చారిత్రక నేపథ్యంతో కూడిన కథాంశాలు అప్పుడప్పుడు ఓటీటీ ట్రాక్ పైకి వస్తూనే ఉన్నాయి. అలా బంగ్లాదేశ్ విభజన .. విముక్తి పోరాటం నేపథ్యంలో రూపొందిన బెంగాలీ సిరీస్ 'జాజ్ సిటీ'. ఈ నెల 19వ తేదీ నుంచి ఈ బెంగాలీ సిరీస్ 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. 'గులాబ్ గ్యాంగ్' ఫేమ్ సౌమిక్ సేన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, 10 ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

 జిమ్మీరాయ్ (అరిఫిన్ షువూ) బంగ్లాదేశ్ నుంచి శరణార్థిగా వచ్చి కోల్ కతాలో స్థిరపడతాడు. అక్కడ 'జాజ్ సిటీ' పేరుతో ఒక క్లబ్ ను నిర్వహిస్తూ ఉంటాడు. అతను అక్కడి రాజకీయ పరిణామాలను గురించి ఎంత మాత్రం పట్టించుకోకుండా తెలివిగా తనకి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటాడు. అయితే 'క్లబ్'కి సంబందించిన లైసెన్స్ ను రెన్యువల్ చేయించుకోవడానికి ఆయన నానా తిప్పలు పడుతూ ఉంటాడు. 

అప్పటికే బెంగాలీ భాషకు ప్రాధాన్యతను తగ్గిస్తూ, 'ఉర్దూ' భాషను ప్రోత్సహించడమనేది జోరుగా సాగుతుంటుంది. దాంతో బెంగాలీలంతా తమ నిరసనలు వ్యక్తం చేయడం మొదలుపెడతారు. శంషాద్ భాయ్ - షీలా బోస్ - కావేరీ లాంటివారు ఒక ఉద్యమంలా తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉంటారు. దాంతో వాళ్లను అడ్డుకోవడానికి .. అణగదొక్కడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తుంటారు. 

ఈ నేపథ్యంలోనే పాక్ ఆర్మీ అధికారి హనీఫ్ (షతాఫ్ ఫిగర్) బందీలుగా ఉన్న ముగ్గురు భారతీయ యువకులు తప్పించుకుంటారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా .. భాషాపరమైన నినాదాలతో రెచ్చగొడుతున్న ఈ ముగ్గురు యువకులపై ప్రభుత్వం సీరియస్ గా ఉంటుంది. వాళ్లను బంధించడానికి పోలీస్ బృందాలు వెదుకుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులలో వాళ్లకి జిమ్మీరాయ్ ఆశ్రయం కల్పిస్తాడు. ఫలితంగా అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ.

1971లో జరిగిన బంగ్లాదేశ్ విముక్తి పోరాటం .. ఆ పోరాటం జరగడానికి అవసరమైన కారణాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. పాకిస్థాన్ నుంచి 'తూర్పు పాకిస్థాన్' (బంగ్లాదేశ్) విడిపోవాలని అనుకుంటుంది. తమ భాషను .. తమ ఉనికిని .. కాపాడుకోవడానికి వాళ్లు ప్రభుత్వంపై తమ తిరుగుబాటును మొదలుపెడతారు. రేడియో తప్ప మరే ప్రచార సాధనం అందుబాటులోలేని ఆ కాలంలో బెంగాలీలు చేసిన పోరాటం చుట్టూ ఈ కథను అల్లుకున్నారు.

జిమ్మీ రాయ్ తో పాటు, షీలా బోస్ .. కావేరీ .. శంషాద్ .. గౌరీ .. శామ్యూల్ వంటి ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసుకుని, ఆ పాత్రల చుట్టూ ఈ కథను నడిపించారు. అలాగే పాకిస్థాన్ ఆర్మీ  అధికారులు .. వారి లక్ష్యాలు .. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లే తీరును ఆవిష్కరించిన విధానం సహజత్వానికి దగ్గరగా అనిపిస్తుంది. ఉద్యమాలు - అణచివేతలకు సంబంధించిన సన్నివేశాలు ఆ కాలంలోకి తీసుకుని వెళతాయి. 

 పాక్ ఆర్మీ బందీలుగా ఉన్న ముగ్గురు బెంగాలీ యువకులు పారిపోవడం, వాళ్లను వెతికి పట్టుకోవడం కోసం పోలీసులు గాలింపులు చేపట్టడం ప్రధానమైన అంశంగా చెప్పుకోవాలి. ఆ ముగ్గురు యువకులను మిగతా బెంగాలీలు తప్పించడం .. వాళ్ల కోసం త్యాగాలు చేయడం వంటి సన్నివేశాలపై పెద్దగా దృష్టిపెట్టలేదు.తప్పించుకున్న ఈ ముగ్గురు బెంగాలీల చుట్టూనే ప్రధానమైన కథ నడుస్తుందని అనుకుంటాము. కానీ వాళ్ల పాత్రలు అప్పుడప్పుడు .. అక్కడక్కడా కనిపిస్తూ ఉంటారు.  

ఇక జిమ్మీ రాయ్ - షీలా బోస్ లకు సంబంధించిన లవ్ స్టోరీ ఆకట్టుకుంటుందని అనుకుంటాము. కానీ ఆ స్థాయిలో వాళ్ల మధ్య లవ్ స్టోరీ ఎలాంటి ఫీల్ ను కలిగించలేకపోతుంది. ఇక బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి సంబంధించిన పోరాటంలో, నేలకొరిగిన త్యాగధనుల నేపథ్యం కూడా అంతగా ప్రేక్షలులను ప్రభావితం చేయలేకపోయిందనే చెప్పాలి.

1971 కాలం నాటి నేపథ్యంతో కూడిన సెట్స్ .. వాహనాలు .. వస్తువులు .. వేషధారణ .. ఇలా అన్ని విషయాల్లో తీసుకున్న జాగ్రత్త మనలను ఆకట్టుకుంటుంది. ఆ కాలం నాటి క్లబ్ కల్చర్ .. వాళ్ల లైఫ్ స్టైల్ అయితే ఆ వాతావరణంలో హృదయానికి హత్తుకునే సన్నివేశాలను ఆవిష్కరించలేకపోయారు. కథకి ప్రధాన కేంద్రమైన 'జాజ్ సిటీ' క్లబ్ నేపథ్యంలో డిజైన్ చేసిన సన్నివేశాలు అంతగా కనెక్ట్ కాలేదు.                         

నటీనటులంతా తమ పాత్రలలో ఒదిగిపోయారు. అయితే గుర్తుపెట్టుకునేవిగా .. ప్రభావితం చేసేవిగా కనిపించేవి చాలా తక్కువ. ఆ వరుసలో అరిఫిన్ .. సౌరసేని మైత్ర .. షతాఫ్ ఫిగర్ వంటి పాత్రలు కనిపిస్తాయి. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం ఆ కాలానికి సంబంధించిన కంటెంట్ కి బలాన్ని ఇచ్చాయి. బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి సంబంధించిన కంటెంట్ ను తెరకెక్కించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. అయితే ఎమోషన్స్ వైపు నుంచి చూసుకుంటే, ఆశించినస్థాయిలో కదిలించలేకపోయింది.