'ధురంధర్: ది రివెంజ్' - మూవీ రివ్యూ !

రణ్ వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన 'ధురంధర్' క్రితం ఏడాది డిసెంబర్ లో థియేటర్లకు వచ్చింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, సంచలన విజయాన్ని సాధించింది. దాంతో సహజంగానే సీక్వెల్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన 'ధురంధర్: ది రివెంజ్' థియేటర్లలో దిగిపోయింది. సాంకేతిక కారణాల వలన తెలుగు వెర్షన్ మాత్రం రెండు రోజుల ఆలస్యంగా విడుదలైంది.

జస్కిరాత్ సింగ్ (రణ్ వీర్ సింగ్) తన పేరును 'హంజా అలీ మజారి'గా మార్చుకుని, స్పై ఏజెంట్ గా పాకిస్థాన్ లో అడుగుపెడతాడు. తాను అనుకున్నది సాధించడం కోసం మాఫియా ముఠా వైపు అడుగులు వేస్తాడు. అక్కడి రాజకీయాలు ఉగ్రవాదంతో ఎలా ముడిపడి ఉన్నాయనేది గమనించడం మొదలుపెడతాడు. భారత్ ను దెబ్బతీయడానికి పాకిస్థాన్ ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేస్తుందనే విషయాన్ని పసిగట్టడంపై పూర్తి దృష్టి పెడతాడు. 

'ల్యారీ' నగరంలోని మాఫియా 'కరాచీ' పట్టణాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. కరాచీలోని పరిస్థితులు పాకిస్థాన్ పై ప్రభావం చూపుతుంటాయి. అందువలన 'ల్యారీ'పై పట్టు సాధించడానికి ఒక వైపున 'బలోచ్'లు .. మరో వైపున 'పఠాన్'లు ప్రయత్నం చేస్తూ ఉంటారు. తన అన్నయ్య రెహమాన్  చావుకి కారణమైన అర్షద్ పప్పూ (అశ్విన్ ధర్)ను అంతం చేసి, ఆ పీఠాన్ని దక్కించుకోవడానికి ఉజెయిర్ బలోచ్ (డానిష్) ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఆ ప్రయత్నం నెరవేరకుండా హంజా అడ్డుపడుతూ ఉంటాడు.

దావూద్ ఇబ్రహీం మంచాన పడినప్పటికీ, అతని కనుసన్నలలోనే అనుచరులు పనిచేస్తూ ఉంటారు. అతని ఆదేశం మేరకు పనులు జరిగేలా ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) పర్యవేక్షిస్తూ ఉంటాడు. భారత్ లోని ఉత్తర్ ప్రదేశ్ లోని ఎన్నికలను ప్రభావితం చేయడానికి వేలకోట్ల నకిలీ కరెన్సీని తరలించడానికి సన్నాహాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఒక వైపు నుంచి మారణ ఆయుధాలను .. మాదక ద్రవ్యాలను, మరో వైపున తీవ్రవాదులను తరలించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. 

ఏయే వైపులా నుంచి భారత్ కి ప్రమాదం పొంచి ఉందనేది హంజాకి పూర్తిగా అర్థమవుతుంది. అదే సమయంలో అతను ఎవరనేది ఎస్పీ అస్లామ్ (సంజయ్ దత్)కి డౌట్ వస్తుంది. హంజా .. భారత్ కి చెందిన సీక్రెట్ ఏజెంట్ అనే విషయం 'ఎలీనా' (సారా అర్జున్)తో పాటు, ఇక్బాల్ ముఠాకి   తెలిసిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? హంజా ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? అతను అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడతాడా లేదా? గతంలో సైన్యంలో చేరడం కోసం శిక్షణ తీసుకున్న అతను, ఇండియాలో జైలు జీవితాన్ని ఎందుకు అనుభవించవలసి వచ్చింది? అనేది మిగతా కథ.
 
 భారత్ లో మారణకాండను సృష్టించడం కోసం పాకిస్థాన్ లోని తీవ్రవాదులు అనేక మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ల ప్రణాళికలు ఏమిటనేది పసిగట్టి .. వాళ్ల నుంచి భారత్ ని రక్షించడం కోసం అక్కడి నేలపై అడుగుపెట్టిన ఒక ఖైదీ కథ ఇది. ఉన్న ఊరు పట్ల .. కన్న తల్లి పట్ల .. దేశం పట్ల ప్రేమ ఉన్నవాడు, వాటిని కాపాడుకోవడం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయడు అనే కాన్సెప్ట్ తో ఈ కథ ముందుకు వెళ్లడం కనిపిస్తుంది.

ఈ కథ .. పాకిస్థాన్ లోని హీరో చుట్టూ తిరుగుతుంది. దర్శకుడు ఈ పాత్రను తీర్చిదిద్దిన తీరు, ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తుంది. హీరో తన ప్రాణాలను గురించి ఎక్కడా ఎప్పుడూ ఆలోచన చేసినట్టుగా కనిపించడు. ఇండియాను దెబ్బతీసే ఏ ఆయుధం అటువైపు వెళ్లకూడదనే ఉద్దేశంతో అతను వ్యవహరించే విధానమే ఈ పాత్రను ఆడియన్స్ కి మరింత చేరువ చేస్తుంది. ఇక పాకిస్థాన్ లోని తీవ్రవాదులతో వారిలో ఒకరిగా ఉంటూనే, వారిని తుదముట్టించే తీరు, ఆడియన్స్ లో ఉత్కంఠను పెంచుతుంది. 

పాకిస్థాన్ లో తీవ్రవాదుల కదలికలు ఎలా ఉంటాయి? వాళ్ల సమావేశాలు ఎలా జరుగుతాయి? భారత్ కి ఏయే వైపుల నుంచి ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని దర్శకుడు చూపించిన విధానం సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఇక లొకేషన్స్ విషయంలో తీసుకున్న శ్రద్ధకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే నిజంగానే పాకిస్థాన్ లో తీశారేమో అనే ఒక ఆలోచన రాకుండా ఉండదు. ఈ కథను చాప్టర్లుగా విడదీసి చూపించడం వలన, సామాన్య ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా చేయగలిగారు.

ప్రధానమైన పాత్రలు .. ఆ పాత్రల మధ్య గల సంబంధాలను దర్శకుడు డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. నకిలీ కరెన్సీని తగులబెట్టే సీన్ .. వాష్ రూమ్ లో 'బిందా'ను చంపే సీన్ .. ఇక్బాల్ ను కలిసే సీన్ .. ఆ నేపథ్యంలో యాక్షన్ లోకి దిగిపోయే సన్నివేశాలను చిత్రీకరించిన విధానం మెప్పిస్తుంది. సందర్భాను సారంగా తెరపై టీవీలో 'మోదీ'  కనిపించినప్పుడు .. తీవ్రవాదితో 'భారత్ మాతాకీ జై' అనిపించినప్పుడు,ఆడిటోరియం నుంచి విపరీతమైన రెస్పాన్స్ కనిపిస్తుంది.    

'దురంధర్' ఫస్టు పార్టుతో పోలిస్తే, సీక్వెల్ లో ఎమోషన్ పాళ్లు తగ్గాయనే చెప్పాలి. యాక్షన్ సన్నివేశాలే ప్రాణంగా నడుస్తుంది. ఫైట్స్ చాలా దారుణంగా అనిపిస్తాయి. కాళ్లు .. చేతులు .. మెడ నరికేయడం. అందరూ చూస్తుండగా సెంటర్లో పబ్లిక్ గా తలకాయను పరపరా కోసేసి విసిరేయడం .. కంట్లోను .. రెండు కాళ్ల మధ్య లోను గన్ పెట్టి షూట్ చేయడం వంటివి చూసి తట్టుకోవడం కష్టంగానే అనిపిస్తుంది.                  
 
రణ్ వీర్ సింగ్ .. సంజయ్ దత్ .. అర్జున్ రామ్ పాల్ .. మాధవన్ .. రాకేశ్ బేడీ .. ఇలా అందరూ  ఎవరి పాత్రలో వారు జీవించారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయని చెప్పొచ్చు. దాదాపు 4 గంటల నిడివి కలిగిన ఈ సినిమా, ఎడిటింగ్ వైవు నుంచి కూడా మంచి మార్కులను సంపాదించుకుంటుంది. 'మా యుద్ధం మీ దేశంతో కాదు, మీ దేశంలోని తీవ్రవాదంతో' అనే హీరో డైలాగ్ ఈ కథ మొత్తంలో కీలకం. హింసా - రక్తపాతం పాళ్లు మోతాదు మించి కనిపించినప్పటికీ, దేశభక్తితో కూడిన కంటెంట్ యాక్షన్ ప్రియులకు నచ్చుతుందనే చెప్పాలి. 

Movie Details

Movie Name: Dhurandhar: The Revenge

Release Date:

Cast: Ranveer Singh, Madhavan, Arjun Rampal, Sanjay Dutt, Sara Arjun, Rakesh Bedi

Director: Aditya Dhar

Producer: Jyothi Desh Pande- Aditya Dhar

Music: Shashwath Sachdev

Banner: B 62 Studios

Dhurandhar: The Revenge Rating: 3.50 out of 5

Trailer

More Movie Reviews