సముద్రపు దొంగల దాడులు .. దోపిడీలు .. నిధుల గురించిన అన్వేషణ నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అదే తరహా కథతో రూపొందిన సినిమానే 'ది బ్లఫ్'. ప్రియాంక చోప్రా .. కార్ల్ అర్బన్ .. ఇస్మాయిల్ క్రూజ్ కార్డోవా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఫిబ్రవరి 26వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. వివిధ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్, ఏ స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకుందనేది చూద్దాం.
ఈ కథ 1846లో .. కరేబియన్ సముద్ర ప్రాంతంలో మొదలవుతుంది. కెప్టెన్ కాన్నర్ (కాల్ అర్బన్) తన బృందంతో కలిసి సముద్ర దొంగతనాలు చేస్తుంటాడు. అత్యంత శక్తిమంతమైన క్రూరుడిగా ఆయన గురించి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి కాన్నర్ ఒక రోజున ఒక నౌకపై దాడి చేస్తాడు. ఆ నౌక బోడెన్ (ఇస్మాయిల్ క్రూజ్ కార్డోవా)కి సంబంధించినది. ఆ నౌకలో ప్రత్యేకమైన ముద్ర కలిగిన ఒక బంగారం అచ్చు అతనికి కనిపిస్తుంది. ఆ బంగారం అచ్చు చూడగానే అతనికి ఎర్సెల్ (ప్రియాంక చోప్రా) గుర్తుకు వస్తుంది.
'కేమన్ బ్రాక్' దీవిలో ఎర్సెల్ తన కొడుకు ఐజాక్ .. ఆడపడుచు ఎలిజబెత్ తో కలిసి నివసిస్తూ ఉంటుంది. ఐజాక్ ఇతరుల సాయం లేకుండా నడవలేడు. అందువలన ఎర్సెల్ అతణ్ణి కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. 'వెస్టన్' ప్రేమలో పడిన ఎలిజబెత్ అతనితో ఇల్లొదిలి వెళ్లిపోవడానికి రహస్య ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటుంది. సముద్రంపైకి వెళ్లి రెండు నెలలు అవుతున్నా బోడెన్ బృందం తిరిగిరాకపోవడంతో దీవి ప్రజలు ఆలోచనలో పడతారు.
బోడెన్ భార్యనే ఎర్సెల్ అని తెలుసుకున్న కాన్నర్, బోడెన్ తో పాటు అతని బృందాన్ని బంధిస్తాడు. అతని ద్వారా ఎర్సెల్ ను పట్టుకోవడానికి ఆ దీవికి చేరుకుంటాడు. తన అనుచరులతో కలిసి ఒక్కసారిగా ఆ దీవిపై విరుచుకుపడతాడు. అప్పుడు ఎర్సెల్ ఏం చేస్తుంది? గతంలో ఆమెతో కాన్నర్ కి ఉన్న సంబంధం ఏమిటి? బంగారం అచ్చు చూడగానే అతనికి ఆమె ఎందుకు గుర్తుకొస్తుంది? తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎర్సెల్ ఎలాంటి ప్రమాదాలను ఫేస్ చేస్తుంది? అనేది మిగతా కథ.
ఎవరి జీవితాన్నైనా పరిస్థితులు ప్రభావితం చేస్తుంటాయి. అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనలు జీవితంలో కొత్త మలుపులకు కారణమవుతూ ఉంటాయి. అప్పటివరకూ చూడని కొత్త అనుభవాలను పరిచయం చేస్తాయి .. కొత్త పాఠాలను నేర్పుతాయి. అయితే అలాంటి అనుభవాలను గతంలోకి నెట్టేసి, తిరిగి సాధారణ జీవితాన్ని ఎంచుకునేవారు కొంతమంది ఉంటారు. కుటుంబ జీవితాన్ని ఆనందంగా గడుపుతుంటారు. అలాంటి వాళ్లను పాత పరిచయాలు వెంటాడితే ఎలా ఉంటుందనేదే ఈ కథ.
సముద్రం .. సముద్రపు దొంగలు .. దీవులు .. ఖజానా .. అన్వేషణ .. అనే అంశాలు ఎప్పటికీ ఉత్కంఠను రేకెత్తించేవే. ఆ అంశాలన్నీ కలిసిన కథ ఇది. అత్యంత ప్రమాదకారి అయిన సముద్రపు దొంగల నాయకుడి నిర్బంధం నుంచి ఎర్సెల్ తన భర్తను కాపాడుకోవాలి .. నిస్సహాయుడైన తన కొడుకును రక్షించుకోవాలి. మరోవైపున శత్రువు చేతికి ఖజానా దక్కకుండా చూసుకోవాలి. అందుకు సంబంధించి దర్శకుడు డిజైన్ చేసుకున్న సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి.
కథా పరంగా చూసుకుంటే కొత్తదనం ఉన్నదేమీ కాదు. ఇంతకుముందు ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. అయితే చిత్రీకరణ పరంగా కొత్తగా అనిపిస్తుంది. సముద్రపు దొంగల బారి నుంచి ఎర్సెల్ తప్పించుకోవడం .. అదను చూసి వాళ్లపై దాడి చేయడం వంటి సన్నివేశాలు కుతూహలాన్ని పెంచుతూ వెళతాయి. ఒక వైపున భర్త వైపు నుంచి .. మరోవైపున కొడుకు వైపు నుంచి ఉన్న ఎమోషన్ కనెక్ట్ అవుతూ ఉంటుంది.
ఇది ఖజానా కోసం దీవిలో జరిగే అన్వేషణ కావడంతో యాక్షన్ సీన్స్ పుష్కలంగా కనిపిస్తాయి. యాక్షన్ ఎపిసోడ్స్ ను డిజైన్ చేసిన విధానం కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. 1846 కాలం నాటి నేపథ్యాన్ని చూపించిన విధానం, మనలను ఆ కాలంలోకి తీసుకుని వెళుతుంది. ప్రేక్షకులను ఆ కాలానికి కట్టేయడంలో తమ ప్రతిభను చూపించారు.
ప్రియాంక చోప్రా యాక్షన్ సీన్స్ లో తన మార్క్ చూపించింది. తాను కాకుండా పాత్ర మాత్రమే కనిపించేలా మెప్పించగలిగింది. మిగిలిన ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. కెమెరా పనితనం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెప్పాలి. లొకేషన్స్ ను తెరపై ఆవిష్కరించిన తీరు గొప్పగా అనిపిస్తుంది. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ వైపు నుంచి కూడా మంచి మార్కులు పడతాయి.
కథ దాదాపు అందరికీ తెలిసిందే అయినా, ఆవిష్కరణ ఆసక్తికరంగా ఉంటుంది. 1846 నేపథ్యంలో నడిచే ఈ కథ, బలమైన ఎమోషన్స్ తో .. యాక్షన్ సీన్స్ తో కొనసాగుతుంది. రొమాన్స్ వైపు నుంచి అభ్యంతరకరమైన సన్నివేశాలేమీ లేవు గానీ, హింస .. రక్తపాతం మాత్రం కాస్త ఇబ్బందిపెడతాయి.
'ది బ్లఫ్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
The Bluff Review
Movie Details
Movie Name: The Bluff
Release Date: 2026-02-26
Cast: Priyanka Chopra, Karl Urban, Ismael, Safia Oakley, Vedanten Naidoo
Director: Frank E Flowers
Music: Henry Jackman
Banner: AGBO
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer