మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకి ఓటీటీలలో ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. అందుకు కారణం వాళ్లు కథాకథనాలను నడిపించే తీరనే చెప్పాలి. అలా రూపొందిన ఒక సినిమానే 'ఏలా వీజా పూంచిర'. సౌబిన్ షాహిర్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి 'షాహీ కబీర్' దర్శకత్వం వహించాడు. 2022 జులై 15వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఆ తరువాత 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ కి వచ్చింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి వచ్చింది.
'కొట్టాయం' పరిధిలోని పర్వత ప్రాంతం అది. అందులోని ఒక పర్వతంపై వైర్లెస్ ఏఆర్ క్యాంప్ ను ఏర్పాటు చేస్తారు. ఆ క్యాంప్ లో ఏఆర్ పోలీస్ గా 'మధు' ( సౌబిన్ షాహిర్) పనిచేస్తుంటాడు. అది ఎంత అందమైన ప్రదేశమో .. అంతే భయంకరమైన ప్రదేశం. అక్కడ వాతావరణం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. తరచూ పిడుగులు పడుతూ ఉంటాయి. అందువలన వైర్లెస్ సెట్ లు దెబ్బతింటూ ఉంటాయి. అందువలన అక్కడ డ్యూటీ చేసే పోలీసులు ఇబ్బందులు పడుతుంటారు.
'మధు' తన ఊరు నుంచి డ్యూటీకి క్యాంప్ కి చేరుకుంటాడు. అప్పటివరకూ డ్యూటీలో ఉన్న 'ప్రభు' ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్లిపోతాడు. అతని ప్లేస్ లో 'సుధీ' క్యాంప్ కి వస్తాడు. మధు అతనికి ప్రతిరోజూ బిర్యానీ చేసి పెడుతూ ఉంటాడు. సుధీ తాను తీసుకొచ్చిన మద్యాన్ని అతనికి షేర్ చేస్తూ ఉంటాడు. సుధీకి పెళ్లి ఖాయమవుతుంది. కాబోయే భార్యతో ఫోన్ లో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు.
ఈ నేపథ్యంలోనే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో మానవ శరీర భాగాలు ఒక్కొక్కటిగా దొరుకుతూ ఉంటాయి. కాళ్లు.. పాదాలు .. ఒక చేయి .. ముఖం గుర్తుపట్టలేని స్థితిలో తల .. ఇలా లభిస్తూ ఉంటాయి. హత్య చేయబడింది ఒక మహిళ అనే విషయం వాళ్లకి అర్థమవుతుంది. అయితే ఆమె ఎవరు? ఆమెను ఎవరు హత్య చేసి ఉంటారు? అనేది హాట్ టాపిక్ గా మారుతుంది. ఆధారాల కోసం పోలీసులు అన్వేషిస్తూ ఉంటారు. వైర్లెస్ ద్వారా ఈ సమాచారం మధు - సుధీలకు చేరుతుంది.
ఒక రోజున 'సుధీ' తమ క్యాంప్ కు దగ్గరలో నేలలో నుంచి పైకి పొడుచుకొచ్చిన చేయి కనిపిస్తుంది. నరకబడిన ఆ చేయి చూడగానే అతను భయంతో వణికిపోతాడు. 'మధు' ఎవరినో హత్య చేశాడనే విషయం అతనికి అర్థమైపోతుంది. అతను ఆ చేయిని చూడటం మధు గమనిస్తాడు. అప్పుడు సుధీ ఏం చేస్తాడు? వాళ్లిద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకుంటాయి? హత్య చేయబడింది ఎవరు? అందుకు కారకులు ఎవరు? అనేది కథ.
పర్వత ప్రాంతం .. ఏఆర్ పోలీస్ క్యాంప్ .. ఇద్దరు పోలీసులు .. ఆ ప్రాంతానికి కాస్త దూరంగా జరిగిన ఒక హత్య చుట్టూ అల్లుకున్న కథ ఇది. రెండే రెండు ప్రధానమైన పాత్రల చుట్టూ ఈ కథ నడుస్తుంది. మిగతా పాత్రలు లేవని కాదు .. ఇలా వచ్చి అలా వెళ్లిపోతూ ఉంటాయి. తరచూ వైర్లెస్ సెట్ లకు వచ్చే సమాచారమే తప్ప, డైలాగ్స్ కూడా తక్కువే. అయినా ఎక్కడా ఏ మాత్రం బోర్ కొట్టనీయకుండా దర్శకుడు ఈ కథను ఆసక్తికరంగా ఆవిష్కరిస్తూ వెళ్లాడు.
