'సుమతి వలవు' (జీ 5) మూవీ రివ్యూ!

  • మలయాళంలో రూపొందిన సినిమా 
  • బలమైన కథాకథనాలు 
  • ఆసక్తికరమైన మలుపులు 
  • ఆకట్టుకునే సన్నివేశాలు 

చాలా తక్కువ బడ్జెట్ లో రూపొందడం .. భారీవసూళ్లను రాబట్టడం మలయాళ సినిమాలకు మామూలే. అలా మలయాళం నుంచి వచ్చిన మరో సినిమానే 'సుమతి వలవు'. హారర్ కామెడీ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అర్జున్ అశోకన్ .. మాళవిక మనోజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ రోజు నుంచి 'జీ 5'లో మలయాళంతో పాటు, తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లోను స్ట్రీమింగ్ అవుతోంది.

కథ: అది అడవిని ఆనుకుని ఉన్న 'కల్లేలి' అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామానికి మూడు వైపులా ఫారెస్ట్ ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాస్త దూరం ముందుకు వెళితే ఒక టర్నింగ్ వస్తుంది. దానినే 'సుమతి వలవు' అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. చాలా కాలం క్రితం చనిపోయిన 'సుమతి' అనే యువతి అక్కడ దెయ్యమై తిరుగుతుందని ఆ గ్రామస్తులంతా భావిస్తూ ఉంటారు. బ్రిటిష్ వారి కాలంలో అక్కడ ఏర్పాటు చేసిన స్థావరాన్ని, ఆ దెయ్యం భయంతో ఖాళీ చేశారనే ఒక మాట ప్రచారంలో ఉంటుంది. 

సుమతి అనే ఆ దెయ్యం భయం కారణంగా, రాత్రి 8 గంటలు దాటిన తరువాత ఎవరూ కూడా ఇల్లు దాటరు. ఆ సమయం దాటిన తరువాత అటుగా ఎవరూ వెళ్లకుండా ఒక 'చెక్ పోస్టు'ను కూడా ఏర్పాటు చేస్తారు. ఆ ఊరుకి చెందిన శేఖరన్ పెద్దకూతురు 'మాలు' తనకి నచ్చిన వ్యక్తితో పారిపోతుంది. అయితే ఆ సమయంలో ఆమెను దెయ్యం చంపేసి ఉంటుందనే ఒక అనుమానం కూడా అక్కడివారిలో ఉంటుంది. 

'మాలు' పారిపోవడానికి సహాయపడింది 'అప్పూ' అనే డౌట్ శేఖరన్ ఫ్యామిలీకి ఉంటుంది. అప్పటి నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య శత్రుత్వం కొనసాగుతూ ఉంటుంది. అయితే శేఖరన్ రెండో కూతురు 'భామ'(మాళవిక మనోజ్), అప్పూను ప్రేమిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సుమతి కథను కొట్టిపారేస్తూ ఆ ఏరియాకి కొత్తగా ఎస్ ఐ బెంజిమన్ వస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? సుమతి ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి? భామతో అప్పూ పెళ్లి జరుగుతుందా? అనేది కథ. 

విశ్లేషణ: 'సుమతి వలవు' .. అంటే 'సుమతి మలుపు' అని అర్థం. చాలా ప్రాంతాలలో .. రహదారులలో .. ఒకే ప్రదేశంలో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఒకే ప్లేస్ లో చాలామంది ప్రాణాలను కోల్పోతూ ఉంటారు. దాంతో అక్కడ ఏదో ఉంది అనే ప్రచారం జరుగుతూ ఉంటుంది. అలా కేరళలోని 'తిరువనంతపురం' పరిథిలో ఇదే పేరుతో ఒక రోడ్డు మలుపు ఉంది. అక్కడ వినిపించే కథను ఆధారంగా చేసుకుని నిర్మించిన సినిమా ఇది.

సుమతి దెయ్యంగా మారిన కథ .. 'మాలు' అనే యువతి ప్రేమించినవాడితో రాత్రివేళలో ఆ మలుపు దాటుకుని వెళ్లిన కథ .. ప్రస్తుతం ఆ విలేజ్ లో నడిచే అప్పూ ప్రేమకథ. ఇలా ఈ మూడు  కథలను కలుపుకుంటూ ఈ సినిమా కొనసాగుతుంది. ఒక వైపున హారర్ .. ఒక వైపున లవ్ .. మరొక వైపున సస్పెన్స్ తో ఈ కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది. ప్రధానమైన పాత్రలను .. సన్నివేశాలను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది.

విలేజ్ లో ఉండే పాత్రలు విలేజ్ లో ఉండగా, కొత్త ఫారెస్ట్ ఆఫీసర్ గా హరి .. పోలీస్ ఆఫీసర్ గా బెంజిమన్ .. ఆర్మీ ఆఫీసర్ గా మహేశ్ ఒకరి తరువాత ఒకరుగా ఆ విలేజ్ లోకి ఎంటర్ కావడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఒక వైపున ఫారెస్టు ఏరియా .. మరో వైపున సుమతి మలుపు .. చెక్ పోస్టు .. విలేజ్ కి సంబంధించిన నైట్ ఎఫక్ట్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. చివరివరకూ మనలో ఆసక్తి ఎంతమాత్రం తగ్గకుండా చేస్తాయి.

 పనితీరు: నిజానికి ఇది యథార్థ సంఘటనతో ముడిపడిన ఒక చిన్న కథ. కానీ దర్శకుడు ఈ కథను అల్లుకున్న తీరు .. కథనాన్ని నడిపించిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తుంది. నిజమైన గ్రామం .. గ్రామస్తుల మధ్యనే ఈ కథ నడిచిందేమో అనేంత సహజంగా సన్నివేశాలను ఆవిష్కరించడం కనిపిస్తుంది.

కథ - స్క్రీన్ ప్లేతో పాటు, శంకర్ ఫొటోగ్రఫీ .. రంజిన్ రాజ్ నేపథ్య సంగీతం .. షేక్ మహ్మద్ అలీ ఎడిటింగ్ ఈ సినిమాకి మరింత సపోర్ట్ గా నిలిచాయి.  ఆర్టిస్టులంతా చాలా సహజంగా నటించారు. కథాకథనాలకు తగిన లొకేషన్స్ ఈ సినిమాకి మరింత హెల్ప్ అయ్యాయని చెప్పాలి. 

ముగింపు: బలమైన కథనాథనాలతో ఒక చిన్న సినిమాను రూపొందిస్తే, పాత్రలను .. సన్నివేశాలను ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చెబుతుంది. ఎలాగో దెయ్యం ఉంది కదా అని మాటిమాటికీ భయపెట్టకుండా ఈ కంటెంట్ ను నడిపించిన తీరు ఆడియన్స్ కి నచ్చుతుంది. 

Movie Details

Movie Name: Sumathi Valavu

Release Date: 2025-09-26

Cast: Arjun Ashokan, Malavika Manoj, Gokul Suresh, Saiju Kurup, Balu Varghiese, Shivada

Director: Vishnu Sasi Shankar

Producer: Gokulam Gopalan -Murali

Music: Ranjin Raj

Banner: Sree Gokulam Movies

Review By: Peddinti

Sumathi Valavu Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews