'రివాల్వర్ రీటా' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

  • కీర్తి సురేశ్ నుంచి 'రివాల్వర్ రీటా'
  • నవంబర్లో విడుదలైన సినిమా 
  • ఈ నెల 26 నుంచి ఓటీటీలో 
  • ఆకట్టుకునే కథ - స్క్రీన్ ప్లే 
  • ఆసక్తికరమైన మలుపులు 
  • ఫ్యామిలీతో సరదాగా చూసే కంటెంట్  

కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన తమిళ సినిమా 'రివాల్వర్ రీటా'. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ సినిమా, అదే పేరుతో తెలుగులోను నవంబర్ 28వ తేదీన విడుదలైంది. సుధాన్ సుందరం - జగదీశ్ పళనిస్వామి నిర్మించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ తెరపైకి వచ్చేసింది. ఈ నెల 26వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్' ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: రీటా (కీర్తి సురేశ్) తన తల్లి చెల్లమ్మ (రాధిక శరత్ కుమార్) తోను, ఇద్దరు అక్కాచెల్లెళ్లతోను కలిసి నివసిస్తూ ఉంటుంది. తండ్రి ప్రభాకర్ ను ఒక వ్యక్తి మోసం చేయడం వలన అతను ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అప్పటి నుంచి ముగ్గురు ఆడపిల్లలతో చెల్లమ్మ కుటుంబాన్ని గడుపుకుంటూ వస్తుంది. అక్క 'రియా'ను కాపురానికి పంపించడానికి అవసరమైన డబ్బు కోసం రీటా కష్టపడి పనిచేస్తూ ఉంటుంది.

ఆ సిటీలో లోకల్ డాన్ గా పాడ్యన్ (సూపర్ సుబ్బరాయన్) కొనసాగుతూ ఉంటాడు. అయితే అతను తన కొడుకు బాబీ (సునీల్) కూడా తెలియకుండా కొన్ని చాటు మాటు వ్యవహారాలు చేస్తూ ఉంటాడు. తన అన్నయ్యను చంపిన పాండ్యన్ పై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో రెడ్డి ( అజయ్ ఘోష్) ఉంటాడు. పాండ్యన్ ను హత్య చేస్తే 5 కోట్లు ఇస్తానని 'మార్టిన్' తో డీల్ కుదుర్చుకుంటాడు. దాంతో మార్టిన్ ముఠా పాండ్యన్ ను ఫాలో అవుతుంది. 

గంజాయి మత్తులో పొరపాటున 'రీటా' ఇంటికి వెళ్లిన పాండ్యన్, 'చెల్లమ్మ' కొట్టిన దెబ్బకి చనిపోతాడు. ఈ విషయాన్ని పోలీస్ ఆఫీసర్ కామరాజ్ (జాన్ విజయ్)తో చెబుదామంటే, అతనితో రీటాకి పాత గొడవ ఉంటుంది. దాంతో రహస్యంగా శవాన్ని తరలించడానికి రీటా ప్లాన్ చేస్తుంది. ఈ తతంగాన్ని గమనిస్తూ వచ్చిన మార్టిన్, పాండ్యన్ శవాన్ని రెడ్డికి అప్పగించి 5 కోట్లు నొక్కేయాలని ప్లాన్ చేస్తాడు. మార్టిన్ కి మస్కా కొట్టి ఆ డబ్బుతో ఉడాయించాలని అతని అనుచరులు ప్లాన్ చేస్తారు. మరో వైపున తన అనుచరులతో కలిసి తండ్రి జాడ తెలుసుకోవడానికి బాబీ రంగంలోకి దిగుతాడు. రీటా తండ్రి మరణానికి కారకులు ఎవరు? పాండ్యన్ శవాన్ని వదిలించుకోవడానికి రీటా వాళ్లు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ. 