పర్వత ప్రాంతం సమీపంలో ఒక మహిళ దారుణంగా హత్య చేయబడిందనే విషయం బయటికి వచ్చేవరకూ గల సన్నివేశాలు ఫస్టాఫ్ గా చెప్పుకోవచ్చు. ఆ మహిళ శరీర భాగాలు బయటపడిన దగ్గర నుంచి నడిచే కథను సెకండాఫ్ గా భావించవచ్చు. సెకండాఫ్ లో సమస్య ముదురుతూ .. కథ చిక్కబడుతూ వెళుతుంది. హత్య ఎవరు చేసి ఉంటారనే విషయంలో అనుమానాలు బలపడుతూ ఉంటాయి. అయితే ఎందుకు చేసి ఉంటారనేది తెలుసుకోవడానికి ఆడియన్స్ కుతూహలాన్ని కనబరుస్తూ ఉంటారు.
దర్శకుడు కథాకథనాలను పకడ్బందీగా తయారు చేసుకున్నాడు. పాత్రలను మలిచే విధానంలో తన ప్రతిభను చూపించాడు. చాలా సహజంగా సన్నివేశాలను తెరపైకి తీసుకుని వచ్చాడు. అయితే వీటన్నింటితో పాటు మరొక అంశానికి సంబంధించి కూడా అతణ్ణి ప్రశంసించవచ్చు .. అవే లొకేషన్స్. ఒక రకంగా ఈ సినిమాకి ప్రధానమైన బలం లొకేషన్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కథను కదలకుండా ఫాలో కావడానికి కారణం లొకేషన్స్ అనే చెప్పాలి.
ఈ కథ ముగింపు దిశగా వెళుతూ ఉండగా, ఇలాంటి కథలు గతంలో చాలానే వచ్చాయి గదా .. కాకపోతే నేపథ్యం కొత్తగా ఉందని లైట్ తీసుకోవడానికి ప్రయత్నించడం జరుగుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే దర్శకుడు ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఆ ట్విస్ట్ అప్పటివరకూ నడిచిన కథకు మరింత బలాన్ని చేకూర్చుతుంది. ఆశ్చర్యంలో నుంచి బయటపడుతున్న మనతో, మరిన్ని మార్కులు ఇప్పిస్తుంది.
సౌబిన్ షాహిర్ నటన ఈ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. మణేష్ మాధవన్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. కథలో ప్రధానమైన పాత్ర లొకేషన్స్ దే అనిపించేలా ఆయన చేయగలిగారు. అనిల్ జాన్సన్ నేపథ్య సంగీతం కూడా సందర్భానికి తగినట్టుగా సాగుతూ ఆకట్టుకుంటుంది. కిరణ్ దాస్ ఎడిటింగ్ కూడా పెర్ఫెక్ట్ అనిపిస్తుంది.
మలయాళంలో తక్కువ బడ్జెట్ లో .. తక్కువ పాత్రలతో వచ్చిన కొన్ని సినిమాలు ఆడియన్స్ నుంచి విశేషమైన ఆదరణను పొందాయి. అలాంటి సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా కనిపిస్తుందని చెప్పచ్చు. మోసం చేశామనే పశ్చాత్తాపంతో తమని తాము శిక్షించుకునేవారు కొందరైతే, ఆ పశ్చాత్తాపం లేనివారిని శిక్షించడంలో తప్పు లేదని భావించేవారు మరికొందరు. ఈ లైన్ పై నడిచే ఈ సినిమా చాలామందికి నచ్చే ఛాన్స్ ఉంది.
'ఏలా వీజా పూంచిర'(ఆహా) మూవీ రివ్యూ!
Ela Veezha Poonchira Review
Movie Details
Movie Name: Ela Veezha Poonchira
Genre: Crime, Thriller
Release Date: 2026-09-18
Cast: Soubin Shahir, Sudhi Koppa, Jude Anthany Joseph
Director: Shahi Kabir
PRO: -
Music: Anil Johnson
Banner: Kadhaas Untold
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.