'అదర్స్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

-
తమిళంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ పేరే 'అదర్స్'. అబిన్ హరిహరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, క్రితం ఏడాది నవంబర్ 7వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఆదిత్య మాధవన్ .. గౌరీ కిషన్ .. అంజు కురియన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, డిసెంబర్ 19వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో  స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ నెల 9వ తేదీ నుంచి మాత్రమే తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది చూద్దాం.

ఈ కథ చెన్నైలో మొదలవుతుంది. చెన్నైలోని 'మదురవోయాల్' ప్రాంతంలో తెల్లవారు జామున 3 గంటలకు ఒక ప్రమాదం జరుగుతుంది. దాంతో పోలీస్ ఆఫీసర్ గా మాధవన్ (ఆదిత్య మాధవన్) రంగంలోకి దిగుతాడు. ప్రమాదానికి గురైన వ్యాన్ లో నలుగురు వ్యక్తులు చనిపోయి ఉంటారు. ముగ్గురు ఆడవాళ్లు .. ఒక పురుషుడికి సంబంధించిన మృతదేహాలు దొరుకుతాయి. అది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదనీ, డ్రైవర్ తప్పించుకున్నాడనే విషయాన్ని మాధవన్ గ్రహిస్తాడు. 

చనిపోయిన ముగ్గురు యువతులు పుట్టుకతో అంధులనీ, ప్రమాదానికి ముందే పురుషుడు చనిపోయాడంటూ పోస్టు మార్టం నివేదిక చెబుతుంది. దాంతో ఆ యువతులు ఏ శరణాలయానికి సంబంధించినవారు అనే విషయాన్ని కనిపెట్టే ప్రయత్నంలో మాధవన్ ఉంటాడు. అతనికి డాక్టర్ మధుమిత (గౌరీ కిషన్)తో కొంతకాలం క్రితం ఎంగేజ్ మెంట్ జరుగుతుంది. ఆమె ఒక కార్పొరేట్ ఆఫీసులో డాక్టర్ గా పనిచేస్తూ ఉంటుంది. అనురాధ అనే ఒక యువతికి ఆమె ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మొదలుపెడుతుంది. అయితే ఊహించని విధంగా ఆ యువతికి రియాక్షన్ వస్తుంది.      
  
ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు అంధ యువతులు, ఒక శరణాలయానికి చెందినవారనే విషయాన్ని మాధవన్ తెలుసుకుంటాడు. ఆ శరణాలయాన్ని జారా మిరియమ్ నిర్వహిస్తూ ఉంటుంది. ఆమెను ప్రశ్నించడానికి మాధవన్ వెళ్లిన సమయంలోనే ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. మాధవన్ ఈ కేసు విషయంలో ఛార్లెస్ .. మారి .. వేదా పేర్లు వింటాడు. ఈ ముగ్గురూ ఎవరూ? అనాథ యువతులను వారు ఎందుకు టార్గెట్ చేశారు? వారికీ .. ఐవీఎఫ్ ట్రీట్ మెంట్ కి ఉన్న సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ.

ఈ కథ చీకట్లో మొదలవుతుంది .. చీకటి కోణాలతో ముందుకు కదులుతుంది. కథ మొదలైన కొంత సేపటివరకూ ఎటు వెళుతుందనేది అర్థం కాదు. ఆ తరువాత నుంచి చీకట్లు తొలిగిపోయి అసలు విషయం మనకి అర్థం కావడం మొదలవుతుంది. హీరో - హీరోయిన్ ప్రేమించుకోవడం .. పెళ్లి చేసుకోవాలనుకోవడం సహజం. వాళ్లిద్దరికీ వృత్తి పరమైన ఒక సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య వాళ్లిద్దరినీ ఎలా సవాల్ చేసిందనేదే కథలోని ఆసక్తికరమైన అంశం.

పెళ్లైన ప్రతి జంట తమకి పిల్లలు కావాలని కోరుకుంటుంది. తప్పనిసరి పరిస్థితులలో కొంతమంది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ను ఆశ్రయిస్తూ ఉంటారు. ఐవీఎఫ్ ద్వారా తమ కలను నిజం చేసుకోవాలనుకుంటారు. అలాంటి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వెనుక గల చీకటి కోణాలను టచ్ చేస్తూ దర్శకుడు ఈ కథను అల్లుకోవడం జరిగింది. నేరస్థులు .. డాక్టర్లు .. పోలీసులు .. ఈ మూడు వైపుల నుంచి ఈ కథ పరిగెడుతూ ఉంటుంది. 

ఒక వైపున అనాథ యువతులు అదృశ్యం కావడం .. అంధ యువతులు చనిపోవడం .. మరో వైపున
ఐవీఎఫ్ బేబీస్ హార్మోన్ లలో ఊహించని మార్పులు జరుగుతుండటం .. పోలీసుల విచారణతో కథ పరిగెడుతూ ఉంటుంది. సాధారణంగా ఈ తరహా కథల్లో ప్రతినాయకుడు దూరంగా ఎక్కడో అద్దాలమేడల్లో ఉండి అంతా మానిటరింగ్ చేస్తూ ఉంటాడు. అందుకు భిన్నంగా ఈ కథలో విలన్ పాత్రను డిజైన్ చేసిన తీరు కొత్తగా అనిపిస్తుంది.

ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి సంబంధించిన చీకటి కోణాల చుట్టూనే దర్శకుడు ఈ కథను అల్లుకుంటూ వెళ్లాడు. కొంతమంది అవినీతిపరులు .. స్వార్థపరుల కారణంగా మొత్తం సమాజం ఎలాంటి ప్రమాదం బారిన పడుతుందనేది దర్శకుడు ఆవిష్కరించిన విధానం బాగుంది. అయితే  శరణాలయాల నిర్వాహకులు అంత తేలికగా మోసగాళ్ల మాటలు నమ్మేస్తారా? అనే ఒక ఆలోచన మాత్రం కలగక మానదు.

ప్రధానమైన పాత్రలలో కనిపించే నటీనటులంతా కూడా బాగా చేశారు. అరవింద్ సింగ్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. గిబ్రాన్ నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగినట్టుగా సాగుతుంది. రామర్ ఎడిటింగ్ నీట్ గా అనిపిస్తుంది.    
   
దర్శకుడు ఏ పాయింటునైతే చెప్పాలని అనుకున్నాడో, దానిని మాత్రమే తెరపై ఆవిష్కరించాడు. ఆ పాయింట్ చుట్టూ వినోదపరమైన మిగతా అంశాలేవీ అల్లుకోలేదు. అభ్యంతరకరమైన సన్నివేశాలు లేని ఈ సినిమా, కాన్సెప్ట్ బేస్డ్ కథగానే కనిపిస్తుంది. కథ మొత్తంగా చూసుకుంటే ఓ మాదిరిగా అనిపిస్తుందంతే.  

Movie Details

Movie Name: Others

Release Date:

Cast: Adithya Madhavan, Gouri Kishan, Anju Kurian, Sundararajan, Harish Peradi, Vinod Sagar

Director: Abin Hariharan

Producer: Murali

Music: Ghibran Vaibodha

Banner: Grand Pictures

Others Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews