'స్టీఫెన్' ( నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

  • తమిళ సినిమాగా 'స్టీఫెన్'
  • సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ 
  • రొటీన్ గా నడిచే కథాకథనాలు 
  • నిరాశ పరిచే కంటెంట్  
క్రైమ్ .. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఒకప్పుడు ఎక్కువగా వచ్చేవి. ఈ మధ్య కాలంలో సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల సంఖ్య పెరుగుతూ వెళుతోంది. ఆ వరుసలో నుంచి వచ్చిన తమిళ సినిమానే   'స్టీఫెన్'. గోమతి శంకర్ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది. ఈ నెల 5వ తేదీన నేరుగా 'నెట్ ఫ్లిక్స్'లో రిలీజ్ చేశారు. మిథున్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.

కథ: నగరంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. యువతులను టార్గెట్ చేసి హత్యలు చేస్తుంటారు. ఈ హత్యలను ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనేది పోలీసులకు ఒక సవాల్ గా మారుతుంది. పోలీసులు రంగంలోకి దిగిపోయి అన్ని వైపులా గాలింపు జరుపుతూ ఉండగానే, తొమ్మిదిమంది యువతులు హత్య చేయబడతారు. దాంతో నగరంలోని ప్రజలంతా భయభ్రాంతులకు లోనవుతారు. 

పోలీస్ ఆఫీసర్ మైఖేల్ ఎలాగైనా హంతకుడిని పట్టుకోవాలనే పట్టుదలతో ఉంటాడు. అందుకు సంబంధించిన ప్రయత్నాలు చురుకుగా జరుగుతుంటాయి. అలాంటి పరిస్థితులలోనే 'స్టీఫెన్' నేరుగా వచ్చి పోలీసులకు లొంగిపోతాడు. జరిగిన వరుస హత్యలను చేసిన హంతకుడిని తానేనని తేల్చి చెబుతాడు. మొదట్లో నమ్మలేకపోయిన పోలీసులు ఆ తరువాత ఆయనను అరెస్టు చేస్తారు. 

హత్యలు ఎందుకు చేసినట్టు? 9 హత్యల అనంతరం లొంగిపోవడానికి కారణం ఏమిటి? అని స్టీఫెన్ ను పోలీస్ ఆఫీసర్ మైఖేల్ అడుగుతాడు. అప్పుడు స్టీఫెన్ ఏం చెబుతాడు? ఆయన ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? ఆయన గతంలో మేరీ - కృతిక పాత్ర ఏమిటి? అది తెలుసుకున్న మైఖేల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అనేది మిగతా. 

విశ్లేషణ: జీవితమనే ఈ ప్రయాణంలో ఎంతోమంది వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. వాళ్లలో కొంతమందితో మాట్లాడుతూ ఉండగానే వారి స్వభావం ఏమిటో తెలిసిపోతూ ఉంటుంది. అలాంటి వారికి దూరంగా ఉండటానికి అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మానసిక స్థితి సరిగ్గా లేని 'సైకో'లను గుర్తించడం కాస్త కష్టమైన పనే. అలాంటి ఒక సైకో చుట్టూ అల్లిన కథ ఇది. ఆయన చిత్ర విచిత్ర వేషాల చుట్టూనే ఈ కథ తిరుగుతూ ఉంటుంది. 

వరుస హత్యల గురించి మీడియాలో జరుగుతున్న హడావిడితోనే ఈ కథ మొదలవుతుంది. ఆడిషన్స్ పేరుతో అమ్మాయిలను రప్పించి హత్యలు చేసే ఈ హంతకుడిని ఎలా పట్టుకుంటారబ్బా అని ప్రేక్షకులు ఆలోచిస్తూ ఉండగానే హంతకుడు వచ్చి లొంగిపోతాడు. ఎప్పుడైతే హంతకుడు లొంగిపోయాడో ఇక ఆ వైపు నుంచి ఆడియన్స్ కు ఉన్న కుతూహలానికి తెరదించినట్టు అవుతుంది. 

ఇక ఇప్పుడు స్టీఫెన్ హంతకుడిగా ఎందుకు మారాడు?  ఎవరెవరిని హత్య చేశాడు? అనే విషయాల కోసమే ఆడియన్స్ ఎదురుచూడటం మొదలవుతుంది. అయితే ఆ వైపు నుంచి వచ్చిన అవుట్ పుట్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇది ఒక సైకో కథ కాదు .. ముగ్గురు సైకోల కథ అనే విషయం మనకు అప్పుడు అర్థమవుతుంది. కుటుంబ వాతావరణం .. తల్లిదండ్రుల ప్రేమరాహిత్యమే సైకోలను తయారు చేస్తుందనే ఒక విషయాన్ని చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించడం కనిపిస్తుంది.

పనితీరు: ఈ మధ్య కాలంలో తక్కువ పాత్రలతో .. సింపుల్ కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే కంటెంట్ కొత్తగా .. విభిన్నంగా ఉన్న వాటికి మాత్రమే విశేషమైన ఆదరణ లభిస్తోంది. అలాంటి కొత్తదనమే లేకుండా రొటీన్ సాగే కథ ఇది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. 

ముగింపు: తల్లిదండ్రుల ప్రేమ .. ఆహ్లాదకరమైన కుటుంబ జీవనం దొరక్కపోతే, పిల్లలు ఎలా తయారవుతారు? అనడానికి నిదర్శనంగా దర్శకుడు ఈ సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అయితే రొటీన్ కాన్సెప్ట్ ను తీసుకుని రొటీన్ గా చెప్పడం వలన, ఈ సినిమా ఏ మాత్రం ఆసక్తిని కలిగించలేకపోయింది. ఆ స్థానంలో అసహనం మాత్రమే మిగులుతుంది.

Movie Details

Movie Name: Stephen

Release Date: 2025-12-05

Cast: Gomathi Shankar, Michael Thangadurai, Smruthi Venkat,

Director: Mithun

Producer: Jayakumar - Mohan

Music: Raghav Rayan

Banner: JM Production

Review By: Peddinti

Stephen Rating: 1.50 out of 5

Trailer

More Movie Reviews