విశ్లేషణ: మాఫియా అంతా కూడా అక్రమాలు .. అరాచకాల చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ డబ్బు కోసం ఎవరు ఎవరినైనా మోసం చేస్తూ ఉంటారు. అందువలన నమ్మకం అనే మాట ఇక్కడ  వినిపించదు. పగలు - ప్రతీకారాల మధ్యనే ఇక్కడ అందరి జీవితాలు తెల్లారుతుంటాయి. అలాంటి మాఫియా మనుషుల బారిన, మగదిక్కులేని ఓ ఫ్యామిలీ పడితే ఎలా ఉంటుందనే అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. 

ఈ కథ రీటా .. బాబీ .. రెడ్డి .. దాసు .. పోలీస్ ఆఫీసర్ కామరాజు అనే ఐదు పాత్రల చుట్టూనే నడుస్తుంది. ప్రధానమైన పాత్రలన్నీ పాండ్యన్ శవంతో ముడిపడి పరిగెడుతూ ఉంటాయి. పాండ్యన్ ను మర్డర్ చేయవలసింది ఒకరు .. చేసింది ఒకరు .. చేయించింది ఒకరు .. గాలించేది ఒకరు. ఇలా ఈ పాత్రలన్నింటి మధ్య నడిచే సన్నివేశాలను కామెడీ టచ్ తో ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్ ను అందిస్తూ ఉంటుంది.

నిజానికీ ఈ తరహా కథలు ఆడియన్స్ కి అర్థమయ్యేలా స్క్రీన్ ప్లే చేయడం చాలా కష్టమైన విషయం. కానీ సినిమా మొదలైన దగ్గర నుంచి చివరివరకూ కూడా అంతే పట్టుతో అలరిస్తుంది. కథనంలో వేగం .. క్లారిటీ .. ట్విస్టులు ఇవన్నీ కూడా ఆడియన్స్ ను అలా కూర్చోబెట్టేస్తాయి. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ ఈ రెండూ కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. 

పనితీరు: ఈ సినిమాకి కథ .. కథనం మంచి బలం. మనుషులు .. స్వభావాలు .. అవకాశాన్ని బట్టి మారిపోయే తీరును ఆవిష్కరిస్తూ పాత్రలను మలచిన విధానం మంచి మార్కులు కొట్టేస్తుంది. లోకల్ రౌడీల పాత్రలు సైతం కనెక్ట్ అవుతాయి.'పిరికివాడు రోజూ చస్తాడు' అని ఒక పాత్ర అంటే, 'అలాగని ధైర్యవంతుడు ప్రతిరోజూ పుట్టడుగా' అని మరో పాత్ర చెప్పే డైలాగ్ హైలైట్.  

దినేశ్ కృష్ణన్ ఫొటోగ్రఫీ .. సీన్ రోల్డన్ నేపథ్య సంగీతం .. ప్రవీణ్ ఎడిటింగ్ వర్క్ కథను బలంగా సపోర్ట్ చేయడం కనిపిస్తుంది. కీర్తి సురేశ్ .. రాధిక .. అజయ్ ఘోష్ .. సునీల్ .. జాన్ విజయ్ నటన ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్కరూ తమ పాత్రను చాలా సహజంగా ఆవిష్కరించారు.

ముగింపు: ఈ కథ ఆరంభంలోనే క్రైమ్ జరుగుతుంది. అక్కడి నుంచి కామెడీని తోడుగా చేసుకునే కథ పరిగెడుతుంది. కథలో చాలా పాత్రలు ఉంటాయి .. చాలా మలుపులు ఉంటాయి. ప్రతి మలుపు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ఎక్కడా ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలకు తావు లేని ఈ సినిమాను, ఫ్యామిలీతో కలిసి సరదాగా చూడొచ్చు.  

Movie Details

Movie Name: Revolver Rita

Release Date:

Cast: Keerthy Suresh, Radhika Sarath Kumar, Sunil, Redin Kingsley, Ajay Ghosh, John Vijay

Director: JK Chandru

Producer: Sudhan Sundaram- Jagadish Palanisamy

Music: Sean Roldan

Banner: Passion Studios

Revolver Rita Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews