'హృదయపూర్వం' (జియో హాట్ స్టార్)మూవీ రివ్యూ!

  • మలయాళ సినిమాగా 'హృదయపూర్వం' 
  • 100 కోట్లకి పైగా రాబట్టిన సినిమా
  • నిన్నటి నుంచి మొదలైన స్ట్రీమింగ్  
  • సున్నితమైన భావోద్వేగాలకు ప్రాధాన్యత
  • ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే కంటెంట్

మోహన్ లాల్ కథానాయకుడిగా మలయాళంలో 'హృదయపూర్వం' అనే సినిమా రూపొందింది. సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా,ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీన విడుదలైంది. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. మాళవిక మోహనన్ ..  సంగీత మాధవన్ నాయర్ .. సంగీత్ ప్రతాప్ .. సిద్ధికీ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 26వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ: సందీప్ బాలకృష్ణన్ (మోహన్ లాల్) సిటీలో ఒక కిచెన్ సెంటర్ ను నిర్వహిస్తూ ఉంటాడు. తల్లీదండ్రులను కోల్పోయిన సందీప్, జీవితంలో ఒక తోడు అవసరమని భావిస్తాడు. అయితే పెళ్లికూతురు పారిపోవడంతో పీటలపై పెళ్లి ఆగిపోతుంది. అప్పటి నుంచి అతను పెళ్లి గురించిన ఆలోచన చేయడు. ఊహించనివిధంగా అతనికి హార్ట్ సర్జరీ జరుగుతుంది. పూణెకి చెందిన రవీంద్రనాథ్ అనే వ్యక్తి గుండెను సందీప్ కి అమర్చుతారు. 

సందీప్ పూర్తిగా కోలుకున్న తరువాత హాస్పిటల్ నుంచి తిరిగొస్తాడు. సందీప్ కోలుకోవడం అతని బావకి ఎంతమాత్రం ఇష్టం లేని విషయం. ఎందుకంటే ఊహించని విధంగా రేటు పెరిగిన ఆయన స్థలాలను సొంతం చేసుకోవాలనే ఆలోచనలో అతను ఉంటాడు. అలాంటి పరిస్థితులలో సందీప్ ను కలవడానికి హరిత (మాళవిక మోహనన్) వస్తుంది. సందీప్ కి అమర్చిన హార్ట్ తన తండ్రిదేనని చెబుతుంది. పూణెలో జరగనున్న తన ఎంగేజ్ మెంట్ కి రమ్మని ఆహ్వానిస్తుంది. 

హాస్పిటల్ వారు తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను దగ్గరుండి చూసుకోవడానికిగాను,  అసిస్టెంట్ గా ఇచ్చిన జెర్రీ (సందీప్ ప్రతాప్)ను వెంటబెట్టుకుని సందీప్ పూణె వెళతాడు. అక్కడే ఆయన మొదటిసారిగా రవీంద్రనాథ్ భార్యను చూస్తాడు. ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ కాగానే వెంటనే బయల్దేరి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఊహించని విధంగా ఆ ఫంక్షన్ లో గొడవ జరుగుతుంది. అందుకు కారణం ఏమిటి? అప్పుడు సందీప్ ఏం చేస్తాడు? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: సాధారణంగా ఎవరైనా చనిపోతే, వారికి సంబంధించిన అవయవాలను అవి అవసరమైనవారికి అమర్చుతూ ఉంటారు. అయితే చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు, ఆ వ్యక్తి అవవయవాలను ఎవరికైతే అమర్చారో వారిని ఎంతగానో అభిమానించడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఆ అవయవాలను పొందినవారికి, కొత్త వ్యక్తులు చూపించే ప్రేమాభిమానాలు చిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఒక ప్రధానమైన అంశం చుట్టూ తిరిగే కథ ఇది. 

 ఈ కథలో చాలానే పాత్రలు కనిపిస్తాయి. ఆ పాత్రలు .. వాటి స్వభావాలు మన చుట్టూ ఉన్న వాస్తవ పరిస్థితులను పరిచయం చేస్తాయి. అయినవాళ్ల పేరుతో ఆస్తులు కాజేయాలనే పాత్రలు .. ప్రేమ పేరుతో మోసం చేసే పాత్రలు కనిపిస్తాయి. అయితే మంచి మనుషులకు మంచి ఫలితాలు దక్కుతాయి. స్వార్థంతో ప్రవర్తించేవారికి అందుకు తగిన ప్రతిఫలాలే దక్కుతాయనేది దర్శకుడు చూపించిన విధానం బాగుంది. 

అయితే ఈ కథలో ఎక్కడా కూడా ట్విస్టులు ఉండవు. కథ చాలా నిదానంగా .. నింపాదిగా నడుస్తూ వెళుతుంది. జీవితానికి గల పరమార్థం ఏమిటంటే, మన చుట్టూ ఉన్నవారికి కొత్త జీవితాన్ని ఇవ్వడమే అనే సందేశం ఈ కథలో మనకి అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది. సున్నితమైన భావోద్వేగలకు స్పందించే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చే అవకాశాలు ఎక్కువని చెప్పాలి. 

పనితీరు: కొన్ని సినిమాలు పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందుతుంటాయి. అలాంటి సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా కనిపిస్తుంది. దర్శకుడు ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసిన తీరు చాలా సహజంగా అనిపిస్తుంది. అందరు ఆర్టిస్టులు ఆ స్థాయిలో నటించారు కూడా. సున్నితమైన ఈ కథాంశానికి తగినట్టుగానే ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ కనిపిస్తాయి. 

ముగింపు: ఎప్పుడూ పనీ పనీ అంటూ హడావిడిగా పరిగెత్తడం కాదు. నీ చుట్టూ ఉన్నవారి అవసరాలను .. ఆపదలను గమనించు. నిన్ను ప్రేమిస్తున్నవారిని గుర్తించు. హృదయానికి ఉండే ప్రధానమైన లక్షణం ప్రేమను పంచడం .. ప్రేమను పొందడం అనే విషయాన్ని సున్నితంగా చెప్పిన కంటెంట్ ఇది. 

Movie Details

Movie Name: Hridayapoorvam

Release Date: 2025-09-26

Cast: Mohanlal, Malavika Mohanan, Sangitha Madhavan Nair, Sangeeth Prathap, Siddhique

Director: Sathyan Anthikad

Producer: Antony Perumbavoor

Music: Justin Prabhakaran

Banner: Aashirvad Cinemas

Review By: Peddinti

Hridayapoorvam Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews