కరోనా అనే మాట వినడానికి కూడా చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే ఈ మాట వినగానే, గతంలో చూసిన భయానక దృశ్యాలు కళ్లముందు కదలాడతాయి. మనసును తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తాయి. అలాంటి కరోనా నేపథ్యంలో ఎమోషన్స్ తో కూడిన సినిమాలు .. కామెడీతో కూడిన కంటెంటులు చాలా వచ్చాయి. కరోనా నేపథ్యంలో నడిచే ప్రేమకథగా వచ్చిన సినిమానే 'సంధ్యానామ ఉపాసతే'. ఈ రోజు నుంచే ఈ సినిమా 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్ అవుతోంది.

కరోనా అనే మాటతో పాటు అందరినీ కంగారెత్తించిన మాటలు మరో రెండు ఉన్నాయి. ఒకటి 'క్వారంటైన్' అయితే మరొకటి 'లాక్ డౌన్'. ఆ సమయంలో నడిచే కథ ఇది. రామరాజు .. ఆయన మనవరాలు 'సంధ్య' (క్రిస్టన్ రవళి)కి కరోనా వస్తుంది. దాంతో వాళ్లు క్వారంటైన్ కి తరలించబడతారు. అప్పటికే అక్కడ మరో ఆరుగురు పేషంట్లు ఉంటారు. ఎవరికి వాళ్లు తమ వాళ్లకి కాల్ చేస్తూ కాలక్షేపం చేస్తుంటారు.

అదే సమయంలో ఉదయ్ (వంశీ కిరణ్) కూడా క్వారంటైన్ కి వస్తాడు. అక్కడి వాళ్లలో తమకి కరోనా వచ్చిందనే భయం కన్నా, తమ వాళ్లకి దూరంగా ఉండవలసి వచ్చినందుకు బాధపడుతున్నారనే విషయాన్ని ఉదయ్ గ్రహిస్తాడు. వాళ్లలో భయం పోగొట్టడానికి తనవంతు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే సంధ్యతో అతనికి సాన్నిహిత్యం పెరుగుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. 

తన పేరెంట్స్ తనకి ఒక సంబంధం చూశారనీ, సాధ్యమైనంత త్వరలో పెళ్లి చేస్తారనే విషయం సంధ్యకి తెలుస్తుంది. అలాంటి పరిస్థితులలోనే ఆమెకి నెగెటివ్ రిపోర్టు రావడంతో క్వారంటైన్ నుంచి పంపించి వేస్తారు. ఉదయ్ కి పాజిటివ్ రావడంతో అక్కడే ఉంచేస్తారు. ఆ తరువాత ఏం జరుగుతుంది? ఉదయ్ బయటికి వస్తాడా? వాళ్ల పెళ్లి జరుగుతుందా? క్వారంటైన్ లో ఉన్నవారి జీవితాలలో ఎలాంటి మలుపులు చోటుచేసుకుంటాయి? అనేది మిగతా కథ.   

కరోనా అనేది మనిషిని చూసి మనిషి భయపడే ఒక చిత్రమైన పరిస్థితిని తీసుకొచ్చింది. హాస్పిటల్ కి వెళ్లినవారు తిరిగి వస్తారో రారో .. మళ్లీ చూస్తామో లేదో తెలియని ఒక పరిస్థితి. ఎంతో బలమైనవని అనుకున్న బంధాలన్నీ .. ఎంతటి బలహీనమైనవనేది కరోనా నిరూపించింది. చివరిచూపు దక్కలేదని బాధపడేవారు కొందరు. కోలుకుని తిరిగి వస్తుంటే భయపడేవారు మరికొందరు. ఇలాంటి సన్నివేశాలను దర్శకుడు తనదైన శైలిలో ఆవిష్కరించాడు.

ఒక వైపు నుంచి కరోనాతో బాధపడుతూనే తమ బలహీనతలను వదులుకోని వారు కొంతమంది. ఎవరు ఏమైపోయినా ఫరవాలేదు .. తాను మాత్రం బ్రతకాలనే భయంతో రోజులు గడుపుతున్నవారు కొందరు. తన సంగతి ఎలా ఉన్నా, ఐసీయూలో ఉన్న తన భర్త ఎలా ఉన్నాడో అనే ఆందోళన చెందే ఇల్లాలు ఒక పక్కన. ఇలాంటి ఎమోషన్స్ ను సున్నితంగానే నడిపిస్తూ వెళ్లారు. ఇలాంటి ఒక వాతావరణాన్ని చూస్తూ పెరిగే ప్రేమకథ మరొక వైపు. 

దర్శకుడు కొన్ని పాత్రలను అనుకుని, 'క్వారంటైన్'లో ఆ పాత్రలను ఆసక్తికరంగా నడిపించాలని అనుకున్నాడు. అయితే అందుకోసం అతను చేసిన ప్రయత్నంలో కొంతవరకూ మాత్రమే సక్సెస్ అయ్యాడని చెప్పాలి. పోసాని .. జబర్దస్త్ అప్పారావు .. గోపరాజు విజయ్ పాత్రలను మరింత ఆసక్తికరంగా మలచుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా జరగలేదు. క్వారంటైన్ లో నడిపించే  ప్రేమకథ కూడా కనెక్ట్ కాలేదు.

ప్రేమకి ఎప్పుడూ కావల్సింది ఫీల్. ప్రేమ అనేది అందం .. ఆనందం .. అనుభూతి పరిమళం చుట్టూ తిరుగుతుంది. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పుడు ప్రేమ పుడుతుందేమోగానీ, ప్రమాదకర పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రేమ అనే ఆలోచనే రాదు. అలా క్వారంటైన్ లో పుట్టిన ప్రేమను తెరపై ఆవిష్కరించడానికి అవకాశం కూడా ఉండదు. ఇక్కడే ఈ కథాంశం సహజత్వానికి దూరమైందేమో అనిపిస్తుంది. 

ఇక చాలామందికి హాస్పిటల్ వాతావరణం .. అంబులెన్స్ కూతలు ఆందోళనను కలిగిస్తూ ఉంటాయి. అలాగే కరోనా మాస్కులు .. ఆక్సిజల్ సిలిండర్లు .. భయాలు .. మరణాలు మధ్యలో సున్నితమైన ప్రేమకథను టచ్ చేయాలనుకోవడం కూడా కరెక్ట్ కాదనే అనిపిస్తుంది. ప్రేమకథ సంగతి అలా ఉంచితే, ఎమోషన్స్ కూడా అంత బలంగా ఏమీ అనిపించవు. 

నటీనటుల విషయానికి వస్తే, ఎవరి పాత్రలో వారు బాగానే చేశారు. కాకపోతే ఆ ఆర్టిస్టుల నుంచి మరింత అవుట్ పుట్ రాబట్టొచ్చని అనిపిస్తుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. 

ప్రేమ పుట్టడానికి ఒక అనుకూలమైన.. ఆహ్లాదకరమైన వాతావరణమంటూ ఉండాలి. అలాంటి ప్రేమ నాలుగు గోడల మధ్య .. క్వారంటైన్ లో పుట్టినట్టుగా చూపించడం సహజత్వానికి చాలా దూరంగా అనిపిస్తుంది. ఇలా పొసగని అంశాలను కలిపి చూపించాలనుకోవడం, లవ్ .. ఎమోషన్ లో గాఢత లోపించడం కారణంగానే ఆడియన్స్ కి ఈ కంటెంట్ కనెక్ట్ కాలేదని అనిపిస్తుంది.