తేజ సజ్జా హీరోగా రూపొందిన సినిమానే 'మిరాయ్'. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. మంచు మనోజ్ ప్రతి నాయకుడిగా నటించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, అంచనాలను అందుకోగలిగిందా లేదా? అనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: ఈ కథ అశోకుడి కాలంలో .. కళింగ యుద్ధంతో మొదలవుతుంది. ఈ యుద్ధం తరువాత అశోకుడి మనసు పూర్తిగా మారిపోతుంది. కీర్తి ప్రతిష్ఠల కోసం తాను కొనసాగిస్తూ వచ్చిన యుద్ధకాండకు ముగింపు పలుకుతాడు. తన పరాక్రమానికి కారణమైన దైవిక శక్తులను తొమ్మిది గ్రంథాలలో నిక్షిప్తం చేస్తాడు. ఆ గ్రంథాలను రక్షించే బాధ్యతను 9 మంది యోధులకు అప్పగిస్తాడు. అప్పటి నుంచి ఆ గ్రంథాలను ఆ యోధుల వారసులు రక్షిస్తూ ఉంటారు.

 కాలక్రమంలో క్షుద్ర మాంత్రికుడైన మహావీర్ (మంచు మనోజ్)కి ఆ తొమ్మిది గ్రంథాలను గురించి తెలుస్తుంది. తాంత్రిక శక్తులను కలిగిన మహావీర్, ఆ తొమ్మిది గ్రంథాలను సొంతం చేసుకోవాలనే నిర్ణయానికి వస్తాడు. ఒక్కో గ్రంథాన్ని తన సొంతం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాడు. ఈ విషయం అంబిక (శ్రియ) ఆశ్రమవాసులకు తెలుస్తుంది. దాంతో గురువు ఆదేశంతో 'విభ' (రితిక నాయక్) అక్కడి నుంచి బయల్దేరుతుంది. వేద ( తేజ సజ్జా) అడ్రస్ తెలుసుకుని అతనిని కలుసుకుంటుంది.  

తన తల్లి ఎవరనేది తెలియని వేద, హైదరాబాదులో స్క్రాప్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఆకతాయిగా రోజులు గడిపేస్తున్న అతనిని విభ మాటలు ఆశ్చర్యపరుస్తాయి. అశోకుడి 9 గ్రంథాలను గురించి ఆమె అతనికి వివరంగా చెబుతుంది. ఒక దుష్టుడు ఆ 9 గ్రంథాలను దక్కించుకునే పనిలో ఉన్నాడనీ, అతనిని ఎదిరించాలంటే హిమాలయాలలోని 'మిరాయ్' అనే ఆయుధం అవసరమని చెబుతుంది. అతని తల్లి అంబిక 9వ గ్రంథాన్ని ఎక్కడ నిక్షిప్తం చేసిందో తెలుసుకుని, దానిని కాపాడమని కోరుతుంది. అప్పుడు వేద ఏం చేస్తాడు? ఈ కార్య సాధనలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? మిరాయ్ ఆయుధం గొప్పతనం ఏమిటి? మహావీర్ నేపథ్యం ఏమిటి? వేద తల్లి అంబిక ఏమైంది? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: 'మిరాయ్' అనే టైటిల్ ను సెట్ చేయడంలోనే దర్శకుడు సగం సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఎందుకంటే ఈ టైటిల్ లోని మేజిక్ ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అయింది. ట్రైలర్ చూసిన వాళ్లకి విజువల్స్ బాగున్నాయని అనిపించింది. కాకపోతే కథ ఏమిటో .. ఎలా ఉండబోతుందో అనే ఒక సందేహం వెంటాడుతూనే వచ్చింది. థియేటర్ కి వచ్చిన తరువాత మాత్రం నిరాశతో వెనుదిరగారనే చెప్పాలి. 

కార్తీక్ ఘట్టమనేని ఈ కథపై గట్టి కసరత్తు చేశాడనే విషయం మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కథను వారణాసి .. హిమాలయాలు .. జపాన్ .. టిబెట్ .. మొరాకో ప్రాంతాలలో నడిపించిన విధానం పట్టు సడలకుండా సాగుతుంది. ఈ కథను అశోక చక్రవర్తి కాలం నుంచి తీసుకుని వెళ్లి శ్రీ రాముడికి లింక్ చేసిన విధానం పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. అలాగే దశమహావిద్యలలో ఒకరైన బగళాముఖీని కథలో భాగం చేసిన తీరు కూడా మెప్పిస్తుంది. 

తల్లి .. గురువు .. దైవం అనే బలమైన పాత్రలను అతను ఈ కథలో కీలకమైన స్థానాల్లో ఉంచాడు. ఆ పాత్రల మార్గదర్శకత్వంలో  హీరో ముందుకు వెళ్లడం ప్రేక్షకులను బలంగా పట్టుకుంటుంది. ఒక వైపున చరిత్ర .. ఒక వైపున వర్తమానం, ఈ రెండింటి నడుమ ఆధ్యాత్మికతకు .. తంత్ర సాధనకు మధ్య గల పోటీగా ఈ కథను నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ ను ఒక రేంజ్ కి తీసుకుని వెళ్లి, ప్రేక్షకులతో విజిల్స్ వేయించాడు. 

పనితీరు
: 'అమ్మ' అనే రెండు అక్షరాలకు మించిన సెంటిమెంట్ ఈ ప్రపంచంలో ఎప్పటికీ పుట్టలేదేమో. అలాగే మార్గం చూపించే గురువు .. దైవం అనేవి కూడా బలమైన సెంటిమెంట్ ను వర్కవుట్ చేస్తాయి. అలాంటి ఈ మూడు అంశాలను తన కథలో జోడించడంతోనే దర్శకుడు మంచి మార్కులు కొట్టేశాడు. కథకి తగిన లొకేషన్స్ .. గ్రాఫిక్స్  తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు.

తేజ సజ్జా తన పాత్రకి తగిన నటన కనబరిచాడు. మంచు మనోజ్ విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రితిక నాయక్ కథానాయిక స్థానంలో కనిపించకపోయినా, సింపుల్ గా అనిపిస్తూనే, చాలా అందంగా కనిపిస్తుంది. ఈ సినిమా తరువాత ఆమె మరికొన్ని అవకాశాలు అందుకోవచ్చు. ఇక జగపతిబాబు లుక్ కొత్తగా అనిపించింది ..  బాగుంది.   

ఫొటోగ్రఫీ  పరంగా కార్తీక్ ఘట్టామనేని ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాడు. హిమాలయాలకు సంబంధించిన లొకేషన్స్ ను అద్భుతంగా ఆవిష్కరించాడు. గౌర హరి నేపథ్య సంగీతం కూడా ఈ సినిమాకి ఒక పిల్లర్ గా నిలిచిందని చెప్పాలి. ఆయన ఈ రేంజ్ బీజీఎమ్ ఇవ్వగలడని నిరూపించిన సినిమా ఇది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది. 

ముగింపు: బలమైన కథ .. ఆసక్తికరమైన కథనం ..  కథకి తగిన లొకేషన్స్ .. సందర్భానికి తగిన గ్రాఫిక్స్ .. ఇలా అన్ని వైపుల నుంచి ఆకట్టుకునే సినిమా ఇది. ఈ మధ్య కాలంలో అన్ని పాళ్లు కుదిరిన సినిమాగా 'మిరాయ్' గురించి చెప్పుకోవచ్చు.