'కమిటీ కుర్రోళ్లు' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!
Movie Name: Committee Kurrollu
- ఆగస్టు 9న విడుదలైన సినిమా
- ఈ రోజు నుంచి జరుగుతున్న స్ట్రీమింగ్
- గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ
- రాజకీయాలు - జాతర ప్రధానమైన అంశాలు
- ఆకట్టుకునే ఫ్లాష్ బ్యాక్ సీన్స్
ఈ మధ్య కాలంలో కొత్త కుర్రాళ్లు .. కొత్త ప్రయోగాలతో తెరపైకి వస్తున్నారు. కంటెంట్ బాగుంటే ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉండటం వలన, చిన్న సినిమాల జోరు పెరుగుతూ వెళుతోంది. అలా ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమానే 'కమిటీ కుర్రోళ్లు'. నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సినిమాకి యదు వంశీ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 9వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజు నుంచి 'ఈ టీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
అది ఆంధ్రప్రదేశ్ లోని 'పురుషోత్తపల్లి' అనే గ్రామం. ఆ గ్రామానికి పెద్ద మనిషిగా బుజ్జి (సాయికుమార్) వ్యవహరిస్తూ ఉంటాడు. ప్రతి 12 ఏళ్లకోసారి ఆ ఊళ్లో 'బరింకాలమ్మ' జాతర జరుగుతూ ఉంటుంది. ఆ గ్రామంలో పుట్టిపెరిగిన వాళ్లు ఎక్కడ ఉన్నా, ఆ జాతర సమయానికి ఆ ఊరికి చేరుకోవడం .. ఆ ఉత్సవాల్లో పాల్గొనడం ఒక ఆనవాయితీ. అలా ఆ గ్రామంలో జాతరకి ఏర్పాట్లు మొదలుపెట్టాలని పెద్దలు నిర్ణయిస్తారు.
అలాగే జాతర తరువాత పది రోజుల్లో వచ్చే ఎన్నికలను గురించి కూడా ప్రస్తావిస్తారు. ఆ గ్రామానికి సర్పంచ్ గా సేవలను అందించిన వెంకట్రావు (గోపరాజు రమణ) చనిపోవడం వలన, అతని స్థానంలో అతని కొడుకు శివ పోటీ చేయడమే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. అందుకు బుజ్జి అయిష్టంగానే అంగీకరిస్తాడు. జాతర అయ్యేంతవరకూ మాత్రం ఎక్కడా రాజకీయాల ప్రస్తావన చేయకూడదని నిర్ణయించుకుంటారు.
జాతర దగ్గర పడుతూ ఉండటంతో ఆ గ్రామానికి సంబంధించిన కుర్రాళ్లంతా అక్కడికి చేరుకుంటూ ఉంటారు. అలా సూర్య .. సుబ్బు మిగతా మిత్ర బృందం కూడా తమ సొంత ఊరు చేరుకుంటారు. 12 ఏళ్ల తరువాత వాళ్లు ఆ గ్రామానికి వస్తారు. గతంలో వాళ్లంతా మంచి స్నేహితులు. కానీ ఇప్పుడు ఆ బృందంలో సూర్య .. సుబ్బు మధ్య మాటలు ఉండవు. గతాన్ని మరిచిపోయి మామూలుగా ఉందామని మిగతా వారు చెప్పినా వాళ్లు ఆ గతాన్ని మరిచిపోలేకపోతూ ఉంటారు.
జాతర గురించి .. ప్రతిసారి 'బలిచేట' ఎత్తే సత్తయ్య గురించి ఆ స్నేహతులు ప్రస్తావిస్తారు. గత జాతరలో వాళ్లు చేసిన పని సత్తయ్యను మానసికంగా కుంగదీసిందనీ, దాంతో అతను ఊరొదిలిపోయాడని కొంతమంది చెబుతారు. సత్తయ్య రాకపోతే జాతర పరిస్థితి ఏమిటనేది అర్థం కావడం లేదని అయోమయాన్ని వ్యక్తం చేస్తారు. దాంతో సత్తయ్యను తమ గ్రామానికి తీసుకుని రావాలని వాళ్లు నిర్ణయించుకుంటారు. కలిసి కట్టుగా సత్తయ్య దగ్గరికి బయల్దేరతారు.
గత జాతరలో ఏం జరుగుతుంది? స్నేహితులలో కొందరు ఊరొదిలి ఎందుకు వెళ్లిపోతారు?
సత్తయ్య మనసుకు ఎందుకు కష్టం కలుగుతుంది? అందుకు కమిటీ కుర్రోళ్లు ఎలా కారణమవుతారు? ఇప్పుడు ఆ గ్రామంలో జాతర సవ్యంగా సాగుతుందా? ఎన్నికలలో గెలవాలనే శివ కోరిక నెరవేరుతుందా? అనే మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది.
ఈ కథ అంతా కూడా విలేజ్ నేపథ్యంలో నడుస్తుంది. విలేజ్ లో పరిగెత్తే బాల్యం .. ప్రేమంటూ అమ్మాయిల వెంటపడే టీనేజ్ .. దానిని దాటుకుని రాజకీయాలలో చేసుకునే జోక్యం .. ఇలా అనేక అంశాలను టచ్ చేస్తూ దర్శకుడు ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లాడు. ఒక గ్రామాన్ని ప్రధానమైన పాత్రగా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అంతమంది జూనియర్స్ ను తీసుకోవడం ఒక చిన్న సినిమా స్థాయికి మించిన పని అనిపిస్తుంది.
పల్లెటూళ్లోని బాల్యం .. అమాయకత్వంతో కూడిన ప్రేమకథలు ఉహించుకున్నప్పుడల్లా నోరూరే ఊరగాయలాంటివి. ఈ రెండింటికీ అందమైన పల్లెటూరు లొకేషన్స్ తోడైతే తెరపై ఆ కథ ఒక సెలయేరులా సాగిపోతుంది. అయితే దర్శకుడు ఈ అంశాలను నామ మాత్రంగానే టచ్ చేశాడు. ఎక్కువ సమయాన్ని జాతరకు .. రాజకీయాలకు కేటాయించాడు. అందువలన కథలో సీరియస్ నెస్ ఎక్కువ .. ఫీల్ తక్కువ కనిపిస్తాయి.
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో మంచికీ .. చెడుకి మధ్య మద్యం కనిపిస్తూ ఉంటుంది. సహజత్వం కోసం అనుకున్నారేమో, మధ్య మధ్యలో మద్యం సన్నివేశాలు పలకరిస్తూనే ఉంటాయి. ఇక బుజ్జి అనే ప్రధానమైన పాత్రలో సాయికుమార్ కనిపిస్తాడు. కన్నింగ్ రాజకీయాలు చేస్తూ ఉంటాడు. అయితే ఆయన ఏం ఆశించి అలా చేస్తున్నాడనేది అర్థం కాదు. ఆయన ఉద్దేశం ఏమిటనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.
ఇక కొన్ని సన్నివేశాలు అవసరానికి మించి లాగినట్టుగా అనిపిస్తాయి. జాతర జరుగుతూ ఉండగా స్నేహితులు కొట్టుకోవడం .. సత్తయ్య కొడుకు అంత్యక్రియలకు సంబంధించిన సన్నివేశాలు ఇబ్బందిపెడతాయి. అనుదీప్ దేవ్ నేపథ్య సంగీతం .. పల్లె అందాలను ఆవిష్కరించిన రాజు ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటాయి. ఎడిటర్ గా అన్వర్ అలీ ట్రిమ్ చేసుకోవలసిన సన్నివేశాలు కనిపిస్తాయి.
గ్రామీణ నేపథ్యంలోని కథను ఎంచుకోవడం .. పల్లె అందాలతో కలిపి కథను నడిపించడం .. 1980ల నాటి ఒక వాతావరణం .. 'కమిటీ కుర్రోళ్లు' సినిమాకి ప్రధానమైన బలంగా అనిపిస్తాయి. అయితే లవ్ .. సాంగ్స్ .. ఎమోషన్స్ .. ఫ్రెండ్షిప్ ఇంకాస్త బలంగా ఉంటే బాగుండునని అనిపిస్తుంది. ఎక్కడా ఎలాంటి ట్విస్టులు లేకపోవడం ఓ వెలితి. ఈ అంశాలపై ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే ఈ కంటెంట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లి ఉండేదేమో అనిపిస్తుంది.