'కుట్రమ్ పురింధవన్: ది గిల్టీ వన్' (సోనీ లివ్) సిరీస్ రివ్యూ!

  • తమిళంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ 
  • 7 ఎపిసోడ్స్ తో పలకరించిన కంటెంట్ 
  • హైలైట్ గా నిలిచే కథా కథనాలు
  • కదిలించే ఎమోషన్స్ 
  • కట్టిపడేసే సస్పెన్స్    

'కుట్రమ్ పురింధవన్: ది గిల్టీ వన్' .. ఇది తమిళంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. పశుపతి .. విధార్థ్ .. ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి, సెల్వమణి దర్శకత్వం వహించాడు. ఈ నెల 5వ తేదీన ఈ సిరీస్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పారు. అయితే 4వ తేదీ సాయంత్రం నుంచే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 7 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్, తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. హిందీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది.

కథ: అది టౌన్ కి కాస్త దగ్గరలో ఉన్న విలేజ్. అక్కడ భాస్కర్ (పశుపతి) తన భార్య 'ఆనంది'(లిజీ ఆంటోనీ)తో కలిసి జీవిస్తూ ఉంటాడు. టౌన్ లో ఉన్న హాస్పిటల్లో అతను ఫార్మాసిస్టుగా పనిచేస్తూ ఉంటాడు. కూతురు 'సెల్వి' చనిపోయిన కారణంగా మనవడు 'రాహుల్' ఆలనా పాలన భాస్కర్ దంపతులు చూసుకుంటూ ఉంటారు. రాహుల్ మెదడుకి సంబంధించిన ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. కొన్ని రోజులలో తాను రిటైర్ అవుతాడు గనుక, వచ్చిన డబ్బుతో మనవడికి సర్జరీ చేయించాలనే ఉద్దేశంతో భాస్కర్ ఉంటాడు.  

భాస్కర్ నివసించే అద్దె ఇంట్లోనే, పక్క పోర్షన్ లో ఎస్తేరు (లక్ష్మీప్రియ) దంపతులు నివసిస్తూ ఉంటారు. ఎస్తేరు భర్త సాల్మన్ ఓ తాగుబోతు. దాంతో 12 ఏళ్ల కూతురు 'మెర్సీ' బాగోగులు ఎస్తేరు చూసుకుంటూ ఉంటుంది. ఆ ఊళ్లో అమ్మవారి జాతర కావడంతో అంతా హడావిడిగా ఉంటుంది. ఆ సమయంలోనే అనుమానాస్పద స్థితిలో ఎస్తేరు భర్త సాల్మన్ చనిపోతాడు. ఎస్తేరు కూతురు 'మెర్సీ' కనిపించకుండా పోతుంది. దాంతో పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ కేసును ఛేదించే టీమ్ లో పనిచేయాలని కానిస్టేబుల్ గౌతమ్ (విధార్థ్) కి ఉంటుంది. కానీ కొన్ని కారణాల వలన అతను పోలీస్ జీప్ డ్రైవ్ చేయడానికి మాత్రమే పరిమితమవుతాడు.

మెర్సీ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు. సమయంలో భాస్కర్ తన భార్యకి ఓ నిజం చెబుతాడు. తన ఇంట్లోని ఫ్రిజ్ లో దాచిన 'మెర్సీ' శవాన్ని చూపిస్తాడు. మెర్సీపై అఘాయిత్యం చేసి ఎవరో చంపేశారనీ, ఆ అమ్మాయిని తన చేతుల్లో పెట్టి, సాయం కోసం వెళ్లిన సాల్మన్ చనిపోయాడని అంటాడు. పోలీస్ లు తనని అనుమానిస్తే తనకి రావాల్సిన రిటైర్మెంట్ డబ్బు రాకుండా పోతుందని చెబుతాడు. ఆ డబ్బుపై మనవడి సర్జరీ ఆధారపడి ఉందని అంటాడు.

 ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి ఆనంది భయాందోళనలకు లోనవుతుంది. ఆమె ద్వారా ఎక్కడ విషయం బయటపడుతుందోనని భాస్కర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అలాగే ఎస్తేరు బాధను చూడలేకపోతుంటాడు. తన మనవడి సర్జరీకి అవసరమైన డబ్బు కోసం, మెర్సీ హత్యకు సంబంధించిన రహస్యాన్ని దాచడం ఎంతవరకూ కరెక్ట్ అనేది అతనికి అర్థం కాదు. అప్పుడు అతను ఏం చేస్తాడు? మెర్సీ చావుకు కారకులు ఎవరు? ఒక పోలీస్ గా తనని తాను నిరూపించుకోవడం కోసం గౌతమ్ ఏం చేస్తాడు? అనేది కథ.

విశ్లేషణ: నీతిగా బ్రతకడం .. నిజాయితీగా వ్యవహరించడం .. మనస్సాక్షి చెప్పిన ప్రకారం నడచుకోవడం అందరి వలన అయ్యే పనికాదు. కానీ అలాంటివారికి కూడా ఒక్కోసారి నిజాలు చెప్పలేని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మనస్సాక్షి మాట వినని పరిస్థితులను కల్పిస్తూ ఉంటాయి. ఏదో ఒక మూల నుంచి తొంగిచూసే స్వార్థం, ఆత్మసాక్షికి అడ్డుపడుతుంది. అలాంటి ఒక స్థితికి .. పరిస్థితికి పట్టుబడిన ఒక వ్యక్తి చుట్టూ దర్శకుడు అల్లుకున్న కథ ఇది.

ఈ కథలో కొంతదూరం వెళ్లిన ప్రేక్షకులు, ఇక ఈ ప్రయాణం పూర్తయ్యేవరకూ వెనక్కి రావడానికి ఇష్టపడరు. అందుకు కారణం దర్శకుడు డిజైన్ చేసుకున్న కథ .. కథనం. ఊహించని మలుపులు .. అనుకోని ట్విస్టులు కదలనీయకుండా చేస్తాయి. నేరం చేసినవాడు .. అతని కారణంగా బలైపోయిన కుటుంబం .. పోలీసులు ఈ కథలో కీలకమైన స్థానాల్లో కనిపిస్తారు. అయితే తనకి తెలిసిన ఒక నిజాన్ని దాచిపెట్టలేక నలిగిపోయే ఒక నిజాయితీ పరుడి చుట్టూ ఈ కథను నడిపించిన తీరు గొప్పగా అనిపిస్తుంది. 

ఒకే దృశ్యం .. ఒకే సన్నివేశం మనం చూసే ఉద్దేశాన్ని బట్టి మారిపోతుందనే  విషయాన్ని దర్శకుడు ఆవిష్కరించిన తీరు ప్రశంసనీయంగా అనిపిస్తుంది. నీతిగా బ్రతికేవాడికి ఒక నిజాన్ని దాచడానికి మించిన శిక్ష లేదని నిరూపించే ఈ కథ కదిలిస్తుంది. 'మనలోని మంచితనం ఎదుటివారికి తెలుస్తుంది. కానీ మనలోని చెడ్డతనం మనకి మాత్రమే తెలుస్తుంది' అనే డైలాగ్ ఈ  సిరీస్ మొత్తానికి హైలైట్ గా నిలుస్తుంది.   
         
పనితీరు
: ఈ కథపై చాలా కాలం పాటు కసరత్తు జరిగిందనే విషయం, సిరీస్ చూస్తుండగానే మనకి అర్థమైపోతుంది. ఎందుకంటే ఎక్కడా కూడా పట్టు సడల లేదు. అనవసరమైన అంశాలు వచ్చి చేరలేదు. పాత్రలు .. వాటిని డిజైన్ చేసిన విధానం .. సన్నివేశాలను ఆవిష్కరించిన తీరు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. స్క్రీన్ ప్లే పరంగా ఈ మధ్య కాలంలో మార్కులు కొట్టేసిన సిరీస్ గా దీనిని గురించి చెప్పుకోవచ్చు.

ఫరూక్ బాషా కెమెరా పనితనం బాగుంది. ప్రతి సన్నివేశం ఒక గొప్ప ప్రెజెంటేషన్ మాదిరిగా అనిపిస్తుంది.  ప్రసాద్ నేపథ్య సంగీతం, మనలను సన్నివేశంలో ఒక భాగం చేస్తుంది. కథిరేశ్  ఎడిటింగ్ చాలా నీట్ గా అనిపిస్తుంది. ఎక్కడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కథను మన కళ్ల ముందు నిలుపుతుంది. 

ముగింపు: తారాగణం పరంగా .. ఖర్చు పరంగా అలా ఉంచితే, కథాకథనాల పరంగా ఇది భారీ వెబ్ సిరీస్ అనే చెప్పాలి. ఆసక్తికరమైన మలుపులు .. విస్మయానికి గురిచేసే ట్విస్టులు .. ప్రేక్షకులను చివరివరకూ తీసుకుని వెళతాయి. ఎమోషన్స్ తో ఒక క్రైమ్ థ్రిల్లర్ ను కనెక్ట్ చేయడమే ఈ సిరీస్ ప్రత్యేకత. ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ను గురించి చెప్పుకోవచ్చు.

Movie Details

Movie Name: Kuttram Purindhavan: The Guilty One

Release Date: 2025-12-05

Cast: Pasupathy,Vidaarthm,Lizzie Antony,Lakshmi Priyaa,Munnar Ramesh

Director: Selvamani Muniyappan

Producer: Avinaash Hariharan -Arabbhi Athreya

Music: Prasad

Banner: Happy Unicotn

Review By: Peddinti

Kuttram Purindhavan: The Guilty One Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews