ఇంతకు ముందు పలు సినిమాల్లో నటించిన చేతన్‌ కృష్ణ ఈ సారి ఎంటర్‌టైన్‌మెంట్‌ బాట పట్టాడు. చేతన్‌ కృష్ణ కోసం ఈ సారి ఆయన తండ్రి ఎం. ఎస్‌. రామ్‌కుమార్‌ నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం 'ధూమ్‌ ధామ్‌'. హెబ్బా పటేల్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, ప్రవీణ్ లాంటి కమెడియన్స్‌తో పాటు సాయికుమార్‌, బెనర్జీ లాంటి సీనియర్‌ నటులు నటించారు. వినోదం గ్యారెంటీ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా వుందో తెలుసుకుందాం! 

కథ: కొడుకు అంటే అమితమైన ప్రేమతో పాటు, అతని కోసం ఎలాంటి త్యాగానికైనా రామరాజు( సాయి కుమార్‌) సిద్ధపడుతుంటాడు. తండ్రి మాటను జవదాటకుండా వుంటూ తండ్రిని ప్రేమిస్తూ, గౌరవించే కొడుకు కార్తిక్‌ (చేతన్‌ కృష్ణ). ఒకానొక సందర్భంలో కార్తీక్ అనుకోకుండా సుహాన (హెబ్బాపటేల్‌) ప్రేమలో పడతాడు. కార్తిక్‌ పోలెండ్‌కు వెళితే.. సుహాన కూడా అతని కోసం అక్కడికి వెళుతుంది. పెద్దల అంగీకారంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. 

అయితే సుహాన వాళ్ల నాన్న మహేంద్ర భూపతి (వినయ్‌ వర్మ), అతని అన్నయ్యలు భూపతి బ్రదర్స్‌ ఎవరో తెలిసి కార్తికేయ, అతని ఫ్రెండ్స్‌ షాక్‌ అవుతారు. అసలు సుహాన ఎవరు? వాళ్ల నాన్న భూపతి, అతని అన్నయ్యలతో కార్తిక్‌కు వున్న సంబంధం ఏమిటి? వీళ్ల మధ్య వున్న సమస్యలు ఎలా తొలిగిపోతాయి? కార్తిక్‌ పెళ్లి జరుగుతుందా ? లేదా? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

విశ్లేషణ: శ్రీనువైట్ల సినిమాలకు పనిచేసే రచయిత గోపీ మోహన్‌ అందించిన కథతో, శ్రీను వైట్ల శిష్యుడు సాయి కిషోర్‌ మచ్చ దర్శకత్వంలో రూపొందిన సినిమా అనగానే తప్పకుండా అందరూ వినోదాన్ని ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. అందరూ ఆశించినట్లుగానే ఈ చిత్రం వినోదాత్మకంగానే కొనసాగింది. అయితే ఇది కొత్త కథ ఏమీ కాదు. పాత కథకే కాస్త వినోదాత్మకమైన పాత్రలు జత చేసి ఈ కథను అల్లుకున్నారు.

 ఇంతకు ముందు శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన 'రెడీ'.. ' ఢీ' సినిమాల సెటప్‌ను గుర్తుచేసే విధంగా ఈ చిత్రంలో పాత్రలో కనిపించాయి. అయితే ఈ కథలో తండ్రి కొడుకుల ఎమోషన్‌ మాత్రం ఆకట్టుకుంటుంది. సినిమా తొలిభాగం అలా టైమ్‌పాస్‌గా గడచిపోయినా.. సెకండాఫ్‌ను మాత్రం వినోదాత్మకంగా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. ఫస్ట్‌ హాఫ్‌ అంతా హీరో - హీరో ఫాదర్‌ మధ్య వున్న ప్రేమతో పాటు, హీరో- హీరోయిన్‌ ప్రేమ సన్నివేశాలతో కొనసాగుతుంది.

 సెకండాఫ్‌ హీరో .. హీరోయిన్‌ .. వాళ్ల ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ ఫన్‌, ఎమోషన్‌ చుట్టు నడిపించాడు దర్శకుడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్‌ పాత్ర, అతను పండించిన వినోదం అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంది. ఎక్స్‌ ప్రెషన్‌.. ఎక్స్‌ ప్రెషన్‌ అంటూ వెన్నెల కిషోర్‌ తన నటనతో నవ్వులు పండించాడు. దీంతో పాటు సెకండాఫ్‌లోనే మంగ్లీ ఆడుతూ పాడుతూ చేసిన ప్రత్యేక గీతం మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా వుంది. అయితే ఫస్ట్‌హాఫ్‌లో హీరో, హీరోయిన్‌ వచ్చే సన్నివేశాలను మరింత బలంగా రాసుకుని వుంటే ప్రథమార్థం కూడా అలరించేది. 

నటీనటుల పనితీరు: గతంలో పలు చిత్రాల్లో నటించిన చేతన్‌ మొదటిసారి వినోదాత్మక చిత్రాన్ని ఎంచుకున్నాడు. కార్తిక్‌ పాత్రలో ఆయన నటన బాగానే వుంది. అయితే డైలాగ్‌ డిక్షన్‌ను, నటనలో పరిణితి సాధించాల్సిన అవసరమైతే వుంది. అయితే కార్తిక్‌ పాత్రలో మాత్రం బాగానే రాణించాడు. హెబ్బా పటేల్‌ కూడా తన పాత్రలో మెప్పించింది. సినిమాలో అందంగా కనిపించింది. 

ఈ సినిమాకు మరో హీరో వెన్నెల కిషోర్‌ అని చెప్పుకోవాలి ఎందుకంటే సెకండాఫ్‌లో కిషోర్‌ తన వినోదంతో అందరిని అలరించాడు. తండ్రి పాత్రలో సాయికుమార్‌ తన దైన శైలిలో మెప్పించాడు. భూపతి బ్రదర్స్‌గా గోపరాజు రమణ రాజు, వినయ్‌ వర్మ, బెనర్జీలు తమ పాత్రలను రక్తికట్టించారు. హీరో ఫ్రెండ్స్‌గా ప్రవీణ్‌,నవీన్‌లు అలరించారు. ఇక ఈ సినిమాలో మరో హైలైట్‌గా చెప్పుకోవాల్సింది మంగ్లీ పాట. ఈ పాట సినిమా ప్రధాన ఆకర్షణగా వుంది. 


సాంకేతిక వర్గం పనితీరు: సినిమాటోగ్రఫీ బాగుంది. పోలెండ్‌ లోకేషన్స్‌తో పాటు, పెళ్లి హడావుడి, అక్కడి వాతావరణాన్ని కలర్‌ఫుల్‌గా చూపించారు. పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. గోపీ మోహన్‌ కథ, స్క్రీన్‌ప్లే రెగ్యులర్‌ ఫార్మట్‌లో వున్నా వినోదాన్ని పంచింది. కామెడీ డైలాగ్స్‌  అలరించాయి. తొలి చిత్ర దర్శకుడైనా సాయి కిషోర్‌ ఎక్కడా తడబాటు కనిపించలేదు. అయితే  ఫస్టాఫ్‌పై మరింత శ్రద్ధపెట్టి వుంటే ఇంకాస్త బెటర్‌ అవుట్‌పుట్‌ వచ్చేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా చూసుకుంటే, 'ధూమ్‌ ధామ్‌' అక్కడక్కడా నవ్వించే సినిమా అని చెప్పుకోవచ్చు.