విశ్వదేవ్ రాచకొండ హీరోగా రూపొందిన సినిమానే 'నీలిమేఘశ్యామ'.  రొమాంటిక్ కామెడీ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాను, థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఈ సినిమాను నేరుగా ఓటీటీకి తీసుకుని వచ్చారు. ఈ రోజు నుంచే ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. రవి ఎస్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: హైదరాబాదులో శ్యామ్ (విశ్వదేవ్) తన తండ్రి (తణికెళ్ల భరణి)తో కలిసి నివసిస్తూ ఉంటాడు. అతను శ్రీమంతుల బిడ్డ .. సొంత కంపెనీ వ్యవహారాలు చూసుకోవంలో తండ్రి తీరిక లేకుండా ఉంటాడు. శ్యామ్ బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఉండటం పట్ల తండ్రి అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు. జ్ఞానోదయం అయితేనేగానీ అతను దార్లోపడడని భావిస్తాడు. ట్రెక్కింగ్ ను బాగా ఇష్టపడే శ్యామ్, జ్ఞానోదయాన్ని పొంది తిరిగొస్తానంటూ 'మనాలి' వెళతాడు. 

'మనాలి'లో ట్రెక్కింగ్ వైపు నుంచి అతనికి 'మేఘ' పరిచయమవుతుంది. ఆమె అతణ్ణి వెంటబెట్టుకుని ట్రెక్కింగ్ కి తీసుకుని వెళుతుంది. మంచు కొండల్లో ప్రయాణం సాగుతూ ఉండగానే వారి మాటలు కలుస్తాయి. మేఘ చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారనీ, అప్పటి నుంచి ఆమె అమ్మమ్మ తాతయ్యల (శుభలేఖ సుధాకర్ - డబ్బింగ్ జానకి) దగ్గర పెరుగుతూ వచ్చిందనే విషయం అతనికి అర్ధమవుతుంది.

మంచు విపరీతంగా కురుస్తూ ఉండటంతో, మేఘ అతణ్ణి విప్లవ్ (హర్షవర్ధన్) కాటేజీకి తీసుకుని వెళుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? మేఘ - శ్యామ్ మధ్య పరిచయం ఎక్కడివరకూ వెళుతుంది? వంశీ అనే వ్యక్తి ఫోన్లో మేఘను టార్చర్ చేస్తున్నాడని తెలుసుకున్న  శ్యామ్ ఏం చేస్తాడు? అతను ఏ ఉద్దేశంతో అయితే 'మనాలి' వచ్చాడో అది నెరవేరుతుందా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: 'నీలిమేఘశ్యామ' అనేది మంచి ఫీల్ తో కూడిన టైటిల్ .. యూత్ ను ఆకర్షించే టైటిల్. ఇది అచ్చమైన ప్రేమకథ అనే విషయం టైటిల్ ను బట్టే అర్థమైపోతుంది. పోస్టర్లు అందుకు అవసరమైన సాయాన్ని చేస్తూనే ఉంటాయి. అంతా అనుకున్నట్టు ఇది ఒక ప్రేమకథనే. 

ఫస్టాఫ్ లో హీరో - హీరోయిన్ ఇద్దరూ కలుసుకుంటారు .. ఒకరిని గురించి ఒకరు తెలుసుకుంటారు. సెకండాఫ్ లో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. అందుకు దారితీసిన పరిస్థితులతో ఈ కథ ముందుకు సాగుతుంది. 80 శాతం కథ 'మనాలి'లోనే జరుగుతుంది. అక్కడక్కడా ఎమోషన్ ను .. కాస్త ఎక్కువగా కామెడీని టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుంది. 

ఒక ప్రేమకథను అందంగా చూపించాలంటే, అందమైన లొకేషన్స్ లో ఆ కథను నడిపించవలసి ఉంటుంది. అలాగే ఫీల్ తో కూడిన పాటలను ఆవిష్కరించవలసి ఉంటుంది. ఇక మనసుకు హత్తుకుపోయే సన్నివేశాలను డిజైన్ చేయవలసి ఉంటుంది. 'మనాలి' నేపథ్యాన్ని తీసుకోవడం మంచిదే అయింది. అయితే అక్కడ హృద్యమైన సన్నివేశాలను దర్శకుడు ఆవిష్కరించలేకపోవడం నిరాశ పరుస్తుంది.

పనితీరు: హీరో - హీరోయిన్ పేరును కలుపుతూ టైటిల్ ను క్రియేట్ చేయడం మొదలై చాలా కాలమే అయింది. అలా చేయడం వలన ప్రయోజనం ఉందని చెప్పిన సినిమాలు కూడా ఏమీ కనిపించవు. దర్శకుడు హీరో - హీరోయిన్ పాత్రలపైనే మొత్తం ఫోకస్ పెట్టాడు. అలా అని ఆ పాత్రలలో ఏమైనా బలం ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎవరి వైపు నుంచి బలమైన ఎమోషన్ లేదు. ఇద్దరి మధ్య ఆడియన్స్ ను కట్టిపడేసే లవ్ గానీ .. రొమాన్స్ గాని లేవు.

అర్జున్ - కార్తీక్ ఈ కథను అందించారు. ఏ వైపు నుంచి చూసినా ఇది రొటీన్ కథనే అనిపిస్తుంది. హీరో .. హీరోయిన్ మధ్య సహజంగానే లవ్ ఏర్పడుతుంది. ఆ ప్రేరణ కలగడానికి కారణాలు ఎన్నో. కానీ మధ్యలో 'జ్ఞానోదయం' కాన్సెప్ట్ ఏమిటనేది అర్థంకాదు. ఇక నందు కథనం కూడా అంత ఆసక్తికరంగా ఏమీ సాగలేదు. మాటలు కూడా మనసుకు పెట్టుకునేలా అనిపించవు. 

సునీల్ రెడ్డి కెమెరా పనితనం బాగుంది. 'మనాలి' మంచుకొండల నేపథ్యంలోని దృశ్యాలు కాస్త ఊరట కలిగిస్తాయి. ప్రేమకథలకు పాటలే ప్రాణవాయువు. ఆ మాటకొస్తే ప్రేమకథలను ప్రేక్షకుల హృదయానికి మోసుకెళ్లేవే పాటలు. అలాంటి పాటలలో అంత ఫీల్ కనిపించదు. శ్రవణ్ భరద్వాజ్ అందించిన నేపథ్య సంగీతం కూడా ఓ మాదిరిగా అనిపిస్తుంది. బాలాజీ ఎడిటింగ్ ఓకే. 

ముగింపు: ఇది ఎక్కువ పాత్రలతో పనిలేని ఒక చిన్న ప్రేమకథ. ఈ కథలోని సన్నివేశాలను ఒక పరిథిలో కట్టేసిన కథ. అలాంటి ఈ కథలో బలం లేదు .. కొత్తదనం అంతకంటే లేదు. మాటలు .. పాటలు మనసును పట్టుకోవు. కామెడీనీ .. ఎమోషన్స్ ను కలపడానికి ప్రయత్నించారుగానీ, అవి పలచబడిపోయి పట్టుకోవడానికి దొరకవు. టైటిల్లోని ఫీల్ .. కంటెంట్ లో కనిపించేలా చేసుంటే బాగుండేది.