మలయాళం నుంచి థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన సినిమాలు .. సిరీస్ లు ఎక్కువగా వస్తుంటాయి. థ్రిల్లర్ జోనర్ ను రసవత్తరంగా నడిపించడంలో వాళ్లకి మంచి పట్టు ఉందనే విషయాన్ని చాలా సినిమాలు నిరూపించాయి. అయితే అందుకు భిన్నంగా ఈ సారి మలయాళం నుంచి, 'సర్వం మాయ' అనే ఒక సూపర్ నేచురల్ కామెడీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రితం ఏడాది డిసెంబర్ 25వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఈ నెల 29వ తేదీ నుంచి వివిధ భాషల్లో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
అది కేరళలోని ఒక విలేజ్. అక్కడ నీలకంఠ నంబూద్రికి మంచి పేరు ఉంటుంది. ఆయన 70వ జన్మదిన వేడుకకి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతూ ఉంటాయి. దూర ప్రాంతాలలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులతో పాటు, ఇతర బంధువులంతా ఆ గ్రామానికి చేరుకుంటూ ఉంటారు. నీలకంఠ నంబూద్రి చిన్న కొడుకు ప్రభేందు (నివీన్ పౌలి)కూడా ఆ విలేజ్ కి చేరుకుంటాడు. తండ్రితో చాలాకాలంగా మాటలు లేకపోవడం వలన, ఆయనకి దూరంగానే ఉంటూ ఉంటాడు. ప్రభేందును అందరూ 'ప్రభ' అనే పిలుస్తూ ఉంటారు. అతను మంచి గిటారిస్ట్. కొన్ని సినిమాలకు పనిచేసిన అనుభవం ఆయనకి ఉంది.
ఇతర దేశాలలో 'ప్రభ' స్టేజ్ షోలు చేస్తూ ఉంటాడు. అయితే 'వీసా' రాని కారణంగానే ఆయన తండ్రి పుట్టినరోజు కార్యక్రమానికి సొంత ఊరు చేరుకుంటాడు. తమ వంశీకులంతా పౌరోహిత్యాన్ని నమ్ముకుని గౌరవంగా బ్రతుకుతూ ఉంటే, ప్రభ ఊళ్లు పట్టుకు తిరగడం తండ్రికి నచ్చదు. మ్యూజిక్ వైపు నుంచి తనకి సక్సెస్ వచ్చే వరకూ, పౌరోహిత్యం చేయాలని ప్రభ నిర్ణయించుకుంటాడు. వరుసకు బావ అయిన రూపేశ్ (అజూ వర్గీస్) దగ్గర అసిస్టెంట్ గా చేరతాడు. ఒకసారి రూపేశ్ గాయపడటం వలన, ఒక తాంత్రిక పూజ చేయడానికి ప్రభ ఒక ఇంటికి వెళ్లవలసి వస్తుంది.
తాంత్రికం గురించి ఏమీ తెలియకపోయినా డబ్బు కోసం ప్రభ వెళతాడు. ఆ ఇంట్లోని అవినాశ్ అనే కుర్రాడికి దెయ్యం పట్టిందని తెలిసి, భయపడుతూనే పూజ చేస్తాడు. అయితే ఆ క్షణంలోనే ఆ కుర్రాడిని ఆ దెయ్యం వదిలేస్తుంది. ఎందుకు వదిలేసింది అనేది ప్రభకి అర్థం కాదు. అయితే ఆ రోజు రాత్రి ప్రభ గదిలో ఏదో అలికిడి అవుతుంది. కళ్లు తెరిచి చూసిన ఆయన, ఎదురుగా అందమైన అమ్మాయిగా కనిపిస్తున్న దెయ్యాన్ని చూసి భయపడిపోతాడు. అవినాశ్ ను వదిలేసిన దెయ్యం తనతో పాటు వచ్చేసిందనే విషయం అతనికి అర్థమవుతుంది. ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు దెయ్యంగా మారింది? ప్రభ వెంటనే ఆమె ఎందుకు తిరుగుతూ ఉంటుంది? ప్రభకి తప్ప ఆమె ఎవరికి ఎందుకు కనిపించదు? అనేది మిగతా కథ.
