'సిస్టర్ మిడ్ నైట్' (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!

  • హిందీలో రూపొందిన 'సిస్టర్ మిడ్ నైట్'
  • తెలుగులోను అందుబాటులోకి 
  • ముంబై నేపథ్యంలో నడిచే కథ 
  • అయోమయాన్ని కలిగించే కంటెంట్

బాలీవుడ్లో రాధిక ఆప్టేకి మంచి క్రేజ్ ఉంది. ఆమె ఎంచుకునే కథలు .. పాత్రలు అందుకు కారణమని చెప్పచ్చు. నాయికా ప్రధానమైన సినిమాలు చేయడంలోను ఆమె తన జోరును కొనసాగిస్తూనే ఉంది. ఆమె నుంచి ఇటీవల కాలంలో వచ్చిన సినిమానే 'సిస్టర్ మిడ్ నైట్'. కరణ్ కాంధారి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది మే 30వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ నెల 25 నుంచి 'జియో హాట్ స్టార్'లో అందుబాటులోకి వచ్చింది. 

కథ: ఉమ (రాధిక ఆప్టే) గోపాల్ (అశోక్ పాఠక్) పెళ్లి జరుగుతుంది. నిజానికి ఈ వివాహం 'ఉమ' ఇష్టం ఉండదు. అయినా తప్పనిసరి పరిస్థితులలో అతనిని పెళ్లి చేసుకోవలసి వస్తుంది. అయిష్టంగానే అతని వెంట ముంబైకి వెళుతుంది. అక్కడ ఒక మురికివాడలోని చిన్న గదిలో వారి నివాసం. రద్దీతో కూడిన రోడ్డు పక్కనే ఉన్న ఆ గదిలో జీవించడం ఆమెకి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇష్టం లేని భర్తతో కాపురం చేయలేకపోతుంది. 

భర్తకి దగ్గరగా ఉండకూడదు .. ఇంటికి దూరంగా .. రద్దీకి అందనంత దూరంగా ఉండాలని ఉమ భావిస్తుంది. అందుకోసం అక్కడికి చాలా దూరంగా ఉన్న ఒక ఆఫీసులో క్లీనింగ్ పనులు చేయడానికి కుదురుతుంది. హడావిడిగా పరిగెత్తే ఆ మహా నగరంలో ఆమెను పలకరించేవారు లేకుండా పోతారు. భర్త కూడా ఆమె ఇబ్బందిని రిథమ్ చేసుకుని దూరంగానే ఉంటాడు. అలాంటి పరిస్థితులలో ఆమె మానసిక స్థితి మరింత దిగజారుతుంది. 

దాంతో ఆమె పక్షులను .. మేకలను చంపేసి రక్తం తాగడం .. ఎక్కువగా చీకట్లో తిరగడం మొదలుపెడుతుంది. తాను చంపిన పక్షులు .. మేకలు తిరిగి బ్రతికినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని రోజులుగా ఆ దంపతులు కనిపించకపోవడం చుట్టుపక్కల వారికీ అనుమానాన్ని కలిగిస్తుంది. అందుకు కారణం ఏమిటి? ఉమ దంపతులు ఏమయ్యారు? ఉమ మానసిక స్థితి చివరికి ఎక్కడివరకూ వెళుతుంది? అనేది మిగతా కథ.

విశ్లేషణ: ముంబై మహానగరంలో ఒక మురికివాడ .. ఒక చిన్న గది .. భార్యాభర్తలు .. వీటి చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. ఇష్టం లేని పెళ్లి .. అసంతృప్తితో కూడిన నివాసం .. ప్రేమ - ప్రశాంతత లోపించిన జీవితం .. ఇవన్నీ కూడా మానసిక స్థితి పట్ల ప్రభావం చూపించేవే. అలాంటి పరిస్థితులలో ఉమ ఎలా మారిపోయిందనే దిశగా ఈ కథ నడుస్తుంది.

ముంబై మురికివాడలో నివాసం .. జీవితం పట్ల 'ఉమ'కి గల అసంతృప్తిని దర్శకుడు చూపించిన విధానం సహజత్వానికి దగ్గరగానే అనిపిస్తుంది. అయితే ఆమె మానసిక స్థితిలో విపరీతమైన మార్పులు రావడానికి వెనుక బలమైన కారణాలు ఏమిటనేది మాత్రం మనకి అంతుబట్టదు. అంతకుముందు ఆమె గొప్పగా బ్రతికి వచ్చిందా? ప్రకృతి మధ్యలో పెరిగిందా? పోనీ విలాసవంతమైన జీవితాన్ని ఆమె కోరుకుంటుందా? అనేది దర్శకుడు చూపించలేదు.

వివాహమై వచ్చిన తరువాత భర్త వైపు నుంచి ఆమెకి ఎలాంటి హింసా ఉండదు. ఆమె పక్షులను .. జంతువులను చంపడం .. వాటిని దాచడం .. అవి ప్రాణం వచ్చి వెళ్లిపోవడం .. ఇలా అర్థం పర్థం లేకుండా ఈ కథ నడుస్తూ ఉంటుంది. తెరపై జరుగుతున్న సంఘటనలు .. సన్నివేశాలు నిజమా?  ఉమ వైపు నుంచి కలిగే భ్రమనా? అనేది అంతుబట్టదు. దర్శకుడి ఉద్దేశం ఏంటి? ఏం చెప్పాలనుకున్నాడు? అనే మాటకి ఆన్సర్ దొరకదు.

పనితీరు: పెళ్లి చేసుకుని భర్త వెంట ముంబైలోని ఓ మురికివాడకి వచ్చిన ఒక యువతి చుట్టూ నడిచే కథ ఇది. దర్శకుడు ఈ పాత్ర చుట్టూనే ఈ కథను నడిపిస్తూ వెళ్లాడు. ఆమె పాత్రను మలిచిన తీరు కొత్తగా అనిపిస్తుంది. కాకపోతే అందుకు గల బలమైన కారణాలను చూపడంలో దర్శకుడు విఫలమయ్యాడు.

రాధిక ఆప్టే గొప్పనటి అని ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పుకోవలసిన పని లేదు. ఆమె తన పాత్రకి న్యాయం చేసింది. అయితే ఆ పాత్రను ఎలా అర్థం చేసుకోవాలలో తెలియని ఒక చిత్రమైన పరిస్థితులలోనే ప్రేక్షకులు ఉండిపోతారు. కెమెరా పనితనం .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. 

ముగింపు: కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు, ఈ కథ మనకే అర్థం కావడం లేదా? లేదంటే ఈ కథలోనే అర్థం లేదా? అనే ఒక అనుమానం కలుగుతూ ఉంటుంది. అలాంటి ఒక తికమకను కలిగించే కంటెంట్ ఇది. ఈ కథ ద్వారా ఏం చెప్పాలనుకున్నారనేది అర్థం కాదు. కొన్ని సార్లు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోవడం కూడా మంచిదే.

Movie Details

Movie Name: Sister Midnight

Release Date:

Cast: Radhika Apte, Ashok Pathak, Chhaya Kadam, Smita Tambe, Subhsh Chandra

Director: Karan Kandhari

Producer: Alastair Clark -Aanna Griffin

Music: Paul Banks

Banner: Film 4- Griffin Pictures

Sister Midnight Rating: 1.75 out of 5

Trailer

More Movie Reviews