'3 రోజెస్' (ఆహా) మూవీ రివ్యూ!

  • గతంలో సిరీస్ గా వచ్చిన కంటెంట్
  • సినిమాగా ఈ రోజు నుంచి స్ట్రీమింగ్
  • ముగ్గురు యువతుల పెళ్లి చుట్టూ తిరిగే కథ 
  • ప్రధానమైన ఆకర్షణగా నిలిచిన గ్లామర్

ఇప్పుడు ట్రెండ్ అన్ని వైపుల నుంచి మారిపోతోంది. ఒక వైపున రీ రిలీజ్ లు సందడి చేస్తూ ఉంటే, మరో వైపున ఓటీటీకి వచ్చిన సినిమాలు .. థియేటర్ల దిశగా పరుగులు పెడుతున్నాయి. ఇక గతంలో సిరీసులుగా వచ్చిన కంటెంట్, ఇప్పుడు సినిమాలుగా మారిపోయి అలరించడం మొదలైంది. ఆ జాబితాలోనే మనకి '3 రోజెస్' కనిపిస్తోంది. 2021లో 8 ఎపిసోడ్స్ గా ఆడియన్స్ ను అలరించిన ఈ సిరీస్ ను, సినిమాగా ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు.

కథ: రీతూ (ఈషా రెబ్బా) బెంగుళూర్ లో ఒక సంస్థలో పనిచేస్తూ ఉంటుంది. పెళ్లి విషయం మాట్లాడటానికి పేరెంట్స్ ఆమెను హైదరాబాద్ పిలిపిస్తారు. ఆమె ఒక మ్యూజిక్ బ్యాండ్ లో గిటారిస్ట్ గా ఉన్న సమీర్ ను ప్రేమిస్తుంది. కానీ ఆర్థికపరమైన స్థిరత్వం లేని అతనితో పెళ్లికి తండ్రి అంగీకరించడనే విషయం తెలిసి ఆమె మౌనంగా ఉండిపోతుంది. కాస్త డబ్బున్న ప్రసాద్ (వైవా హర్ష)తో ఆమెకి నిశ్చితార్థం జరిపిస్తారు. 

ఇక జాన్వీ (పాయల్ రాజ్ పుత్) శ్రీమంతుల కుటుంబానికి చెందిన యువతి. లైఫ్ ను తనకు తోచిన విధంగా ఆమె ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆమె తండ్రి బిజినెస్ గురించే ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాడు. బాగా డబ్బున్న వ్యక్తితోనే ఆమె పెళ్లి జరిపించాలనే ఆలోచనలో ఉంటాడు. అయితే అనుకోకుండా తారసపడిన కబీర్ (ప్రిన్స్)తో ఆమె ప్రేమలో పడుతుంది. స్వేచ్ఛా జీవితాన్ని కోరుకునే కబీర్ తో పెళ్లికి తండ్రి అసహనాన్ని వ్యక్తం చేస్తాడు.

ఇక ఇందూ (పూర్ణ) విషయానికి వస్తే, బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన ఆమె, బాబాయ్ - పిన్ని దగ్గర పెరుగుతుంది. తల్లి ఉన్నప్పటికీ ఆమె నిస్సహాయురాలు. తన కూతురు 'లక్కీ' కూడా పెళ్లీడుకి రావడంతో, ఇందూకి ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఆమె బాబాయ్ ఉంటాడు. రీతూ .. జాన్వీ .. ఇందూ ఈ ముగ్గురూ స్నేహితులే. తమ వాళ్లు పెళ్లి విషయంలో తమ ఇష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం నచ్చని ఈ ముగ్గురూ ఏం చేస్తారు? వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపు తిరుగుతాయి? అనేది కథ.

విశ్లేషణ: పెళ్లి గురించి .. తనకి భర్తగా రాబోయే వ్యక్తి గురించి ఆడపిల్లలు ఎన్నో కలలు కంటారు. అయితే పెళ్లి విషయంలో ఆమె అభిప్రాయానికి .. ఆలోచనలకు ఎవరూ కూడా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వరు. ఆమె పెళ్లిని గొప్పింటివాళ్లు హోదాతో ముడిపెడతారు. మిడిల్ క్లాస్ వాళ్లు పరువు ప్రతిష్ఠలతో ముడిపెడతారు. ఇక బరువు అనుకున్నవారు ఆ బరువును వదిలించుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొనే ముగ్గురు యువతుల కథనే ఇది. 

పుట్టిపెరిగిన వాతావరణం .. ఆర్ధికపరమైన స్థితిగతులే అందరి జీవితాలను ప్రభావితం చేస్తాయి. అందుకు అమ్మాయిలు కూడా మినహాయింపు కాదు. అయితే అమ్మాయిలలో ఎవరి కుటుంబ నేపథ్యం ఏదైనా, పెళ్లి విషయం దగ్గరికి రాగానే నచ్చిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన బలంగా కలిగి ఉంటారు. ఈ విషయాన్ని హైలైట్ చేస్తూనే దర్శకుడు ఈ కథను నడిపిస్తూ వెళ్లిన తీరు బాగుంది. దాదాపుగా ఒకే విధమైన సమస్యను ఎదుర్కుంటున్న ముగ్గురు యువతుల చుట్టూ అల్లుకున్న ఈ కథ ఆకట్టుకుంటుంది. 

కథలో కొత్తదనం .. అనూహ్యమైన ట్విస్టులు గట్రా ఉండవు గానీ, అక్కడక్కడా ఇచ్చిన కామెడీ టచ్ తో ఏ మాత్రం బోర్ అనిపించకుండా సాగిపోతూ ఉంటుంది. ఈషా రెబ్బా .. పాయల్ .. పూర్ణ గ్లామర్ ఈ సిరీస్ కి ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయని చెప్పాలి. ఇది గతంలో సిరీస్ గా వచ్చినప్పటికీ, ప్రేక్షకులకి ఆ ఆలోచన ఎంతమాత్రం రాదు. ఒక సినిమాగానే సాగిపోతూ కనెక్ట్ అవుతుంది. 

పనితీరు: కుటుంబాలు .. నేపథ్యాలు వేరైనా, ఆడపిల్లల పెళ్లి విషయంలో పెద్దల నిర్ణయాలు ఎలా ఉంటాయి? అనే ఒక ఆసక్తికరమైన అంశం చుట్టూ ఈ కథను నడిపించిన తీరు బాగుంది. ఈ తరహా కంటెంట్ నుంచి ఆశించిన స్థాయి వినోదం తగ్గినా, ముగ్గురు భామల గ్లామర్ టచ్ తో ఆ లోటు తెలియకుండా నడుస్తుంది. ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. బాల్ రెడ్డి ఫొటోగ్రఫీ .. ఉద్ధవ్ ఎడిటింగ్ .. సన్నీ నేపథ్య సంగీతం ఫరవాలేదు. 

ముగింపు: లవ్ .. రొమాన్స్ .. కామెడీ .. ఎమోషన్స్ తో కూడిన ఈ కంటెంట్, బోర్ అనిపించకుండా సాగుతుంది. ఈషా రెబ్బా .. పాయల్ .. పూర్ణ గ్లామర్ ప్రధానమైన ఆకర్షణగా నిలిచిందని చెప్పచ్చు. త్వరలో సీజన్ 2 పలకరించనుండగా, ఫస్టు సీజన్ ను సినిమాగా అందించడం విశేషం. 

Movie Details

Movie Name: 3 Roses

Release Date: 2025-10-23

Cast: Eesha Rebba, Payal Rajput, Poorna, Harsha, Prince, Sangeeth Sobhan, Goparaju Ramana

Director: Maggi

Producer: Srinivasa Kumar

Music: Sunny

Banner: Action Cut Movies

Review By: Peddinti

3 Roses Rating: 2.50 out of 5


More Movie Reviews