ఈ మధ్య కాలంలో టైటిల్ దగ్గర నుంచే కొత్తదనం చూపించడానికి యువ దర్శకులు ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. యూత్ కీ .. మాస్ ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అయ్యేలా కంటెంట్ ఉండేలా చూసుకుంటున్నారు. అలాంటి సినిమాల జాబితాలో 'ఇట్లు మీ ఎదవ' కూడా కనిపిస్తుంది. త్రినాథ్ కఠారి దర్శకత్వం వహించిన ఈ సినిమా, గత ఏడాది థియేటర్లకు వచ్చింది. ఈ రోజు నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ: శ్రీను ఓ మిడిల్ క్లాస్ యువకుడు. మచిలీపట్నంలోని ఓ కాలేజ్ లో పీజీ చేస్తూ ఉంటాడు. అతని తండ్రి కృష్ణ (గోపరాజు రమణ) చిన్నపాటి బంగారం కొట్టు నడుపుతూ ఉంటాడు. చాలా ఏళ్లుగా పీజీలో నుంచి శ్రీను బయటపడకపోవడం ఆయనకు అసహనాన్ని కలిగిస్తూ ఉంటుంది. బంగారం కొట్టును కూడా అతను పట్టించుకోకపోవడం కోపాన్ని తెప్పిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ కాలేజ్ లో మనస్విని (సాహితి) చేరుతుంది. 

మనస్విని .. బ్యాంకు మేనేజర్ గా పనిచేసే సాయి (దేవీప్రసాద్) గారాల కూతురు. బదిలీపై సొంత ఊరుకే రావడం అతనికి ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీను .. మనస్విని పరిచయం కాలేజ్ లోనే జరుగుతుంది. అది కాస్తా ప్రేమగా మారుతుంది. ఆ విషయం తెలిసి కూతురుపై సాయి మండిపడతాడు. శ్రీనుతో పెళ్లికి ఎలాంటి పరిస్థితుల్లోను ఒప్పుకోనని తేల్చి చెబుతాడు. ఆ పరిస్థితులలో ఈ విషయంలో డాక్టర్ భరణి (తనికెళ్ల భరణి) జోక్యం చేసుకుంటాడు. 

శ్రీనుతో పాటు ఒక నెల రోజుల పాటు తిరగమనీ, ఆ తరువాత కూడా అతను ఎదవనే అనిపిస్తే అతనిని దూరం పెట్టేయమని సాయికి సలహా ఇస్తాడు. అందుకు మనస్విని కూడా అంగీకరిస్తుంది. తనతో పాటు సాయిని తిప్పడానికి శ్రీను ఒప్పుకుంటాడు. ఈ 30 రోజులలో ఏం జరుగుతుంది? శ్రీనుకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? సాయి మనసు మారుతుందా? అతని కూతురు పెళ్లి శ్రీనుతో జరుగుతుందా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: పెళ్లీడు కొచ్చిన కూతురును తనకంటే బాధ్యతగా చూసుకునే యువకుడికిచ్చి పెళ్లి చేయాలనే ప్రతి తండ్రి అనుకుంటాడు. ఈ లోగా తన కూతురు ఏ ఆకతాయి వలలో చిక్కుకుంటుందోనని ఆందోళన చెందడం సహజం. అలాంటి ఓ ఆడపిల్ల తండ్రికి .. ఓ ఆకతాయి తారసపడితే, అతనినే పెళ్లి చేసుకుంటానని కూతురు పట్టుపడితే ఆ తండ్రి ఏం చేస్తాడు? అనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 

ఒక ఊరు .. రెండు కుటుంబాల చుట్టూ దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు. లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ ను కలుపుకుంటూ ఈ కథ ముందుకు వెళుతూ ఉంటుంది. దర్శకుడు తాను చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. కాకపోతే ప్రధానమైన అంశానికి చుట్టూ అల్లుకోవలసిన సన్నివేశాలు కాస్త బలహీనంగా కనిపిస్తాయి. ఈ తరహా కథలకు అవసరమైన కామెడీని పట్టించుకోకపోవడం మైనస్ గా అనిపిస్తుంది. 

తన కూతురు ప్రేమించిన వ్యక్తిలో మంచి లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడం కోసం, అతనితో పాటు 30 రోజుల పాటు తిరగాలని ఆమె తండ్రి నిర్ణయించుకోవడం వరకూ బాగుంది. ఆ తరువాత చోటుచేసుకునే సన్నివేశాలు అంత ఆసక్తికరంగా లేకపోవడం నిరాశను కలిగిస్తుంది. చాలా సాదాసీదాగా సాగిపోయే ఆ సన్నివేశాలు అసహనాన్ని కలిగిస్తాయి. హీరో - హీరోయిన్ పాత్రలకి సంబంధించిన ఆర్టిస్టుల ఎంపిక కూడా అంత కరెక్టుగా అనిపించదు.   

పనితీరు: ఈ సినిమా టైటిల్ 'ఇట్లు మీ ఎదవ'. ఈ టైటిల్ చూసి హీరోగారి ఎదవ పనులు ఒక రేంజ్ లో ఉంటాయని అనుకోవడం సహజం. కానీ ఆ స్థాయి సీన్స్ ను ఆవిష్కరించలేకపోయారు. డిజైన్ చేసుకున్నవి అంత ఎఫెక్టివ్ గా అనిపించవు. ఇక లవ్ లో కూడా గాఢమైన సీన్స్ అంటూ ఏమీ లేవు. ఓ మాదిరి మలుపులతోనే కథ ముందుకు వెళుతూ ఉంటుంది. జగదీశ్ చీకటి ఫొటోగ్రఫీ ..ఆర్పీ పట్నాయక్ సంగీతం .. ఉద్ధవ్ ఎడిటింగ్ ఫరవాలేదు.

ముగింపు: ప్రేమించడానికి ఉద్యోగం .. డబ్బు .. హోదా .. వంటి అర్హతలన్నీ ఉండాలా?  ఇవేవీ లేకపోతే ప్రేమించకూడదా? అనే హీరో ప్రశ్నతో ఈ కథ మొదలవుతుంది. ప్రేమించుకోవడానికి మాత్రమే అయితే ఇవేవీ అవసరం లేదు. కానీ ప్రేమించిన అమ్మాయిని పోషించాలంటే మాత్రం ఇవన్నీ కావలసిందే. అనే దిశగా ఈ కథను పరిగెత్తిస్తే మరింత ఆసక్తికరంగా ఉండేదేమో. దర్శకుడు ఈ కథను వేరే దిశగా నడిపించాడు. అవసరమైనంత కసరత్తు జరగని కారణంగా,  ఓ మాదిరిగా అనిపించే కంటెంట్ గా చెప్పుకోవచ్చు.