'డు యూ వాన్నా పార్ట్నర్' (అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ!

  • 8 ఎపిసోడ్స్ గా 'డు యూ వాన్నా పార్ట్నర్'
  • ప్రధాన పాత్రల్లో తమన్నా - డయానా పెంటి
  • నిదానంగా సాగే కథాకథనాలు
  • వినోదపరమైన అంశాలు తక్కువ 
  • ఆకట్టుకోని సన్నివేశాలు              

హిందీలో తమన్నా .. డయానా పెంటి ప్రధానమైన పాత్రలను పోషించిన వెబ్ సిరీస్ 'డు యూ వాన్నా పార్ట్నర్'. అర్చిత్ కుమార్ - కాలిన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను, 8 ఎపిసోడ్స్ గా రూపొందించారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఈ సిరీస్ 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు ఇతర భాషల్లోను అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్ కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: సిఖా రాయ్ (తమన్నా) తన చిన్నతనంలోనే తండ్రి సంజోయ్ రాయ్ ని కోల్పోతుంది. అందుకు కారకుడు విక్రమ్ వాలియా (నీరజ్). సంజయ్ ఎంతో కష్టపడి ఒక కొత్తరకం 'బీర్' ను తయారు చేస్తాడు. ఆ బీర్ కి సంబంధించిన ఫార్ములా తీసుకుని అతనిని వాలియా మోసం చేస్తాడు. అప్పటి ఆ దృశ్యం సిఖా రాయ్ మనసులో అలా నిలిచిపోతుంది. 

 తండ్రి బీర్ ఫార్ములాలో రెండు రకాల పదార్థాలు తప్ప మిగతావాటిపై సిఖాకి అవగాహన ఉంటుంది. అందువలన ఆమె బీర్ బిజినెస్ చేయాలని అనుకుంటుంది. ఉన్న ఉద్యోగం ఊడటంతో ఆమె ఈ నిర్ణయానికి వస్తుంది. తనకి రావలసిన ప్రమోషన్ వేరే వారికి వెళ్లడం వలన అలిగి జాబ్ మానేసిన అనహిత (డయానా పెంటి) కూడా సిఖాతో చేతులు కలుపుతుంది. అప్పటికే బీర్ బిజినెస్ లో మార్కెట్ లో వాలియా పాతుకుపోయి ఉంటాడు. అతనిని దెబ్బతీయాలనే కసితో సిఖా ఉంటుంది. 

బీర్ బిజినెస్ కి సంబంధించిన సిఖా - అనాహిత ప్రయత్నాలు మొదలెడతారు. అయితే ఇది లేడీస్ చేసే బిజినెస్ కాదంటూ, ఎవరూ వాళ్లతో డీల్ కుదుర్చుకోరు. దాంతో 'డేవిడ్ జోన్స్' అనే ఒక పాత్రను AI ద్వారా క్రియేట్ చేసి, అవతలివారిని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. 'డేవిడ్ జోన్స్'ను నేరుగా పరిచయం చేయమని అంతా పట్టుబడతారు. అప్పుడు సిఖా - అనహిత ఏం చేస్తారు? ఆ విషయంలో వాళ్లు తీసుకున్న నిర్ణయం ఎలాంటి చిక్కుల్లో పడేస్తుంది? అనేది కథ.             

విశ్లేషణ: తన తండ్రి మోసపోయిన రంగంలో తాను రాణించాలనే పట్టుదలతో ముందుకు వెళ్లిన సిఖా అనే ఒక యువతి కథనే ఇది. అలాగే తన తండ్రి కొన్నేళ్ల పాటు కష్టపడి తయారు చేసిన కొత్తరకం బీర్ ను ప్రపంచానికి రుచి చూపించాలనే పట్టుదలతో ఆమె ముందుకు వెళ్లిన తీరే ఈ కథ. ఆర్ధికపరంగా .. అండదండల పరంగా తనకెదురైన సవాళ్లను ఆమె ఎలా అధిగమించిందనే అంశాలతో ఈ కథ కొనసాగుతుంది.

ఈ కథలో ప్రధానమైన పాత్రలు ఒక అరడజను వరకూ కనిపిస్తాయి. మిగతా పాత్రలు వచ్చి వెళుతూ ఉంటాయి. ఈ సిరీస్ మొదలైన దగ్గర నుంచి చివరివరకూ బిజినెస్ కి సంబంధించిన వ్యవహారాలు .. అందుకు సంబంధించిన వ్యూహాలతోనే కొనసాగుతుంది. అవి కూడా అంత ఆసక్తికరంగా అనిపించవు. ఎదగడానికి సిఖా - అనహిత చేసే ప్రయత్నాలు, వారిని అడ్డుకోవడానికి విలన్ వేసే ప్లాన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉండవు. 

కథలో ఎలాంటి కొత్తదనం లేదు .. కథనం కూడా రొటీన్ గా ఉంటుంది. కామెడీ టచ్ ఇవ్వడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ కూడా చప్పగానే అనిపిస్తాయి. తమన్నా .. డయానా పెంటి గ్లామరస్ కనిపించారు గానీ, వాళ్ల వైపు నుంచి గొప్పగా అనిపించే సన్నివేశాలేం లేవు. నిర్మాణ విలువల పరంగా వంకబెట్టడానికేమీ లేదు. కాకపోతే సాదాసీదా కథను ఎంచుకోవడమే నిరాశ పరుస్తుంది. 

పనితీరు
: ఈ కథలో సిఖా పాత్రకి అనుకున్నది సాధించాలనే కసి ఉంటుంది .. సాధించి చూపించాలనే పట్టుదల ఉంటుంది. కాకపోతే ఆ దిశగా సాగే ఆమె ప్రయాణం ఆసక్తికరంగా అనిపించదు. ప్రేక్షకులలో ఎలాంటి కుతూహలాన్ని రేకెత్తించే సన్నివేశాలను డిజైన్ చేసుకోకపోవడమే ప్రధానమైన లోపంగా కనిపిస్తూ ఉంటుంది. 

తమన్నా .. డయానా పెంటి .. జావేద్ జాఫ్రీ .. తదితరులు తమ పాత్రల పరిధిలో నటించారు. అయితే పాత్రలను డిఫరెంట్ గా డిజైన్ చేయపోవడం వలన ఏమీ అనిపించదు. కెమెరా పనితనం  .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు.

ముగింపు
: పూర్తిగా బిజినెస్ విషయాలపైనే సాగే కథ ఇది. కథలో బిజినెస్ ఒక భాగమైతే, మిగతా భాగాలను వినోదపరమైన అంశాలు ఆక్రమిస్తాయి. అప్పుడు చూడటానికి ఆడియన్స్ కి ఇబ్బంది ఉండదు. కానీ కథ మొత్తాన్ని బిజినెస్ డీల్స్ తోనే నింపేస్తే, వాటిపై పెద్దగా అవగాహన లేని ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. ఈ సిరీస్ విషయంలో అదే జరిగిందేమో అనిపిస్తుంది.

Movie Details

Movie Name: Do You Wanna Partner

Release Date: 2025-09-12

Cast: Tamannah Bhatia, Diana Penty, Nakuul Mehtha, Jaaved Jaafery, Neeraj Kabi, Shwetha Tiwari

Director: Archith Kumar - Collin D Cunha

Producer: Karan Johar - Apoorva Mehta

Music: -

Banner: Dharmatic Entertinment

Review By: Peddinti

Do You Wanna Partner Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews