బుల్లితెరపై యాంకర్‌గా అందరికి సుపరిచితుడైన ప్రదీప్‌ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' చిత్రంతో  హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత ఆయన కొంత విరామం తీసుకుని తాజాగా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' పేరుతో ఓ చిత్రంలో నటించాడు. ప్రదీప్‌తో పాటు పలు బుల్లితెర కార్యక్రమాల్లో కనిపించిన దీపిక పిల్లి ఈ చిత్రంలో కథానాయికగా నటించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక ప్రదీప్‌ తన ద్వితీయ ప్రయత్నంలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా? లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.. 


కథ:  భైరిలంక గ్రామంలో  ఆడపిల్ల పుట్టకపోవడం వల్లే అందరికి మంచి జరగడం లేదని, వర్షాలు రావడం లేదని భావించిన తరుణంలో ఆ ఊరిలో పుట్టిన ఏకైక ఆడపిల్ల రాజకుమారి (దీపిక). పెద్దయ్యాక కూడా ఈ అమ్మాయి ఊరు దాటడానికి వీలు లేదని, తమ ఊళ్లో ఉన్న అరవై మంది కుర్రాళ్లల్లో  నచ్చిన  వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని గ్రామ పెద్ద తీర్పు ఇస్తారు. అందుకు రాజకుమారి అమ్మా నాన్న కూడా ఒప్పుకుంటారు. 

రాజకుమారి పెరిగి పెద్దదయిన తరుణంలోనే ఆ ఊరిలోకి మరుగుదొడ్లు కట్టించడానికి వస్తాడు  సివిల్‌ ఇంజనీర్‌ కృష్ణ (ప్రదీప్‌ మాచిరాజు) అయితే బయటి నుంచి తమ ఊరికి ఒక్క కుర్రాడు కూడా రావటం ఇష్టం లేని ఆ ఊరి కుర్రాళ్లు కొన్ని షరతులతో కృష్ణ ఆ ఊరిలో ఉండటానికి ఒప్పుకుంటారు. ఇలాంటి పరిస్థితుల మధ్య వచ్చిన కృష్ణ, రాజకుమారిని ఎందుకు ప్రేమించాల్సి వచ్చింది? ఊరి నియమాలు కాదని ఈ ఇద్దరూ ఎలా ఒక్కటయ్యారు? రాజకుమారిని పెళ్లి చేసుకోవాలని ఎదురుచూస్తున్న ఆ అరవై మంది కుర్రాళ్లు ఏం చేశారు? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: ఓ సాదాసీదా సరదా కథ ఇది. ఈ కథ చుట్టు వినోదాత్మక సన్నివేశాలు అల్లుకుని కథను ముందుకు నడిపించాలని చేసిన రెగ్యులర్‌ ప్రయత్నంలా అనిపించింది. బుల్లితెరపై తనదైన పంచ్‌లతో కామెడీ చేసే ప్రదీప్‌కు అదే తరహా పాత్రను డిజైన్‌ చేశారు దర్శకులు. ఈ చిత్ర దర్శకులు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఓ కామెడీ కార్యక్రమానికి దర్శకులు కావడంతో ఈ చిత్రానికి కూడా అదే తరహాలో కొన్ని స్కిట్‌ల తరహాలో కామెడీ సీన్స్‌ను రాసుకున్నారని అనిపించింది. అయితే వినోదమే ధ్యేయంగా కథను నడపాలని అనుకున్నప్పుడు కామెడీ సీన్స్‌ను మరింత హిలేరియస్‌గా రాసుకోవాలి. కథలో లాజిక్స్‌, ఎమోషన్స్‌ లేనప్పుడు తీసుకున్న కథను పూర్తిస్థాయి వినోదాత్మక కథలా మలచాలి. 

అయితే దర్శకుడు రాసుకున్న స్థాయి వెండితెరపై వినోదం పండించే స్థాయిలో లేకపోవడం వల్ల ఆ కామెడీ పండలేదు. ఈ సినిమా కథలో నుంచి వచ్చిన కామెడీలా కాకుండా కామెడీ కోసం చేసిన కథలా అనిపిస్తుంది. ఫస్ట్‌హాఫ్‌ ఓ మోస్తరుగా ఫర్వాలేదనిపించుకున్న, సెకండాఫ్‌లో దర్శకుడు ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమయ్యాడు. కేవలం కామెడీ సన్నివేశాలతోనే సాగదీతగా అనిపించడంతో ప్రేక్షకులు కాస్త అసహనానికి గురవుతారు. 

బిలాల్‌ పాత్రలో కనిపించిన సత్య ఇంతకు  ముందు చిత్రాల్లో ఇంతకు మించిన కామెడీతో ఆకట్టుకోవడంతో ఈ సినిమాలో ఆయన పాత్ర పెద్దగా ఇంప్రెసివ్‌గా అనిపించదు. ముఖ్యంగా గెటప్‌ శ్రీను కామెడీ, సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్‌ వినోదం కాస్త ఆడియన్స్‌కు రిలీఫ్‌గా అనిపిస్తాయి. ఈ కథతో ప్రేక్షకుడు ట్రావెల్‌ అయ్యేంత ఎమోషన్‌ లేదు. ముఖ్యంగా హీరో, హీరోయిన్‌పై వచ్చే లవ్‌సీన్స్‌పై కూడా దర్శకుడు కసరత్తులు చేసినట్లుగా అనిపించలేదు. ముఖ్యంగా సినిమాలో తెరనిండా కమెడియన్స్‌, పాత్రలు కనిపించినా ఆ పాత్రలను సరైన రీతిలో డిజైన్‌ చేయడంలో విఫలమయ్యారు. 

నటీనటుల పనితీరు: పాత్రలో కొత్తదనం లేకపోయినా తనదైన పంచ్‌లతో ప్రదీప్‌ ఇంజనీర్‌ కృష్ణ పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.  అయితే అతనిలోని నటన ప్రతిభను తెలియజేసేంత గొప్ప సన్నివేశాలేమీ చిత్రంలో లేకపోవడంతో తనకు ఇచ్చిన సన్నివేశాలను వన్‌బై వన్‌ చేసుకుంటూ వెళ్లిపోయాడు ప్రదీప్‌. 

బుల్లితెరపై కనిపించిన హుషారు, వెండితెర పాత్రలో కనిపించలేదు. సత్య, గెటప్‌ శ్రీను తమ పరిధుల మేరకు నవ్వించారు. సినిమా సెకండాఫ్‌లో కాస్త నీరసించిపోతున్న తరుణంలో రోహిత్‌ పాత్రలో వెన్నెల కిషోర్‌ కామెడీ సినిమాపై కాస్త ఆసక్తి కలిగేలా చేసింది. బ్రహ్మానందం కూడా తన పాత్రలో నవ్వులు పండించే ప్రయత్నం చేశాడు. 

బాల్‌ రెడ్డి కెమెరా పనితనం, రథన్‌ స్వరాలు సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. టోటల్‌గా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం అక్కడక్కడ నవ్వించారు కానీ చాలా సేపు  విసిగించారు.