పవన్ కల్యాణ్ నుంచి స్ట్రైట్ తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రాక చాలా కాలమైంది. 'వకీల్ సాబ్' '.. 'భీమ్లా నాయక్' .. 'బ్రో' వంటి రీమేకుల తరువాత పవన్ చేసిన స్ట్రైట్ సినిమా 'హరిహర వీరమల్లు'. ఏ.ఎమ్. రత్నం నిర్మించిన ఈ సినిమాకి క్రిష్ - జ్యోతికృష్ణ దర్శకులుగా వ్యవహరించారు. అనేక కారణాల వలన ఆలస్యమవుతూ వచ్చిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: ఈ కథ 16వ శతాబ్దంలో మొదలవుతుంది. ఢిల్లీలో ఔరంగజేబు (బాబీ డియోల్) పాలన, గోల్కొండ కేంద్రంగా కుతుబ్ షాహిల పరిపాలన కొనసాగుతున్న రోజులవి. హిందూ మతాన్ని అణచివేసే దిశగా ఔరంగజేబు తన దుర్మార్గపు పాలన కొనసాగిస్తూ ఉంటాడు. అప్పట్లో 'కొల్లూరు'లో వజ్రాల వేట కొనసాగుతూ ఉండేది. అందువలన గోల్కొండ ద్వారా ఢిల్లీకి వజ్రాల తరలింపు జరుగుతూ ఉంటుంది. అలా 'కొల్లూరు'లో బయటపడిన 'కోహినూర్ వజ్రం', ఢిల్లీలోని మొఘల్ రాజుల అధీనంలోకి వెళుతుంది.

ఇది ఇలా ఉండగా .. సనాతన ధర్మం పట్ల సంపూర్ణమైన విశ్వాసం కలిగిన ఒక బ్రాహ్మణ దంపతులకు లభించిన శిశువు, 'హరిహర వీరమల్లు' (పవన్ కల్యాణ్)గా పెరిగి పెద్దవాడవుతాడు. వజ్రాలు .. వాటి ఖరీదు విషయంలో అతనికి పూర్తి అవగాహన ఉంటుంది. వజ్రాలను దొంగిలించి .. వాటి ద్వారా వచ్చిన సొమ్ముతో అతను పేదలకు సాయపడుతూ ఉంటాడు. స్థానికంగా ఉండే దొరలు మాత్రం అతనిని దొంగగా ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే అతని ధైర్య సాహసాల విషయంలో వాళ్లందరికీ భయం ఉంటుంది. 

అలాంటి పరిస్థితులలో ఔరంగజేబు అధీనంలో ఉన్న కోహినూర్ వజ్రాన్ని తనకి తెచ్చిపెట్టమని వీరమల్లుని గోల్కొండ సుల్తాన్ తానీషా కోరతాడు. అందుకు వీరమల్లు అంగీకరిస్తాడు. అయితే సుల్తాన్ బందీగా ఉన్న పంచమి ( నిధి అగర్వాల్)ను అక్కడి నుంచి విడిపించుకుని వెళ్లాలని అతను నిర్ణయించుకుంటాడు. పంచమి ఎవరు? ఆమెను విడిపించాలనే అతని ప్రయత్నం ఫలిస్తుందా? కోహినూర్ వజ్రాన్ని తీసుకొస్తానని వీరమల్లు ఒప్పుకోవడానికి గల కారణం ఏమిటి? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: 'వీరమల్లు' అనే ఒక వజ్రాల దొంగ, మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబును సైతం అయోమయంలో పడేస్తాడు. ఒక మారుమూల గ్రామానికి చెందిన వీరమల్లు, అంచలంచెలుగా ఔరంగజేబు వరకూ ఎందుకు వెళతాడు? ఆ ప్రయత్నంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడు? అనే ఒక ఆసక్తికరమైన అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు.

ఈ కథలో ప్రధానంగా కనిపించేవి గోల్కొండ పరిధిలోని కుతుబ్ షాహీల క్రూరత్వం, ఢిల్లీలో మొఘల్ చక్రవర్తులు సాగించే దుర్మార్గం. ప్రమాదకరమైన ఈ అధికారాల మధ్య నలిగిపోతున్న సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం 'దొంగ'గా మారిన ఒక యువకుడి పోరాటంగా దర్శకుడు ఈ కథను నడిపించాడు. ఫస్టాఫ్ గోల్కొండ వరకూ చేరితే, సెకాండాఫ్ ఢిల్లీ దిశగా కదులుతుంది. ఒక వైపున హీరోయిజం .. మరో వైపున విలనిజానికి సంబంధించిన సీన్స్ ను హైలైట్ చేస్తూనే ముందుకు వెళ్లారు. లైన్ పరంగా చూసుకుంటే బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ సన్నివేశాల ఆవిష్కరణ దగ్గరికి వచ్చే సరికి, ఎక్కడో మొదలై ఎక్కడెక్కడికో వెళ్లిపోతుంది.

ఈ సినిమాకి పోరాట సన్నివేశాలే ప్రధానమైన బలం అనే విషయం, టైటిల్ ను బట్టే అర్ధమైపోతుంది. కానీ ఆ పోరాట సన్నివేశాలు కొత్తగా డిజైన్ చేయలేదు. హీరో హీరోయిన్ మధ్య ఆడియన్స్ ఆశించే స్థాయి లవ్ ట్రాక్ నడవదు. విస్సన్న - అప్పన్న - సుబ్బన్న పాత్రలను వీరమల్లుకి టీమ్ గా ఎందుకు సెట్ చేశారనేది మనకి అర్థం కాదు. ఎందుకంటే ఆ పాత్రల వైపు నుంచి ఎలాంటి కామెడీ కంటెంట్ రాలేదు. 

పనితీరు
: దర్శకుడు కథాకథనాల విషయంలో మరికాస్త కసరత్తు చేయవలసింది. సెట్స్ విషయంలోను .. గ్రాఫిక్స్ విషయంలోను ఇది వర్తిస్తుంది. పవన్ కొన్ని సన్నివేశాలలో క్లీన్ షేవ్ తోను .. మరికొన్ని సన్నివేశాలలో గడ్డంతోను కనిపించడం చూసుకుని ఉంటే బాగుండేది. ఇక తెరపై చాలామంది కనిపించినా మాట్లాడుకోవలసింది ఇద్దరి గురించే. ఒకరు పవన్ అయితే .. మరొకరు బాబీ డియోల్. ఎవరి స్టైల్ తో వాళ్లు ఆకట్టుకున్నారు. వాళ్ల తరువాత అంటే .. ఎవరూ కనిపించరనే చెప్పాలి.  

కీరవాణి బాణీలలో 'కొల్లగొట్టినాదిరో .. ' సాంగ్ హుషారుగా సాగింది. సందర్భానికి తగినట్టుగా నేపథ్య సంగీతం సాగుతుంది. మనోజ్ పరమహంస - జ్ఞానశేఖర్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ప్రవీణ్ ఎడిటింగ్ విషయానికి వస్తే, కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసుకోవచ్చునని అనిపిస్తుంది. ముఖ్యంగా పులిమేక ఆట పేరుతో సాగే ఫైట్, పంచమిని వీరమల్లు తీసుకెళ్లే సీన్ .. పరిధిని దాటి కనిపిస్తాయి. ఇక పవన్ మార్క్ మేనరిజానికి తగిన డైలాగ్స్ కూడా పడలేదనే చెప్పాలి. మొత్తంగా వీరమల్లు సినిమా మొత్తంలో పవన్ అభిమానులకు నచ్చేది ఆయన చేసిన మేజిక్కే అనొచ్చు.  

ముగింపు
: కొన్ని కథలు చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ సరైన కసరత్తు లేకుండా తెరపైకి తీసుకొస్తే అవి తేలిపోతాయి. అప్పుడు అలాంటి కథలను భారీతనం కూడా కాపాడలేదు. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగిందేమో అనిపిస్తుంది. స్క్రిప్ట్ దగ్గర నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే, ఇది పవన్ క్రేజ్ కి తగిన మూవీ అయ్యేదేమో.