'దహాద్' - ఓటీటీ రివ్యూ

Dahaad

Movie Name: Dahaad

Release Date: 2023-05-12
Cast: Sonakshi Sinha, Vijay Varma, Gulshan Devaiah, Sohum Shah, Zoa Morani
Director:Reema - Ruchika
Producer: Ritesh Sidhwani
Music: Gaurav Raina
Banner: Excel Entertainment
Rating: 3.25 out of 5
  • సోనాక్షి సిన్హా ప్రధానమైన పాత్రగా 'దహాద్'
  • అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చిన వెబ్ సిరీస్ 
  • బలమైన కథ .. ఆసక్తికరమైన కథనం
  • ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. సోనాక్షి నటన హైలైట్  
  • అక్కడక్కడా సడలిన పట్టు 

సాధారణంగా ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్ లలో సస్పెన్స్ థ్రిల్లర్లు .. హారర్ థ్రిల్లర్లు .. క్రైమ్ థ్రిల్లర్లు ఎక్కువగా ఉంటాయి. ఓటీటీల్లో ఈ తరహా కథలకు మంచి ఆదరణ ఉంది. కంటెంట్ పెర్ఫెక్ట్ గా ఉండాలేగానీ, ఈ తరహా వెబ్ సిరీస్ లకు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. అలా అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 12వ తేదీ నుంచి 'దహాద్' (హిందీ వెబ్ సిరీస్) స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు ఇతర భాషల్లోను 8 ఎపిసోడ్స్ గా అందుబాటులోకి వచ్చింది. సోనాక్షి సిన్హా ప్రధానమైన పాత్రను పోషించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఎంతవరకూ మెప్పించిందనేది చూద్దాం. 

 అంజలి (సోనాక్షి సిన్హా) 'రాజస్థాన్' ప్రాంతంలోని 'మాండవ' పోలీస్ స్టేషన్ లో పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తుంటుంది. తండ్రి కేన్సర్ తో పోవడంతో ఆమెకి సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేయాలని తల్లి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అంజలితో పాటు ఆమె సీనియర్ ఆఫీసర్స్ దేవీలాల్ ( గుల్షన్ దేవయ్య) పర్గి ( సోహమ్ షా) అదే పోలీస్ స్టేషన్ లో బాధ్యతలను నిర్వహిస్తుంటారు. అంజలితో దేవీలాల్ కి సంబంధం ఉందని అతని భార్య అనుమానిస్తూ ఉంటుంది. ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్లలను కనకపోవడమే మంచిదని భావించిన పర్గి, అబార్షన్ చేయించుకోమని భార్యను ఒత్తిడి చేస్తుంటాడు. 

ఇక అదే ఊళ్లో శివ (మన్యు దోషి) ఆనంద్ (విజయ్ వర్మ) తమ కుటుంబాలతో జీవిస్తుంటారు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన బంగారం బిజినెస్ ను శివ చూసుకుంటూ ఉంటాడు. ఇక ఆనంద్ ఒక జూనియర్ కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తూ ఉంటాడు. వీకెండ్స్ తన వ్యాన్ లో ఇతర ప్రాంతాలకి వెళ్లి, అక్కడి పేద పిల్లలకు ఉచితంగా విద్యను బోధిస్తూ, వారికి పుస్తకాలు పంచుతుంటాడు. అతని భార్య 'వందన' ఒక స్టార్ హోటల్లో మేనేజర్ గా పనిచేస్తూ ఉంటుంది.

కృష్ణ చందాల్ అనే యువతి ఒక యువకుడితో ఇంట్లో నుంచి వెళ్లిపోయిందంటూ ఆమె అన్నయ్య మురళి 'మాండవ' పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాడు. ఆ కేసు విచారణ మొదలుపెట్టిన అంజలి - దేవీలాల్ కి, మరికొంతమంది యువతులు కూడా ఇల్లొదిలి వెళ్లిపోయారని తెలుస్తుంది. కనిపించకుండా పోయిన యువతులంతా ప్రేమలో పడినవారే, తమని వెతకవద్దని లెటర్ రాసిపెట్టి వెళ్లినవారే. పైగా వాళ్లంతా పేద కుటుంబాలకి చెందిన వారు కావడం అంజలిని ఆలోచనలో పడేస్తుంది. 

ఇక అలా ఇల్లొదిలి వెళ్లిన యువతుల మృతదేహాలు ఆయా ప్రాంతాల్లో ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంటాయి. యువతులందరూ పెళ్లి కూతురుగా ముస్తాబై ఆత్మహత్యకి పాల్పడటం .. అంతకుముందు వారు సెక్స్ లో పాల్గొనడం ..  వాష్ రూమ్ లో గొళ్లెం పెట్టుకుని సైనేడ్ మింగడం .. వాళ్లంతా కూడా శని - ఆదివారాల్లోనే చనిపోవడం అంజలికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పోలీసులు తేరుకునే లోగానే 28మంది యువతులు చనిపోతారు. 

ఈ యువతులంతా ప్రేమించినది ఒక్కడినే .. వారి ఆత్మహత్యలకు కారకుడు ఒక్కడే అనే నిర్ధారణకి అంజలి వస్తుంది. ఆ ఒక్కడు ఎవరు? ఎలా యువతులను ట్రాప్ చేస్తున్నాడు? అనే ఆలోచనలే ఆమెను సతమతం చేస్తుంటాయి. 28 మంది యువతుల మరణానికి కారకుడైన ఆ వ్యక్తిని పట్టు కోవడానికి అంజలి ఏం చేస్తుంది? ఆ ప్రయత్నంలో ఆమెకి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనేదే కథ.

ఈ వెబ్ సిరీస్ కి రీమా - రుచిక దర్శకత్వం వహించారు. ఇది చాలా విస్తృతమైన పరిధి ఉన్న కథ. పాత్రల సంఖ్య ఎక్కువ .. కథను బట్టి మారే లొకేషన్స్ ఎక్కువ. అయినా ఆ పాత్రలను రిజిస్టర్ చేయడంలోను .. రియల్ లొకేషన్స్ లో కథను పరుగులు తీయించడంలోను దర్శకులు సక్సెస్ అయ్యారు. ఒకవైపున వరుసగా జరుగుతున్న యువతుల ఆత్మహత్యలు .. మరో వైపున పైఅధికారుల నుంచి పోలీసులకు ఉండే ఒత్తిడి .. ఫ్యామిలీ వైపునుంచి వారికి ఉండే టెన్షన్స్ ను చూపించిన తీరు బాగుంది. 

ప్రధానంగా ఇటు అంజలి పాత్రను .. అటు హంతకుడి పాత్రను డిజైన్ చేసిన తీరు, ఈ వెబ్ సిరీస్ కి హైలైట్ గా నిలుస్తుంది. చివరివరకూ తాను పట్టుబడకుండా హంతకుడు తప్పించుకునే విధానం ఆసక్తిని రేకెత్తిస్తుంది. సాధారణంగా పోలీస్ కథల్లో హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కథలో అలాంటి హడావిడి కనిపించదు. కథ నిదానంగానే నడుస్తుంది .. అయినా బోర్ కొట్టని విధంగా స్క్రీన్ ప్లే ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ లో ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ నడిపించే కథనం ఈ వెబ్ సిరీస్ కి ప్రధానమైన బలంగా నిలిచింది. 

యువతులు చనిపోతున్న తీరు పట్ల పోలీసులు తలలు పట్టుకుంటూ ఉంటారు. కానీ వాళ్లు ఎలా చనిపోతున్నారనేది సాధారణ ప్రేక్షకులు సైతం ముందుగానే గ్రహిస్తారు. హంతకుడు ఎవరనేది ఆడియన్స్ కి తెలిసిన తరువాత, అనుమానితుడిగా మరో క్యారెక్టర్ ను తీసుకొచ్చి పోలీసులు టార్చర్ పెట్టడం సిల్లీగా అనిపిస్తుంది. యువతుల హత్యలకి సంబంధించిన 'క్లూ' తట్టడం కోసం అంజలి పాత్ర వ్యక్తిత్వాన్ని తగ్గించడం కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది.

ఈ వెబ్ సిరీస్ కి సంబంధించినంత వరకూ కథాకథనాల తరువాత, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఎక్కువ మార్కులు పడతాయి. ప్రేక్షకులను ఇంట్రెస్టింగ్ మూడ్ తో సన్నివేశాలలో ఒక భాగం చేస్తూ వెళ్లాడు. తనయ్ కెమెరా పనితనం గొప్పగా ఉంది. రాజస్థాన్ ప్రాంతంలోని లొకేషన్స్ ను ఆయన చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది. ఆనంద్ ఎడిటింగ్ కి కూడా వంకబెట్టవలసిన పనిలేదు.  ఒక్కో ఎపిసోడ్ కి 50 నిమిషాలకి పైగా నిడివితో సన్నివేశాలను డీటేల్డ్ గా చెప్పడానికి ప్రయత్నించారు. 

ప్లస్ పాయింట్స్: కథ .. కథనం .. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ... ప్రధానమైన పాత్రలను మలచిన విధానం .. లొకేషన్స్. 

మైనస్ పాయింట్స్: బాయ్ ఫ్రెండ్ తో కూడిన అంజలి లవ్ ట్రాక్ .. ఆమె క్యారెక్టరైజేషన్ ను దెబ్బతీసే సీన్స్. హత్యలకు సంబంధించిన 'క్లూ' తట్టడం కోసం ఆమె పాత్రను దిగజార్చకుండా ఉంటే బాగుండేది. శివ పాత్రపై అనుమానం .. అతణ్ణి టార్చర్ చేసే ఎపిసోడ్ ఈ వెబ్ సిరీస్ లో ప్రధానమైన పొరపాటుగా కనిపిస్తుంది. ఎందుకంటే హంతకుడు ఎవరనేది అప్పటికే ఆడియన్స్ కి తెలుసు. 


* అక్కడక్కడా కనిపించే ఈ లోపాలను సర్దుకుపోతే, ఈ మధ్య కాలంలో వచ్చిన భారీ వెబ్ సిరీస్ లలో ఒకటిగా .. ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లలో ఒకటిగా ఇది నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు.  
 

Trailer

More Reviews