తమిళనాట కొన్ని గ్రామాలలో 'పొట్టేళ్ల ఫైట్' సంప్రదాయ క్రీడగా ఉంది. ఈ క్రీడ నేపథ్యంలో రూపొందిన డ్రామానే 'జాకీ'. యువన్ కృష్ణ - రిధాన్ కృష్ణ .. అమ్ము అభిరామి ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమా ఇది. ప్రగ భల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, శక్తి బాలాజీ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ ఏడాది జనవరి 23న థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 6వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.
'మధురై' పరిసరాలలో రాముడు (యువన్ కృష్ణ) అనే యువకుడు షేర్ ఆటో నడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అక్క .. మేనకోడలు ఇదే అతని కుటుంబం. ఆటో నడుపుతున్న రాముడికి 'మీను' (అమ్ము అభిరాభి) పరిచయమవుతుంది. ఆ ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. అదే విలేజ్ కి పెద్దమనిషిగా చక్రవర్తి (మధు సూదన్ రావు) ఉంటాడు. ఆయన మేనల్లుడే కోబ్రా కార్తీక్ ( రిధాన్ కృష్ణ). అతను ఎక్కువగా పొట్టేళ్ల పోటీలలో పాల్గొంటూ ఉంటాడు.
కోబ్రా కార్తీక్ చేపల మార్కెట్ కి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాడు. అలాగే తనకి ఎదురు తిరిగినవారిపై రౌడీయిజం చెలాయిస్తూ ఉంటాడు. ఆ ఏడాది ఆ ఊరికి అతను 'జాకీ'గా ఉంటాడు. పొట్టేళ్ల పోటీలో గెలిచినవారికి 'జాకీ' అనే ఒక మెడల్ ఇస్తుంటారు. ఆ మెడల్ కారణంగా వాళ్లకి ఊళ్లో ఎంతో గౌరవం లభిస్తూ ఉంటుంది. ఆ మెడల్ ఏడాది నుంచి కార్తీక్ దగ్గరే ఉంటుంది. అలాంటి కార్తీక్ పొట్టేలుతో, రాముడి పొట్టేలు 'కాళీ' తలపడుతుంది.
రాముడికి పొట్టేళ్ల పోటీలో తన పొట్టేలును వదలడం ఇష్టం ఉండదు. కానీ అనుకోకుండా అలా జరిగిపోతుంది. ఆ పోటీలో రాముడు గెలవడం .. జాకీ మెడల్ రాముడికి లభించడం జరిగిపోతుంది. తన చేజారిపోయిన మెడల్, రాముడికి దక్కడాన్ని కార్తీక్ తట్టుకోలేకపోతాడు. అందుకోసం మరోసారి తనతో పోటీకి తలపడేలా రాముడిని రెచ్చగొడతాడు. ఫలితంగా ఏం జరుగుతుంది? రాముడు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ.
సాధారణంగా ఎడ్ల పందాలు .. కోడి పందాలు .. అలాగే పొట్టేళ్ల పందాలు ఆయా గ్రామాలలో పాతకాలం నుంచి జరుగుతూ రావడం మనకి కనిపిస్తుంది. అలా పొట్టేళ్ల ఫైట్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఈ తరహా పోటీలో ఎప్పటికీ తామే విజేతగా నిలవాలని అనుకునేవారు, అందుకోసం దేనికోసమైనా తెగించేవారు ఉంటారు. అలా పొట్టేళ్ల ఫైట్ కారణంగా హీరో - విలన్ మధ్య జరిగే పోరాటంగా ఈ కథ కనిపిస్తుంది.
విలేజ్ నేపథ్యంలో జరిగే సంప్రదాయ క్రీడనే అయినప్పటికీ, తామే గెలవాలనీ .. తమ గురించే అంతా మాట్లాడుకోవాలనే పట్టుదలతో కొంతమంది ఉంటారు. ఎవరికి వారు తాము విజేతగా నిలవడం కోసం మోసాలకు పాల్పడటం .. వ్యూహాలు పన్నడం సహజంగానే జరుగుతూ ఉంటాయి. అలాంటి అంశాలను టచ్ చేయడం ద్వారా కొంత యాక్షన్ ను .. మరికొంత ఎమోషన్ ను దర్శకుడు రాబట్టాడు.
ఒక వైపున హీరోకి తన అక్కయ్య ఫ్యామిలీ పట్ల ఉండే ప్రేమ .. మరో వైపున తనకి మనసిచ్చిన అమ్మాయిపై ప్రేమ .. ఇంకోవైపున తాను పెంచిన పొట్టేలుపై ప్రేమ .. ఈ కథలో ఎమోషన్స్ ను టచ్ చేస్తూ ఉంటాయి. కొన్ని గ్రామాలలో ఇద్దరు వ్యక్తులు శత్రువులుగా మారిపోతే, ఆ గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోతుంటారు. అలాంటి ఒక వాతావరణం ఈ కథలో మనకి కనిపిస్తుంది. అలా గ్రామాన్ని మొత్తం ఈ కథలోకి లాగిన తీరు సహజత్వాన్ని కళ్ల ముందు ఉంచుతుంది.
విలేజ్ నేపథ్యం .. సహజమైన ప్రేమకథ .. పొట్టేలుతో ఉన్న అనుబంధం వంటి ఎమోషన్స్ ను దర్శకుడు ఆవిష్కరించిన తీరు బాగుంది. అయితే దర్శకుడు పొట్టేళ్ల పోటీకి ఎక్కువ నిడివిని కేటాయించడం అసహనాన్ని కలిగిస్తుంది. పొట్టేళ్ల ఫైట్ చుట్టూనే కెమెరా తిరుగుతూ చిరాకు తెప్పిస్తుంది. లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్స్ శాతం తగ్గిపోవడంతో కంటెంట్ చూపించే ప్రభావం తగ్గిపోయింది.
అటు హీరో .. ఇటు విలన్ నటన కాస్త వీక్ గానే అనిపిస్తుంది. ఎక్స్ ప్రెషన్స్ పెద్దగా పలకలేదు. ఉదయ్ కుమార్ ఫొటోగ్రఫీ .. శక్తి బాలాజీ నేపథ్య సంగీతం .. శక్తి బాలాజీ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. పొట్టేళ్ల ఫైట్ కి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువైపోవడం, మిగతా ఎమోషన్స్ శాతం తగ్గడం వలన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.
'జాకీ'( అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Jockey Review
Movie Details
Movie Name: Jockey
Release Date: 2026-03-06
Cast: Yuvan Krishna, Ridhaan Krishnas,Ammu Abhirami,Madhusudhan Rao
Director: Pragabhal
Music: Sakthi Balaji
Banner: PK7 Studios LLP
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer