కెరీర్లో సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా డిఫరెంట్ చిత్రాలు చేస్తుంటాడు కథానాయకుడు నారా రోహిత్. తాజాగా ఆయన 'సుందరకాండ' పేరుతో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంలో నటించాడు. గతంలో వెంకటేష్, మీనా , అపర్ణ ముఖ్యతారలుగా వచ్చిన 'సుందరకాండ' మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు అదే టైటిల్‌తో వచ్చిన తాజా 'సుందరకాండ' చిత్రానికి వెంకటేష్ 'సుందరకాండ' చిత్రానికి కథాంశం విషయంలో పోలీక లేకపోలేదు. అదేంటో సినిమా చూస్తే తెలిసిపోతుంది. ఈ శుక్రవారం వినాయక చవితి పర్వదినాన ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సుందరకాండ' ఎలా ఉంది? నారా రోహిత్ ప్రేక్షకులను మెప్పించాడా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం..
కథ: సిద్దార్థ్ (నారా రోహిత్) మూడు పదుల వయసు దాటిన యువకుడు. పెళ్లి చేసుకోవాలని తపన పడుతుంటాడు. జుట్టుకు రంగేసుకుని పెళ్లి చూపులకు అటెండ్ అవుతుంటాడు. అయితే తను పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిలో తనకు నచ్చిన ఐదు క్వాలిటీస్ ఉండాలనేది అతని కోరిక. అందుకే వచ్చిన ప్రతి సంబంధాన్ని తిరస్కరిస్తుంటాడు.ఈ తరుణంలోనే తనకు పరిచయమైన అమ్మాయి ఐరా (వ్రితి వఘ్ని)లో ఆ ఐదు క్వాలిటీస్ ఉన్నాయని తనకంటే వయసులో చాలా చిన్నదైన అమ్మాయిని ప్రేమిస్తాడు.
అయితే వీళ్లిద్దరి పెళ్లికి ఐరా తల్లి వైష్ణవి (శ్రీదేవి విజయ్‌కుమార్) ఒప్పుకోదు. అంతా తేడా వయసు ఉన్న సిద్దార్తో తన కూతురు పెళ్లిని చేయనని అంటోంది. అయితే స్కూల్ టైమ్‌లో సిద్దార్థ్ ప్రేమించిన అమ్మాయి వైష్ణవి అని తెలియడంతో అందరూ షాక్ అవుతారు. ఇక సిద్దూ తన ప్రేమను దక్కించుకోవడం కోసం ఏం చేశాడు. వైష్ణవి తన కూతురు ఐరాని సిద్ధార్థ్‌కు ఇచ్చి పెళ్లి చేసిందా లేదా? వైష్ణవి ఎలా ఒప్పుకుంది? ఇలాంటి ఓ విచిత్రమైన కథే 'సుందరకాండ'
విశ్లేషణ: ఇదొక సున్నితమైన కథాంశం. దర్శకుడు ఈ కథను ఎంచుకోవడమే కత్తి మీద సాము లాంటింది. వెంకటేష్ నటించిన 'సుందరకాండ' చిత్రంలో వెంకటేష్‌ను స్టూడెంట్ అపర్ణను ప్రేమిస్తే.. ఈ సినిమాలో లెక్చరర్ స్టూడెంట్ను ప్రేమిస్తాడు. ఇలాంటి ఓ టిపికల్ కాన్సెప్ట్‌కు దర్శకుడు ఎంటర్టైన్మెంట్ను జోడించి తెరకెక్కించాడు. తొలిభాగం ఎంతో సరదాగా.. ఎంటర్టైన్మెంట్తో సాగిపోతుంది. ఇంతలోనే ఇంటర్వెల్ బ్యాంగ్‌తో కథ ఓ విచిత్రమైన మలుపు తిరుగుతుంది. అయితే సెకండాఫ్‌లో ఏం జరగబోతుంది అనే ఇంట్రెస్ట్ మాత్రం కలుగుతుంది. ఇదే కథలో కీలకమైన ఘట్టం.
తొలిభాగంలో నారా రోహిత్‌పై చిత్రీకరించిన పాట, ఫైట్లు కథకు కాస్త ఇబ్బందిగా అనిపించాయి. అయితే ఆ తరువాత వెంటనే ఓ మంచి సన్నివేశం, ఓ మంచి సంభాషణతో దర్శకుడు ఆ బోరింగ్ ఎలిమెంట్‌ను కవర్ చేశాడు. ముఖ్యంగా దర్శకుడు సంభాషణలు చక్కగా రాసుకున్నాడు. మంచి వినోద భరితమైన డైలాగ్‌లు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. అయితే వింటానికి చాలా విచిత్రంగా ఉంటే ఈ కథాంశం మెయిన్ పాయింట్‌ను దర్శకుడు మంచి అనుభవమున్న దర్శకుడిలా డీల్ చేశాడు. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగతీతగా అనిపించినా వెంటనే తదుపరి సన్నివేశంలో దర్శకుడ కవర్ చేయడంతో సినిమా ఆద్యంతం ఆసక్తిగా కొనసాగింది.
కాస్త నీడ వస్తే ఆరిపోయే బట్టలు తడిపితే కోపం వస్తుందో లేదో తెలియజేసే లాజిక్, మా ఇంటికి ఎవరైనా భోజనానికి పిలవాలన్నకున్న కూడా భోజనం పెట్టి పిలుస్తాం అనే తరహాలో సాగే కామెడీ సంభాషణలు.. ఇలాంటివి ఎన్నో ఆడియన్స్‌కు వినోదాన్ని పంచాయి. ఫస్ట్‌హాఫ్ తరువాత అందరికి తెలిసిపోయిన ఓ విచిత్రమైన కాన్సెప్ట్‌ను దర్శకుడు ఎంతో కన్వీన్సింగ్‌గా తెరకెక్కించాడు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ఆయన తెరకెక్కించిన విధానం దర్శకుడిగా, రచయితగా ఆయన ప్రతిభకు నిదర్శనం.
నటీనటలు పనితీరు: సిద్థార్థ్ పాత్రలో నారా రోహిత్ ఒదిగిపోయాడు. ఇలాంటి ఏజ్ బార్ యువకుడి పాత్రను ఒప్పుకోవడంతో నటుడిగా ఆయన ఓ మెట్టు ఎదిగాడు. ప్రతి సన్నివేశం రక్తికట్టడంలో రోహిత్ దోహదపడ్డాడు. ఐరాగా వృతి వాఘాని క్యూట్‌గా ఉంది. తన పాత్రకు న్యాయం చేసింది. శ్రీదేవి స్క్రీన్ మీద కనిపిస్తుంటే కళ్లు తిప్పుకోలేదం. ఇప్పటికీ ఆమె చాలా అందంగా ఉంది. వాసుకి, నరేష్ గోమఠం, రూపాలక్ష్మీ , వీటీవీ గణేష్ లు మంచి పాత్రల్లో కనిపించారు.
ఇక ఈ చిత్రంలో ప్రత్యేకంగా స్పెషల్‌గా చెప్పుకోవాల్సిన పాత్ర కమెడియన్ సత్య గురించి. ఆయన కామడీ టైమింగ్.. ఆయన నటన సినిమాను మరో మెట్టు ఎక్కించింది. ఫుల్‌లెంగ్త్ వినోదాన్ని అందించాడు. ప్రీరిలీజ్ వేడుకలో నారా రోహిత్ చెప్పినట్లుగా ఈ సినిమాకు సత్య చాలా వరకు ప్లస్ అయ్యాడు. సత్య భార్యగా సునైనా కూడా వినోదాన్ని పండించింది. సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్ పాటల కంటే నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రాఫర్ వర్క్ ఆకట్టుకుంటుంది. సినిమా అంతా ప్లెజెంట్‌గా అనిపించింది.
ఓవరాల్‌గా నారా రోహిత్ 'సుందరకాండ'తో ప్రయత్నం సఫలమైంది. మంచి వినోదాన్ని, ఓ ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్ను కోరుకునే ప్రేక్షకులకు ఇదొక మంచి టైమ్‌పాస్ మూవీ.. అందరూ ఎటువంటి సందేహం లేకుండా ఫ్యామిలీతో చూడొచ్చు.
'సుందరకాండ' సినిమా రివ్యూ
Sundarakanda Review
- గమ్మతైన కాన్సెప్ట్‌తో 'సుందరకాండ'
- అలరించిన వినోదం
- సున్నితమైన కథాంశంతో ప్రతిభ చూపిన దర్శకుడు
Movie Details
Movie Name: Sundarakanda
Release Date: 2025-08-27
Cast: Nara rohit, Sridevi Vijaykumar, Virti Vaghani, Naresh Vijaya Krishna, Satya
Director: Venkatesh Nimmalapudi
Music: Leon James
Banner: Sandeep Picture Palace
Review By: Madhu
Trailer