క్రైమ్ థ్రిల్లర్ .. సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ నుంచి వస్తున్న సిరీస్ ల జోరు పెరుగుతూపోతోంది. ఈ నేపథ్యంలోనే చాలా గ్యాప్ తరువాత మలయాళం నుంచి ఒక మెడికల్ థ్రిల్లర్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో మంచి క్రేజ్ ఉన్న నివిన్ పౌలి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్, ఏడు భాషల్లో ఈ రోజునే స్ట్రీమింగ్ కి వచ్చింది. 'జియో హాట్ స్టార్' ద్వారా అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

కథ: కేరళలోని ఓ మారుమూల ప్రాంతం నుంచి కేపీ వినోద్ ( నివిన్ పౌలి) 'త్రిశూర్' చేరుకుంటాడు. అతని తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఆమె ట్రీట్మెంట్ కి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. దాంతో డబ్బు సంపాదించాలనే పట్టుదలతో ఆయన, ఓ ఫార్మా కంపెనీలో రిప్రజెంటేటివ్ గా చేరతాడు. ఎమ్ ఫార్మసీ పూర్తి చేసిన అతను, తాను నేర్చుకున్న దానికీ .. బయట పరిస్థితులకు సంబంధమే లేదనే విషయాన్ని గ్రహిస్తాడు. 

అదే సమయంలో ఆ ఫార్మా కంపెనీ వారు, గర్భవతుల కోసం ఒక డ్రగ్ ను తయారు చేస్తారు. ఆ ప్రొడక్ట్ ను మార్కెట్ లోకి తీసుకురావడం కోసం వినోద్ పూర్తి ఫోకస్ చేస్తాడు. పగలు - రాత్రి కష్టపడతాడు. అవమానాలను ఎదుర్కొంటూనే అనుకున్నది సాధిస్తాడు. అంచలంచెలుగా ఎదుగుతూ, కారు - బంగ్లా సంపాదించుకోగలుగుతాడు. నిర్మలతో వినోద్ వివాహం జరుగుతుంది. వారి సంతానమే షాలిని.

ఈ క్రమంలోనే వినోద్ కి డాక్టర్ జానకి ( శ్రుతి రామచంద్రన్) తో పరిచయం ఏర్పడుతుంది. అతని ఎదుగుదలను ప్రత్యక్షంగా చూసినవారిలో ఆమె ఒకరు. ఈ నేపథ్యంలోనే అదే ఫార్మా సంస్థవారు పిల్లల కోసం ఒక డ్రగ్ ను తయారు చేస్తారు. దానిని మార్కెట్లోకి తీసుకుని వెళ్లే బాధ్యతను కూడా వినోద్ కి అప్పగిస్తారు. అయితే గతంలో గర్భవతుల కోసం వాళ్లు తయారు చేసిన మెడిసిన్ కారణంగా, తల్లీబిడ్డలు డయాబెటిస్ బారిన పడినట్టుగా తన పరిశోధనలో తేలిందని అతనితో డాక్టర్ జానకి చెబుతుంది.   

ఆల్రెడీ ఆ ఫార్మా కంపెనీపై డాక్టర్ రాజీవ్ రావు ఫైట్ చేస్తున్నాడనీ, జనరిక్ మెడిసిన్ వైపు ప్రజలను మళ్లించడానికి ప్రయత్నిస్తున్న ఆయనపై కక్ష సాధింపులు నడుస్తున్నాయని వినోద్ తెలుసుకుంటాడు. ఆ ఫార్మా సంస్థ చైర్మన్ అరవింద్ కి తెలిసే అంతా జరుగుతుందనే విషయం వినోద్ కి అర్థమవుతుంది. తనకి తెలియకుండానే తాను చాలా పెద్ద పొరపాటు చేశానని గ్రహిస్తాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆ ఫార్మా సంస్థ దారుణాలను ఎలా ఎదుర్కొంటాడు? అనేదే కథ.

విశ్లేషణ
: కొన్ని ఫార్మా సంస్థలు బిజినెస్ ప్రధానంగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వెళుతున్నారు. ప్రజల ప్రాణాలను గురించిన ఆలోచన వాళ్లకి ఎంతమాత్రం ఉండదు. ఆ ఫార్మా సంస్థల నుంచి వస్తున్న మెడిసిన్స్, భవిష్యత్తు తరలవారిపై ఎలాంటి ప్రమాదకరమైన ప్రభావం చూపనున్నాయనేది పట్టించుకునే తీరిక .. ఓపిక ఎవరికీ లేదు. ప్రమాదకరమైన మందులు ప్రజలలోకి ఎంత తేలికగా వచ్చేస్తున్నాయనే అంశం చుట్టూ అల్లుకున్న కథ ఇది. 

ఒక ఫార్మా కంపెనీ చైర్మన్ .. ఒక సీనియర్ డాక్టర్ .. లేడీ డాక్టర్ .. ఒక రిప్రజెంటేటివ్ ప్రధానమైన పాత్రలుగా ఈ కథను మలచిన తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఒక డ్రగ్ ను మార్కెట్లోకి తీసుకుని వెళ్లడానికి ఎంతో కష్టపడిన ఒక రిప్రజెంటేటివ్, ఆ డ్రగ్ తయారు చేసిన ఫార్మా సంస్థపైనే యుద్ధం చేయవలసి వచ్చేలా కథను డిజైన్ చేసుకున్న విధానం గొప్పగా అనిపిస్తుంది. ఎమోషన్స్ తో కూడిన డ్రామా .. స్క్రీన్ ప్లే ఈ సిరీస్ కి ప్రధానమైన బలంగా నిలిచాయని చెప్పాలి. 

ఇప్పుడు ఏ వ్యాపారమైనా డబ్బే  ప్రధానంగా సాగుతుంది. ఏ వ్యాపారంలోను మానవత్వమనేది మచ్చుకైనా కనిపించడం లేదు. ఎవరి స్థాయిలో వాళ్లు దోచేయడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. అలా సంపాదించిన వాళ్లు, భగవంతుడు విధించే శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేరు అనే ఒక సందేశం కూడా మనకి ఈ కథలో కనిపిస్తుంది.

పనితీరు: అరుణ్ ఈ కథపై గట్టిగానే కసరత్తు చేసినట్టుగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం 8 ఎపిసోడ్స్ లో అనవసరమైన సీన్ ఒక్కటి కూడా కనిపించదు. ప్రధానమైన  పాత్రల మధ్య ఎక్కడా గ్యాప్ లేని విధంగా సన్నివేశాలను ఆవిష్కరించిన విధానం గొప్పగా అనిపిస్తుంది. సన్నివేశాలను ఎక్కడా సాగదీస్తున్నట్టుగా అనిపించదు. అభినందన్ రామానుజం ఫొటోగ్రఫీ .. అబ్జక్ష్ నేపధ్య్ సంగీతం .. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ ఈ కథను మరింత ఫర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశాయని చెప్పాలి. 

ముగింపు:   కొన్ని ఫార్మా కంపెనీలు, కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ను .. స్వార్థపరులైన కొంతమంది డాక్టర్లను గుప్పెట్లో పెట్టుకుని తమ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరింపజేస్తున్నారు? అందుకు ఎంతమంది అమాయకులు బలవుతున్నారు?  అలాంటివారిపై ఒక సామాన్యుడు చేసే పోరాటంగా దర్శకుడు ఈ కథను తయారు చేసుకున్న తీరు మంచి మార్కులు కొట్టేస్తుంది.