'వలతు వశతే కల్లన్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

ఈ ఏడాది మలయాళంలో అందరిలో ఆసక్తిని రేకెత్తించిన మల్టీస్టారర్ సినిమాగా 'వలతు వశతే కల్లన్' కనిపిస్తుంది. జోజూ జార్జ్ - బిజూ మీనన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. 'దృశ్యం' సిరీస్ తో వరుస విజయాలను అందుకుంటూ వెళుతున్న జీతూ జోసెఫ్ కి మంచి క్రేజ్ ఉంది. అలాంటి ఆయన రూపొందించిన ఈ సినిమా, ఈ ఏడాది జనవరి 30వ తేదీన థియేటర్లకు వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, ఏప్రిల్ 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రీసెంటుగా తెలుగు ఆడియో అందుబాటులోకి వచ్చింది. 

'కాలడి' పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐగా 'ఆంటోని' (బిజూ మీనన్) పనిచేస్తూ ఉంటాడు. ఆ ప్రాంతానికి చెందిన రాజకీయనాయకుడు మురళి చేతిలో మనిషి ఆంటోని. అందువలన మురళి కొడుకు 'రాజీవ్' చేసే తప్పులను ఎప్పటికప్పుడు కప్పిపుచ్చుతూ వెళుతుంటాడు. అలాంటి వాటిలో 'దీప్తి' కేసు కూడా ఒకటి. అయితే రాజీవ్ తో చేరి తన కొడుకు 'ఫిలిప్' కూడా చెడిపోతున్నాడనే ఒక ఆందోళన ఆంటోనికి ఉంటుంది. ఈ విషయంలో అతను ఫిలిప్ ను ఎంతగా మందలించినా ప్రయోజనం లేకుండా పోతుంది. 

అలాంటి పరిస్థితులలోనే ఆ పోలీస్ స్టేషన్ కి 'శామ్యూల్' (జోజూ జార్జ్) వస్తాడు. తన కూతురు 'లా' చేసిందనీ, కార్లో ఇంటి నుంచి బయల్దేరిన ఆమె ఆ తరువాత కనిపించకుండా పోయిందని చెబుతాడు. దీప్తి హత్య కేసుకు సంబంధించిన విషయంలో, తనకి రాజీవ్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నట్టుగా తనతో కూతురు చెప్పిందని అంటాడు. తన కూతురును కాపాడమని కోరతాడు. అతను ఎథికల్ హ్యాకర్ కావడంతో, ఆంటోని ఆలోచనలో పడతాడు.

అయితే ఆ తరువాత ఓ నిర్జన ప్రదేశంలో శామ్యూల్ కూతురు డెడ్ బాడీ దొరుకుతుంది. దీప్తి కేసు విషయంలో తన కూతురు సీఐ ఆంటోనికి వ్యతిరేకంగా పనిచేస్తుందనే విషయం అప్పుడే శామ్యూల్ కి అర్థమవుతుంది. తన కూతురు చనిపోవడం వెనుక ఆంటోని హస్తం ఉండొచ్చని భావిస్తాడు. అప్పుడు శామ్యూల్ ఏం చేస్తాడు? అసలైన నేరస్థులను చట్టానికి అప్పగించడానికి అతను ఎంచుకున్న మార్గం ఏమిటి? అనేది కథ.       

'వలతు వశతే కన్నన్' అంటే, 'కుడి పక్కన ఉన్న దొంగ' అని అర్థం. సాధారణంగా నేరం చేసినవారి కోసం పోలీసులు ఎక్కడెక్కడో వెదుకుతూ ఉంటారు. ఆ నేరస్థుడు పక్కనే ఉన్నప్పుడు, వాడిని కనిపెట్టడం .. పట్టుకోవడం మరింత కష్టమవుతూ ఉంటుంది. ఆ అర్థంలో పెట్టిన టైటిల్ ఇది. 

సాధారణంగా అధికారం తమ చేతిలో ఉంది కదా అని కొంతమంది పోలీస్ లు, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. స్వార్థపరులైన రాజకీయ నాయకులు చెప్పినట్టుగా వింటూ, వాళ్లకి అండగా నిలబడుతుంటారు. ఇక దారితప్పిన తండ్రుల బాటలోనే వారి పిల్లలు కూడా నడుస్తుంటారు. తమ పిల్లలు చేసే నేరాలు బయటికి రాకుండా, వాళ్ల తండ్రులు మేనేజ్ చేస్తుంటారు. అలాంటి వాళ్లను వెతుక్కుంటూ సరైనవాడు ఒకడు వస్తే ఎలా ఉంటుందనేదే ఈ కథ.

