జీవీ ప్రకాశ్ కుమార్ తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఆయన సినిమాలకి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రంగా రూపొందినదే 'హ్యాపీరాజ్'. మరియా రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా, మార్చి 27వ తేదీన థియేటర్లకు వచ్చింది. తెలుగు ఆడియన్స్ ను కూడా పలకరించిన ఈ సినిమా, ఈ రోజు నుంచి ' అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
హ్యాపీరాజ్ (జీవీ ప్రకాశ్ కుమార్) ఓ మారుమూల గ్రామానికి చెందిన యువకుడు. అతని తండ్రి (జార్జ్ మరియన్) ఓ బడిపంతులు. అతని రూపం కారణంగా అందరూ 'గుర్రం గుడ్డు' అంటూ ఆటపట్టిస్తుంటారు. ఆ మాటలను పట్టించుకోకండా అతను తన పని తాను చేసుకు వెళుతుంటాడు. తనని ఏ అమ్మాయి ప్రేమించకపోవడానికి .. పెళ్లి చేసుకుంటానని ముందుకు రాకపోవడానికి తన తండ్రియే కారణమని హ్యాపీరాజ్ భావిస్తాడు. ఈ సమస్య నుంచి తాను గట్టెక్కాలంటే, తన తండ్రి ఎవరనేది తెలియని చోటుకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు.
అలా బెంగుళూర్ వెళ్లిన హ్యాపీరాజ్, అక్కడ ఒక సంస్థలో జాబ్ సంపాదిస్తాడు. తన టాలెంట్ తో ఎదుగుతూ, 'కావ్య' (గౌరీప్రియ)ను ముగ్గులోకి దింపుతాడు. కావ్య తండ్రి రాజీవ్ (అబ్బాస్) శ్రీమంతుడు. హ్యాపీరాజ్ టాలెంట్ గురించి తెలుసుకున్న రాజీవ్, తన కూతురును అతనికిచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు. అతని పేరెంట్స్ ను పిలిపించమనీ .. పెళ్లి గురించి మాట్లాడదామని అంటాడు. దాంతో హ్యాపీరాజ్ అయోమయంలో పడతాడు.
తన పేరెంట్స్ పల్లెటూరుకు చెందినవాళ్లు. సిటీ కల్చర్ గురించి పెద్దగా తెలియని వాళ్లు. ముఖ్యంగా తన తండ్రి రూపాన్ని చూసి రాజీవ్ వాళ్లు ఏమనుకుంటారోనని ఆందోళన చెందుతాడు. తన తండ్రి కారణంగా ఈ పెళ్లి సంబంధం కూడా చెడిపోవడం ఖాయమని భావిస్తాడు. రాజీవ్ .. కావ్య మాట కాదనలేక ఊరు నుంచి వాళ్లను రప్పిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ సంఘటనతో కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది? పెళ్లి విషయంలో హ్యాపీరాజ్ - కావ్యలకు ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివి? అనేది కథ.
కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులు ఎవరనేది చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. వీధుల్లో వాళ్లతో కలిసి నడవడానికి ఇబ్బందిపడుతూ ఉంటారు. తమ స్నేహితులకు వాళ్లను పరిచయం చేయడానికి నామోషీగా ఫీలవుతారు. వాళ్లకి దూరంగా ఎగరాలని ఆశపడతారు. అలాంటి ఆలోచనలతో పెరిగిన ఒక కొడుకు కథ ఇది.
ఇక చాలామంది జీవితంలో కష్టపడే పైకొస్తారు. కానీ జీవితంలో సక్సెస్ అయిన తరువాత తమ మూలలను మరిచిపోతారు. మోడ్రన్ కల్చర్ మోజులో బ్రతుకుతూ, దానికి దూరంగా బ్రతుకుతున్న వారిని చిన్నచూపు చూస్తుంటారు. డబ్బు ద్వారానే గౌరవం దక్కుతుందని భావిస్తారు .. డబ్బున్న వారితోనే స్నేహాన్ని కోరుకుంటూ ఉంటారు. ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకూ స్టేటస్ గురించి మాత్రమే ఆలోచించే ఒక తండ్రి కథ ఇది.
విభిన్నమైన స్వభావాలు కలిగిన మనుషుల చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకుంటూ వెళ్లాడు. పల్లెటూరు మనుషుల జీవన విధానాన్ని .. పట్నం మనుషుల లైఫ్ స్టైల్ ను అద్దంలో చూపించే ప్రయత్నం చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలు పల్లెల్లోనే మనుగడ కొనసాగిస్తున్నాయి. పట్నాల్లో అవి అవమానానికి గురవుతున్నాయనే విషయాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది.
హీరో ఫ్యామిలీ అంతా పట్నానికి తరలిరావడం .. హీరోయిన్ ఫ్యామిలీ అంతా పల్లెటూరికి వెళ్లడం వంటి సందర్భాలు, అక్కడ నడిచిన సన్నివేశాలు మనసుకు హత్తుకుపోతాయి. ఈ క్రమంలో వచ్చే హీరో తండ్రి ఫ్లాష్ బ్యాక్, మరింత లోతుగా నాటుకుంటుంది. సమస్యను అర్థం చేసుకోవడమే పెద్దరికం .. దానిని పరిష్కరించడం కోసం తన ఇగోను సైతం పక్కన పెట్టడమే పెద్దరికం అంటూ సాగే సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను బలంగా పట్టుకుంటాయి.
డబ్బు .. చదువు .. అందమైన రూపం చూసి గౌరవించడం కరెక్టు కాదు. ఆదుకునే మనసు .. సాయం చేసే గుణం .. మానవత్వాన్ని కలిగి ఉండటమే నిజమైన మనిషి లక్షణమనే సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. పిల్లలు ఎదుగుతూ ఉంటే, తమ పిల్లలని చెప్పుకుని పేరెంట్స్ మురిసిపోతుంటారు. ఎంత ఎదిగినా తన తల్లిదండ్రులు ఎవరనేది గర్వంగా చెప్పుకోవడమే పిల్లల నిజమైన వ్యక్తిత్వానికి నిదర్శనమంటూ ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది.
జీవీ ప్రకాశ్ కుమార్ .. గౌరీప్రియ నటన బాగుంది. చాలాకాలం తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన అబ్బాస్ కీ , మంచి రోల్ పడిందనే చెప్పాలి. జార్జ్ మరియన్ పాత్ర ఈ సినిమా మొత్తానికి కీలకమని చెప్పాలి. ఆయన చేసిన చెప్పుకోదగిన పాత్రలలో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. ఆయన నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. మదన్ క్రిస్టోఫర్ ఫొటోగ్రఫీ .. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం .. సెల్వ ఎడిటింగ్ ఫరవాలేదు.
లవ్ .. సున్నితమైన భావోద్వేగాలు .. కామెడీ .. తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషన్స్ .. విలేజ్ - సిటీ నేపథ్యాలలో నడిచే బలమైన సన్నివేశాలు .. మనసును తడిచేసే క్లైమాక్స్ .. యూత్ కి అవసరమైన సందేశం కారణంగా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేస్తుంది. ఫ్యామిలీతో కలిసి చూడదగిన కంటెంట్ అనే చెప్పాలి.
'హ్యాపీరాజ్' ( అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Happy Raj Review
Movie Details
Movie Name: Happy Raj
Release Date: 2026-04-25
Cast: G V Prakash Kumar,Abbas,George Maryan,Geetha Kailasam,Madurai Muthuas,
Director: Maria Raja Elanchezian
Music: Justin Prabhakaran
Banner: Beyond Pictures
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer