మూవీ రివ్యూ: 'బలగం'

Movie Name: Balagam
- తెలంగాణ నేపథ్యంలో నడిచే 'బలగం'
- ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా సాగే కథాకథనాలు
- సహజత్వాన్ని ఆవిష్కరించే సన్నివేశాలు
- అదనపు బలంగా నిలిచిన సంగీతం
- ఈ జనరేషన్ కి అవసరమైన సందేశం
తెలుగు తెరపైకి తెలంగాణ నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అయితే ఆ సినిమాల కథలు వేరు .. వాటి ఇతివృత్తాలు వేరు. గతంలో వచ్చిన సినిమాల్లో ఉద్యమ భావాలు .. పోరాటాలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకు భిన్నంగా .. తెలంగాణ పల్లె ప్రజల స్వభావాలను .. వారి మధ్య బంధాలను .. అనుబంధాలను .. సంస్కృతిని ఆవిష్కరించిన సినిమానే 'బలగం'. ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ఏ స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందనేది చూద్దాం.
తెలంగాణ ప్రాంతంలోని 'సిరిసిల్ల' గ్రామంలో కొమరయ్య (సుధాకర్ రెడ్డి) అనే రైతు తనకి ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగుచేస్తూ, జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఆయనకి ఐలయ్య (జయరామ్) మొగిలయ్య అనే ఇద్దరు కొడుకులు ఉంటారు. ఐలయ్య అదే ఊళ్లో వ్యవసాయం చేస్తుంటే .. మొగిలయ్య మాత్రం సూరత్ లో ఉద్యోగం చేస్తుంటాడు. ఐలయ్య దంపతుల సంతానమే సాయిలు (ప్రియదర్శి). ఇక కొమరయ్య కూతురు లక్ష్మి (విజయలక్ష్మి)కి మాత్రం పుట్టింటివారితో కొన్నేళ్లుగా మాటలు ఉండవు. ఆమె కూతురే సంధ్య (కావ్య).
సాయిలు సొంత వ్యాపారం కోసం 15 లక్షల వరకూ అప్పుచేస్తాడు. అప్పు తీర్చమని ఇచ్చినవారు ఒత్తిడి చేస్తుంటారు. కట్నం డబ్బుతో అప్పు తీర్చేయవచ్చనే ఉద్దేశంతో ఒక యువతిని వివాహం చేసుకోవడానికి సాయిలు సిద్ధపడతాడు. మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం ఉందనగా సాయిలు తాత కొమరయ్య చనిపోతాడు. ఊళ్లో ఆందరితోను ఎంతో కలుపుగోలుగా ఉండే కొమరయ్య మరణంతో, సాయిలు నిశ్చితార్థం రద్దవుతుంది.
అదే సమయంలో సాయిలు మేనత్త మేనమామలు .. వాళ్ల కూతురు సంధ్య కూడా కొమరయ్య చివరి చూపుల కోసం వస్తారు. అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? పుట్టింటికి లక్ష్మి దూరం కావడానికి కారణం ఏమిటి? తన అప్పు తీర్చడానికి సాయిలు ఏం చేస్తాడు? అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనేదే కథ.
కమెడియన్ గా అనేక చిత్రాలలో నటించిన వేణు, ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. కమెడియన్ గా నవ్విస్తూ వచ్చిన వేణు, ఒక సినిమా దర్శకత్వ బాధ్యతను మీద వేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దర్శకుడిగా ఈ సినిమాకి ఆయన ఎంతవరకూ న్యాయ చేయగలిగి ఉంటాడనే విషయంలో అనుమానం కూడా కలుగుతుంది. అయితే ఆ అనుమానాలన్నీ ఈ సినిమా చూస్తే చెదిరిపోవడం ఖాయం. అంత సహజంగా ఆయన ఈ సినిమాను తెరకెక్కించాడు.
కథగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు .. అందరికీ తెలిసిన సంఘటనల సమాహారమే ఇది. ఇక కథనం కూడా 'ఔరా' అని ఆశ్చర్యపోవలసిన అవసరం లేని కథ ఇది. అయినా ఎక్కడ బోర్ కొట్టదు. ఏ పాత్ర ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలో .. ఏ పాత్ర ఎక్కడ తెర వెనక్కి వెళ్లాలో అనేది పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. ముఖ్యమైన పాత్రలను .. వాటి స్వభావాలను డిజైన్ చేసిన తీరు గొప్పగా అనిపిస్తుంది. పల్లె మనుషుల తీరును ఆవిష్కరించే విషయంలో వేణు ఒక్క ఫ్రేమ్ ను కూడా వదల్లేదని చెప్పాలి.
ఈ సినిమాలో ఫలానా వారు మాత్రమే బాగా చేశారని చెప్పలేం. హీరోగా ప్రియదర్శి .. ఆయన తండ్రి .. తాత .. చిన్న తాత .. మేనమామ .. అమ్మమ్మ పాత్రలను పోషించినవారు నటిస్తున్నట్టుగా ఉండదు .. మన ఊళ్లో .. మన వీధిలో ఈ కథ అంతా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక చావుతో కథను మొదలుపెట్టి .. ఆ మరణం చుట్టూ కథను అల్లుకుంటూ వచ్చి, తెగిపోయినా .. తెగిపోతున్న బంధాలను ఆ మరణం సాక్షిగా నిలబెట్టడానికి చేసిన ప్రయత్నంలో దర్శకుడిగా వేణు సక్సెస్ అయ్యాడు. కుటుంబం అంతా కలిసి ఉన్నప్పుడే పెద్దలకు మనశ్శాంతి ఉంటుంది .. పరలోకంలో వారికి ఆత్మశాంతి చేకూరుతుందనే సందేశం కూడా నీట్ గా కనెక్ట్ అవుతుంది.
ఈ సినిమాకి భీమ్స్ పాటలు .. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు బలంగా నిలిచాయని చెప్పచ్చు. 'ఊరు పల్లెటూరు' .. 'బలరామయ్య నరసయో' .. 'పొట్టిపిల్ల' పాటలు బాగున్నాయి. కాసర్ల శ్యామ్ సాహిత్యం ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. ఆచార్య వేణు ఫొటోగ్రఫీ బాగుంది ... పల్లె అందాలను అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఆహ్లాదాన్ని కలిగించాడు. మధు ఎడిటింగ్ కూడా నీట్ గా అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ : కథ .. కథనం .. పాత్రలను తీర్చిదిద్దిన తీరు .. సన్నివేశాలను సహజంగా ఆవిష్కరించిన విధానం, పల్లె మనుషులను .. మనసులను ఆక్కడి సంస్కృతితో కలిపి అందిస్తూ సందేశాన్ని ఇవ్వడం.
మైనస్ పాయింట్స్: 'బలగం' కథలో బలం ఉంది .. అయితే ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించే బలమైన తారాగణం లేకపోవడం ఒక లోపంగా కనిపిస్తుంది. మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యేవరకూ థియేటర్లలో నిలబడగలగడం ఒక పరీక్షనే అనిపిస్తుంది.
తెలంగాణ గ్రామీణ వాతావారణం తెలిసినవారు మాత్రం ఈ కథలకి వెంటనే కనెక్ట్ అవుతారు. లేదంటే యాసలోని కొన్ని డైలాగ్స్ అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు. కథ .. కథనం .. మాటలు .. పాటలు .. సాహిత్యం ... సంస్కృతి .. జానపద కళారూపాలు .. ఇలా తెలంగాణ సామాజిక జీవన విధానాన్ని సహజంగా ఆవిష్కరించిన కథ ఈ మధ్య కాలంలో ఇదేనని చెప్పచ్చు.