేకపోయారు. ప్రదీప్ ..  ఎస్ జె సూర్య నటన ఓకే. ఫొటోగ్రఫీ ఫరవాలేదు. బాణీలు పెద్దగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి.    

మనసులోని ప్రేమ గాఢతను కొలిచే ఒక యాప్ వస్తే ఎలా ఉంటుంది? అనే విఘ్నేశ్ శివన్ ఆలోచన బాగానే అనిపిస్తుందిగానీ, ఆ ఆలోచనకు దృశ్య రూపాన్ని ఇవ్వడంలో ఆయన పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి. ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతూ ఈ కథ ప్రేక్షకుల సహనానికి పరీక్షపెడుతుంది.

Movie Details

Movie Name: Love Insurance Kompany

Release Date:

Cast: Pradeep Ranganathan,Krithi Shetty ,S J Suryah,Gouri G Kishan, Seeman, Yogi Babu

Director: Vignesh Shivan

Producer: Nayanthara

Music: Anirudh Ravichander

Banner: Rowdy Pictures

Love Insurance Kompany Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews