RDX (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ

RDX

Movie Name: RDX

Release Date: 2023-10-24
Cast: Shane Nigam, Antony Varghese, Neeraj Madhav, Lal, Babu Antony, Mahima Nambiar
Director:Nahas Hidayath
Producer: Sophia Paul
Music: Sam C.S.
Banner: Weekend Blockbusters
Rating: 3.25 out of 5
  • మలయాళంలో రూపొందిన 'RDX'
  • ఆగస్టు 25న అక్కడి థియేటర్లలో రిలీజ్  
  • 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన సినిమా 
  • క్రితం నెల 24 నుంచి స్ట్రీమింగ్ 
  • రీసెంటుగా అందుబాటులోకి వచ్చిన తెలుగు వెర్షన్ 
  • యాక్షన్ - ఎమోషన్స్ ప్రధానంగా నడిచే కథ
  • టేకింగ్ పరంగా మార్కులు కొట్టేసిన డైరెక్టర్

మలయాళంలో ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలలో 'RDX' ఒకటిగా కనిపిస్తుంది. సోఫియా పాల్ నిర్మించిన ఈ సినిమాకి, నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది ఆగస్టు 25వ తేదీన అక్కడ విడుదలైన ఈ సినిమా, వసూళ్ల విషయంలో కొత్త రికార్డులను నమోదు  చేసింది. కేవలం 8 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, అక్కడ 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అలాంటి ఈ సినిమా, క్రితం నెల 24వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. రీసెంట్ గా తెలుగు వెర్షన్  కూడా అందుబాటులోకి వచ్చింది.

ఈ కథ అంతా కూడా 'కొచ్చి' పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఫిలిప్ (లాల్) కుంజుమోల్ (మాలా పార్వతి) దంపతులు ఆ ఊళ్లో గౌరవ మర్యాదలతో జీవిస్తుంటారు. వాళ్లకి ఇద్దరు కొడుకులు డోని (ఆంటోని వర్గీస్) రాబర్ట్ (షేన్ నిగమ్). డోని భార్య సిమీ (ఐమా) వాళ్లకి ఓ పాప ఉంటుంది. రాబర్ట్ - మినీ (మహిమ నంబియార్) ప్రేమలో ఉంటారు. ఆ ఊళ్లో ఆ ఫ్యామిలీకి పెద్ద దిక్కు ఆంటోని (బాబు ఆంటోని), ఆయన కొడుకు జేవియర్ (నీరజ్ మాధవ్). 

ఫిలిప్ ఆ ఊళ్లో ఒక మిల్లును రన్ చేస్తూ ఉంటాడు. ఇక ఆంటోని అదే ఊళ్లో కరాటే - బాక్సింగ్ శిక్షణకి సంబంధించిన సెంటర్ ను నిర్వహిస్తూ ఉంటాడు. అక్కడే డోని - రాబర్ట్ - జేవియర్ ముగ్గురూ కూడా పూర్తి శిక్షణ పొందుతారు. ఆ ఊళ్లో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో రెండు టీమ్ లకి చెందిన వారి మధ్య మొదలైన చిన్న గొడవ .. పెద్దదవుతుంది. తమ మనిషిని గాయపరిచిన 'అనస్'ను, అతని టీమ్ ను, డోని - రాబర్ట్ - జేవియర్ కొడతారు. అప్పటి నుంచి ఆ ముగ్గురిపై అనస్ పగబడతాడు.

ఒకసారి ఆ ముగ్గురూ ఒక జాతరకు రావడం చూసిన అనస్, ఆ విషయాన్ని జైసన్ కి చెబుతాడు. ఆ ప్రాంతంలో జైసన్ అంటే అందరికీ భయమే. అనస్ కోసం ఆ ముగ్గురితో గొడవపడిన జైసన్ తీవ్రంగా గాయపడతాడు. అందుకు కారణమైన ఆ ముగ్గురిపై, జైసన్ తమ్ముడు పాల్ సన్ (విష్ణు అగస్త్య) ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంటాడు. ఈ పరిస్థితుల్లో రాబర్ట్ ఆ ఊళ్లో ఉంటే ప్రమాదమని భావించి, ఫిలిప్ కుటుంబ సభ్యులు అతన్ని బెంగుళూర్ పంపిస్తారు. మినీ ప్రేమకు కూడా అతను దూరంగా వెళ్లిపోతాడు.

అయినా పాల్ సన్ ఆ ఫ్యామిలీ పై పగతీర్చుకోవడం కోసం పక్కాగా ఒక స్కెచ్ వేస్తాడు. తన అనుచరులను పెద్ద సంఖ్యలో రంగంలోకి దింపుతాడు. ఓ అర్ధరాత్రివేళ వాళ్లంతా 'డోని' ఇంటిని చుట్టుముడతారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత ఏమౌతుంది? మినీ జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేవి ఈ కథలో ఆసక్తికరమైన అంశాలుగా కనిపిస్తాయి.

సాధారణంగా మలయాళ సినిమాలు సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి. వాళ్ల సినిమాలలో యాక్షన్ ఉన్నప్పటికీ .. ఎమోషన్స్ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. అందుకు భిన్నంగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో కనిపిస్తాయి. అయితే ఫ్యామిలీ ఎమోషన్స్ ను కూడా ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేస్తూ వెళ్లడం కథకి కలిసొచ్చిన అంశంగా మారింది. ఒక చిన్న గొడవ ఎలా పెద్దది అవుతుంది? అది ఎక్కడి వరకూ వెళుతుంది? అనేది దర్శకుడు చిత్రీకరించిన తీరు బాగుంది. 

ఈ కథలో ఫిలిప్ - ఆంటోని మధ్య స్నేహం, వాళ్ల పిల్లలైన డోని - రాబర్టు, జేవియర్ మధ్య స్నేహాన్ని దర్శకుడు గొప్పగా ఆవిష్కరించాడు. డోని - రాబర్టు మధ్య అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. అలాగే కష్టం వచ్చినప్పుడు .. అయినవాళ్లు ఆపదలో ఉన్నప్పుడు ఎలా అండగా నిలబడాలనే ఒక సందేశం కూడా ఈ కథలో కనిపిస్తుంది. ఇక రాబర్ట్ - మినీ మధ్య హద్దులు దాటని ప్రేమ కూడా అందంగానే కనిపిస్తుంది.

జైసన్ - రాబర్ట్ మధ్య గొడవ మొదలై అది కొట్లాకి దారితీయడం, డోని - రాబర్ట్ ఒక రౌడీని వెంటాడుతూ విలన్ ఉచ్చులో చిక్కుకోవడం ఉత్కంఠును రేకెత్తిస్తుంది. హీరో ఫ్యామిలీని లేయడం కోసం విలన్ గ్యాంగ్ హాస్పిటల్ పై దాడి చేయడం టెన్షన్ పెంచేస్తుంది. హీరో ఫ్యామిలీని విలన్ గ్యాంగ్ ఛేజ్ చేయడం ఈ సినిమాలో హైలైట్ సీన్స్ గా చెప్పుకోవాలి. స్టార్ డమ్ ను పక్కన పెడితే, ఈ కథకి ముగ్గురు హీరోలనే చెప్పుకోవాలి. వాళ్లే Robert - Dony - Xavier .. ఈ ముగ్గురి పేర్లలోని మొదటి అక్షరాలతో సెట్ చేసిందే 'RDX' టైటిల్. 

ఈ కథలో పాత్రల సంఖ్య కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. అయినా ప్రతి పాత్రను రిజిస్టర్ చేయగలిగారు. అలాగే కథకి తగిన లొకేషన్స్ .. ఆ లొకేషన్స్ ను అందంగా ఆవిష్కరించిన అలెక్స్ కెమెరా పనితనం .. సందర్భానికి తగిన సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. అన్బు అరివు కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయని చెప్పొచ్చు. 'బలమైన శత్రువును ఎదుర్కోవాలంటే నిజమైన స్నేహితుడు కావాలి' అనే సత్యాన్ని చాటిచెప్పే ఈ సినిమా, ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంట్రెస్టింగ్ సినిమాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. 

Trailer

More Reviews