సాధారణంగా ఎవరైనా సరే తమకి అన్యాయం జరిగిందని చెప్పడానికి పోలీస్ స్టేషన్ కి వెళతారు. అయితే అక్కడికి వెళితే ఎలాంటి పరిస్థితులలోను తమకి న్యాయం జరగదని తెలిసినప్పుడు, ఆ బాధితుడు ఎలా స్పందిస్తాడు? నేరస్థుడు డబ్బున్నవాడైతే ఇక ఆ కేసు ముందుకు వెళ్లదని గ్రహించిన అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఫలితంగా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? అనే దిశగా దర్శకుడు ఈ కథను పరిగెత్తించాడు.

'దృశ్యం' సినిమాను అందించిన దర్శకుడే ఈ సినిమాను తెరకెక్కించడం వలన, ఈ రెండు కథల  మధ్య కొన్ని పోలికలు .. లక్షణాలు కనిపిస్తాయి. 'దృశ్యం'లో తనకి గల సినిమా పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని హీరో పోలీస్ వారికి చుక్కలు చూపిస్తాడు. ఈ సినిమాలోను అంతే. ఎథికల్ హ్యాకర్ గా ఉన్న ఓ తండ్రి, తనకి తెలిసిన అదే పని వలన పోలీస్ వారిని ఎలా పరుగులు పెట్టించాడనేది ఆకట్టుకుంటుంది.

అయితే ఈ సినిమాలో శామ్యూల్ తన కూతురు దారుణంగా హత్య చేయబడిందని తెలుసుకునేంత వరకూ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. ఆ తరువాత నుంచి కథ రొటీన్ బాటపడుతుంది.
శామ్యూల్ తనకి జరిగిన అన్యాయానికి ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు? అని కుతూహలంతో ఎదురుచూసిన ప్రేక్షకులకు, రొటీన్ సన్నివేశాలు నిరాశను కలిగిస్తాయి. అదే సమయంలో గతంలో అమ్మాయిల మిస్సింగ్ వ్యవహారాలను తెరపైకి తీసుకొచ్చి గందరగోళం చేశారు.

అసలైన శామ్యూల్ హాస్పిటల్లో బెడ్ పై ఉంటాడు. ఆంటోని పోలీస్ స్టేషన్ కి పరిమితమవుతాడు. ఈ మధ్యలో మిగతా పోలీసుల హడావిడి తప్ప, ఆడియన్స్ ను కదిలించే సన్నివేశాలైతే కనిపించవు. అప్పటివరకూ ఆడియన్స్ కి పరిచయం లేని పాత్రల పేర్లు చెబుతూ .. ఆ కేసులను ఈ కేసుతో ముడిపెడుతూ అయోమయాన్ని కలిగించారు. క్లైమాక్స్ మాత్రం సరైనదిగా అనిపిస్తుంది. 

సతీశ్ కురుప్ ఫొటోగ్రఫీ .. విష్ణు శ్యామ్ నేపథ్య సంగీతం .. వినాయక్ ఎడిటింగ్ కథను సపోర్టు చేసిన విధానం బాగుంది. జోజూ జార్జ్ - బిజూ మీనన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. 'దృశ్యం' సినిమా మాదిరిగానే ఈ కథ కూడా ఒక సామన్యుడికీ .. పోలీస్ ఆఫీసర్ కి మధ్య జరిగేదే. అయితే ఆ సినిమాలోని స్క్రీన్ ప్లే .. ట్విస్టులు .. ఈ కథలో మిస్సయ్యాయి. కథ బలపడవలసిన చోట చతికిల పడిపోవడమే కాకుండా, కాస్త గందరగోళాన్ని కూడా కలిగించిందనే చెప్పాలి.    

Movie Details

Movie Name: Valathu Vashathe Kallan

Release Date:

Cast: Joju George, Biju Menon, Lena, Leona Lishoy, Vyshnavi Raj, Niranjana Anoop, Shaju Sreedhar

Director: Jeethu Joseph

Producer: Shaji Nadesan

Music: Vishnu Shyam

Banner: August Cinema

Valathu Vashathe Kallan Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews