'90 ఎంఎల్' మూవీ రివ్యూ

90 ml

Movie Name: 90 ml

Release Date: 2019-12-06
Cast: Kaarthikeya, Neha Solanki, Rao Ramesh, Posani, Ali, Ravi Kishan, Satya Prakash, Pragathi
Director:Yerra Sekhar Reddy
Producer: Ashok Gummakonda
Music: Anoop Rubens
Banner: Karthikeya Creative Commercials
Rating: 2.75 out of 5
మూడు పూటలా 90 ఎం.ఎల్ మందు తాగనిదే ఉండలేని ‘దేవదాసు’, మందు వాసన తమ గేటు బైట ఉండగానే పసిగట్టే ‘సువాసన’ను ప్రేమిస్తాడు. తన ఈ అలవాటును కప్పిపుచ్చుకుంటూ కథానాయికతో ప్రేమను కొనసాగిస్తాడు. అనుకోని పరిస్థితుల్లో దేవదాసు నిత్య తాగుబోతు అని తెలుసుకున్న కథానాయిక అతనికి దూరం అవుతుంది. ప్రియురాలికి నిజం చెప్పి ఆమె ప్రేమను ఎలా తిరిగి పొందగలిగాడు అనేది కథ. మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసుకున్న ఈ చిత్రం ఆ వర్గానికి నచ్చే అంశాలతో రూపొందింది.

సినిమాలు ముందుగానే క్లాస్, మాస్, అన్ని వర్గాల ప్రేక్షకులు అంటూ ఎంపిక చేసిన వర్గం ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని రూపుదిద్దుకుంటాయి. తాము ఏ వర్గాన్ని టార్గెట్ చేశామో, వారిని సంతృప్తి పరచడమే ధ్యేయంగా ఆ సినిమా కథ, కథనాలు, ఇతర సాంకేతిక అంశాలు ఉంటాయి. అలా మాస్ ప్రక్షకులను టార్గెట్ గా ఎంచుకున్న చిత్రం ‘90ఎంఎల్’. గతంలో ‘ఆర్ఎక్స్100’ వంటి పక్కా మాస్ అండ్ బోల్డ్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన హీరో కార్తికేయ, ఆ తర్వాత ‘గుణ 369’ అంటూ వచ్చి తన ఖాతాలో ఓ అపజయాన్ని వేసుకున్నాడు.

ఇక చిత్ర కథలోకి వెళితే, దేవదాసు(కార్తికేయ) అనే కుర్రాడికి ఒక విచిత్రమైన వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధికి మందుగా 90 ఎం.ఎల్ మందుని సూచిస్తారు డాక్టర్లు. చిన్నతనం నుంచి రోజు క్రమం తప్పకుండా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా మూడు పూటలా 90 ఎం.ఎల్ మందును తీసుకుంటూ ఉంటాడు. ఇతనికి డాక్టర్లు పర్మిటెడ్ డ్రింకర్ గా గుర్తింపు కార్డును కూడా జారీ చేస్తారు.

ఓరోజు స్నేహితుడితో కలిసి వెళుతుండగా ఓ బాలుడు ప్రమాదంలో చిక్కుకోవడంతో అతనిని కాపాడతాడు. అక్కడే ఉన్న హీరోయిన్ సువాసన (నేహా సోలంకి) దాన్ని వీడియో తీయడంతో హీరో, హీరోయిన్ ల మధ్య పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. కధానాయిక కుటుంబం పద్ధతులకు, సంప్రదాయాలకు పెద్దపీట వేసే వారు కావడం, పైగా మందు వాసన తమ గేటు బైట ఉన్నా పసిగట్టి అసహ్యించుకునే వారు కావడంతో, వారికి తన వ్యాధి గురించి తెలియకుండా అప్పటికప్పుడు మేనేజ్ చేస్తూ ఉంటాడు.

ఓ రోజు అనుకోకుండా ఈ విషయం బయట పడుతుంది. దీంతో హీరోయిన్ అతనికి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. ఇక్కడితో ఫస్టాఫ్ ముగుస్తుంది. తన ప్రేమనుగెలిపించుకోవటానికి హీరో ఎలాంటి సంఘటనలను ఫేస్ చేశాడు అనేది ద్వితీయార్ధం.

మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే కొత్త తరహా పాయింట్ ను తీసుకున్నప్పటికీ దర్శకుడు పాత ఫార్ములానే కొనసాగించడం మైనస్ గా చెప్పవచ్చు. కామెడీ సన్నివేశాల విషయంలో దర్శకుడు జాగ్రత్తగానే వ్యవహరించినప్పటికీ, ఇంకొంత దృష్టి పెడితే బాగుండేది. మాస్ ను ఆకట్టుకోవటానికి యాక్షన్ సన్నివేశాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఫైట్స్ లెంగ్త్ ఎక్కువగా అనిపిస్తాయి. అజయ్, బాహుబలి ప్రభాకర్, రవికిషన్ వంటి విలన్లు ఉన్నప్పటికీ హీరోకు, విలన్లకు మధ్య సరైన వైరం కనిపించదు. మెయిన్ విలన్ గా ఫోకస్ చేసిన రవికిషన్ తన కామెడీ చేష్టలతో అలరించినప్పటికీ, సరైన విలనిజం చూపించలేదు.

అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలు మాస్ ను ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రాఫర్ యువరాజ్ తన బాధ్యతలకు న్యాయం చేశాడని చెప్పాలి. నిర్మాణ విలువల పరంగా కార్తికేయ క్రియేటివ్ కమర్షియల్స్ తన ముద్రను చూపించింది. కథ డిమాండ్ మేరకు పాటలు, ఫైట్స్, కాస్టింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.

హీరో తల్లిదండ్రులుగా సత్యప్రకాష్, ప్రగతిలు తమ పరిధి మేర నటించారు. హీరోయిన్ తండ్రిగా రావు రమేష్ తనదైన శైలిని చూపించారు. ఫిజియో థెరపిస్ట్ (డాక్టర్)గా నటించిన హీరోయిన్ నేహా సోలంకి అందంగా కనిపించింది. కేవలం గ్లామర్ డాల్ పాత్రగా కాకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్ర కావడం ఆమెకు కలిసొచ్చింది. పోసాని, అలీ, కత్తి మహేష్ లవి అతిథి పాత్రలు మాత్రమే.

ఇక హీరో కార్తికేయ పాటల్లోనూ, ఇటు ఫైట్స్ లోనూ మంచి ఎనర్జీ చూపించాడు. తనలోని మాస్ హీరోకు కావాల్సిన లక్షణాలకు ఈ సినిమాలో మరింత మెరుగుపెట్టుకున్నాడు. కేవలం అతని పాత్ర చుట్టూ తిరిగే కథ కావడంతో కార్తికేయ తన శక్తి మేర న్యాయం చేశాడు. మంచి మాస్ కథ దొరికితే కార్తికేయపై మీడియం స్థాయికి మంచి బడ్జెట్ పెట్టొచ్చు అనే ధైర్యాన్ని నిర్మాతలకు ఈ సినిమా ఇచ్చిందని చెప్పవచ్చు. మొత్తంగా చెప్పాలంటే కొత్త ఆలోచనకు పాత ట్రీట్మెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు దర్శకుడు యర్రా శేఖర్ రెడ్డి చేసిన ప్రయత్నం కొంత వరకు సఫలమైంది. టైం పాస్ కోసం వెళ్లే వారిని ‘90 ఎం.ఎల్’ నిరుత్సాహ పరచదు.

-సురేష్ కోసూరు 

More Reviews