ఇది హారర్ కామెడీ జోనర్లో నడిచే కథ. సాధారణంగా దెయ్యాలు పగబడతాయి .. భయపెడతాయి. కంటినిండా నిద్రపోనీయవు .. కడుపునిండా తిననీయవు. మనశ్శాంతి లేకుండా చేస్తుంటాయి. దెయ్యంగా మారింది ఎవరు? ఎందుకు అలా మారవలసి వచ్చింది? హీరోకి .. దెయ్యానికి మధ్యగల సంబంధం ఏమిటి? అనే సందేహాలు ఆడియన్స్ ను వెంటాడుతూ ఉంటాయి. అయితే ఆ సందేహాలకు ఈ కథలో కనిపించే సమాధానాలు కొత్తగా అనిపిస్తాయి.
దెయ్యాలకి సంబంధించిన సినిమాలు చూస్తున్నప్పుడు, ఏ వైపు నుంచి దెయ్యం వచ్చి పడుతుందో అనే భయం ఆడియన్స్ కి కలుగుతూ ఉంటుంది. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు, ఒక లవ్ స్టోరీని చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ప్రేమకథలో మాదిరిగా ఈ సినిమాలోను అలకలు.. బుజ్జగింపులు ఉంటాయి. హీరో - దెయ్యంగా హీరోయిన్ ఇద్దరూ కలిసి హాయిగా తిరుగుతూ ఉంటారు. ఇలా ఎక్కడైనా జరుగుతుందా? అనే సందేహం తలెత్తినప్పుడే 'ఫ్లాష్ బ్యాక్' తెరపైకి వస్తుంది. ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికి దర్శకుడు పెద్దగా సమయం తీసుకోలేదు. తక్కువ సమయంలోనే ఆ ఎపిసోడ్ ను ఎమోషనల్ గా కనెక్ట్ చేశాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ .. అప్పటివరకూ నడుస్తూ వచ్చిన కథను సమర్థిస్తుంది.
హీరోను పౌరోహిత్యం నేపథ్యంలో చూపించడం కొత్తగా అనిపిస్తుంది. తాంత్రిక పూజలు .. భయాల వైపు నుంచి దర్శకుడు కొంత కామెడీని రాబట్టాడు. అయితే ఈ కామెడీ సరిపోలేదనే అనిపిస్తుంది. దెయ్యం అంటే వేధిస్తుంది .. పీడిస్తుంది అనే ఇప్పటి వరకూ చాలా సినిమాలు చూపిస్తూ వచ్చాయి. అయితే ఒక దెయ్యాన్నే సినిమా అంతా హీరోయిన్ గా నమ్మిస్తూ కథను నడిపించిన విధానం కొత్తగా అనిపిస్తుంది. ఒక హారర్ కామెడీని కాకుండా, ఒక అందమైన ప్రేమకథను చూస్తున్న ఫీలింగే కలుగుతుంది. నాన్ స్టాప్ గా నవ్వించే కామెడీ లేకపోయినా, సున్నితమైన భావోద్వేగాలను ఆవిష్కరించడానికే దర్శకుడు ప్రాముఖ్యతను ఇచ్చాడు.
ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. నివిన్ పౌలి .. అజూ వర్గీస్ .. రియా శిబూనటన హైలైట్ గా నిలుస్తుంది. శరణ్ వేలాయుధన్ కెమెరా పనితనం బాగుంది. జస్టిన్ ప్రభాకరన్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. అఖిల్ సత్యన్ ఎడిటింగ్ కూడా నీట్ గా ఉంది. దర్శకుడు కథను ఎంచుకున్న నేపథ్యం బాగుంది. అలాగే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ అంశంతో ముడిపడిన ట్విస్ట్ బాగుంది. అయితే హీరో - హీరోయిన్ మధ్య ప్రేమకి సంబంధించిన గాఢత వెలితిగా అనిపిస్తుంది. ఒకరు మనిషి .. మరొకరు దెయ్యం కావడం వలన, ఈ లోటును దర్శకుడు భర్తీ చేయలేకపోయాడు. ఫీల్ తో కవర్ చేయడానికి తనవంతు ప్రయత్నం చేశాడు.
మరణమంటే శరీరం నుంచి ఆత్మ వేరైపోవడమే .. కానీ ఆత్మ నుంచి ప్రేమ వేరైపోవడం కాదు. మరణించిన తరువాత కూడా జీవించి ఉండేది నిజమైన ప్రేమ అనే సత్యాన్ని చాటి చెప్పిన సినిమా ఇది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ ను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చొచ్చు
'సర్వం మాయ'( జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!
Sarvam Maya Review
-
Movie Details
Movie Name: Sarvam Maya
Release Date: 2026-01-29
Cast: Nivin Pauly,Riya Shibu,Aju Varghese,Janardhanan,Preity Mukhundhan,Raghunath Paleri
Director: Akhil Sathyan
Music: Justin Prabhakaran
Banner: Firefly Films
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer