ఈ దీపావళి సీజన్‌లో నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో మొదటగా విడుదలవుతున్న సినిమా 'మిత్ర మండలి'. పూర్తి వినోదాత్మకమైన కథాంశంతో ఎలాంటి కథ, లాజిక్‌లు లేకుండా ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా ఈ సినిమా రాబోతుందని చిత్ర యూనిట్‌ సినిమా ప్రచారాన్ని జరిపారు.  తమ సినిమాపై కొందరు కావాలని సోషల్‌ మీడియాలో నెగెటివ్‌ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు నిర్మాత బన్నీవాస్‌. వినోదంతో పాటు వివాదం ఇలా తమ పబ్లిసిటి ఆయుధాలుగా చేసుకుని 'మిత్ర మండలి' ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక 'మిత్ర మండలి' ప్రేక్షకులను నవ్వించారా? ప్రేక్షకులను ఏ మేరకు అలరించారు అనేది రివ్యూలో తెలుసుకుందాం.. 

కథ: ఈ సినిమాలో కథ లేదని, కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే ఉందని ఈ సినిమా ప్రచారంలో చిత్ర యూనిట్‌ చెప్పినట్లుగానే.. సినిమా ప్రారంభంలోనే ఈ సినిమాకు ఎటువంటి కథ లేదని చెప్పేశారు.. అయితే నిజంగానే ఈ సినిమాకు కథ లేదు.. అయితే సింపుల్‌ కథ. కానీ ఈ కథ లేని కథను కథగా చెప్పుకోవాలంటే అనగనగా ఓ ఫిక్షన్‌ కులం తుట్టేకులం.. ఆ కులానికి నాయకుడు నారాయణ (వీటీ గణేశ్‌)కు ఆయన కులం అంటే పిచ్చి.. ఆ కులబలంతో ఎమ్మేల్యే అవ్వాలనుకుంటాడు.. అయితే ఇంతలోనే ఆయన కూతురు స్వేచ్చ (నిహారిక) ఇంటి నుంచి పారిపోతుంది. 

ఈ విషయం తన కులం వాళ్లకు, తనకు టిక్కెట్‌ ఇచ్చే పార్టీ ప్రతినిధికి తెలిస్తే తన ఎమ్మేల్యే అవ్వాలనే కల కలగానే మిగిలిపోతుందని, తన కూతరు కిడ్నాప్‌ అయ్యిందని ఎస్సై సాగర్‌.కె.చంద్ర ( వెన్నెల కిషోర్‌) సహాయంతో కూతురును వెతకడం ప్రారంభిస్తాడు. అయితే తన అమ్మాయి కిడ్నాప్‌ ఉదంతం వెనుక నలుగురు యువకులు చైతన్య (ప్రియదర్శి), అభయ్‌ (రాగ్‌ మయూర్‌), సాత్విక్‌ (విష్ణు), రాజీవ్‌ (ప్రసాద్‌ బెహరా)లు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఆ తరువాత జరిగిందేమిటి? స్వేచ్చ ప్రేమించింది ఎవరిని? నారాయణ ఎమ్మేల్యే అయ్యాడా? లేదా తెలుసుకోవాలంటే సినిమా చూడాలి...

విశ్లేషణ: కథ లేకుండా సినిమా చేయడం అనేది నిజంగా నిర్మాతల సాహసమనే చెప్పాలి. అయితే కథ లేకపోతే అంతకు మించిన బలమైన స్క్రీన్‌ప్లే, సన్నివేశాలు ఉండాలి. ఈ సినిమాలో కథతో పాటు మిగతా అంశాలు కూడా ఏమీ లేకపోవడమే ఈ సినిమా ప్రత్యేకత. సినిమా మొదటి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు ప్రేక్షకుల ఓపికకు పెద్ద పరీక్ష అనే చెప్పాలి. చిన్న చిన్న కామెడీ సన్నివేశాల్లో కామెడీని వెతుక్కుని మరీ నవ్వి ఆనందపడే వారికి కూడా మచ్చుకు కూడా ఈ సినిమాలో వినోదం కనిపించదు. ఓ ఫిక్షన్‌ కులాన్ని, ఆ కులానికి ఓ నాయకుడు.. వాళ్లమ్మాయి పారిపోవడం.. నలుగురు కుర్రాళ్లు చేసే అపహాస్యం దీనిని ఈ సినిమా కథగా  అనుకున్నారు నిర్మాతలు. ఎక్కడా కూడా ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయాలనే తపన, కనీసం ఆలోచన కూడా కనిపించదు. 

'జాతి రత్నాలు' మొదలుకుని.. నిన్నటి 'లిటిల్‌ హార్ట్స్‌' వరకు చిన్న కథలకు పూర్తి వినోదాన్ని జోడించి విజయాలను అందుకున్నాయి. అయితే ఇలా కామెడీ కథాంశాలతో విజయాన్ని అందుకున్న సినిమాల్లో చిన్న కథ చుట్టు వాళ్లు యాడ్‌ చేసిన కామెడీ రిజన్‌బుల్‌గా, జనాలు ఆమోదించే విధంగా ఉంది. ఈ సినిమాల ఇన్‌స్పిరేషన్‌తోనే 'మిత్ర మండలి' కథను, సన్నివేశాలను తయారుచేసుకున్నారు. కామెడీ సినిమా అనగానే ప్రేక్షకులు ఎలాంటి సన్నివేశాలైన చూస్తారు, ఎలాంటి కథనైనా యాక్సెప్ట్‌ చేస్తారు  అనే నిర్లక్ష్యంతో తీసిన సినిమాలా అనిపించింది. సినిమా ఆద్యంతం  మొత్తం ప్రేక్షకులను నవ్వించడానికి బలవంతంగా ప్రయత్నం చేసినట్టే అనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా సహజమైన వినోదం ఉండదు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో ట్రెండింగ్‌లో ఉన్న కామెడీ నటులందరూ నటించినా, కథలో, సన్నివేశాల్లో బలం లేకపోవడంతో అంతా వృథా ప్రయత్నంలాగే  ఉండిపోయింది. 

నటీనటుల పనితీరు: ఈ సినిమాలో నటించిన కామెడీ ఆర్టిస్టులందరూ మంచి నటులే. వాళ్లకున్న కామెడీ టైమింగ్‌ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని వాళ్ల గత చిత్రాలు నిరూపించాయి. కానీ ఈ సినిమాలో ఏ పాత్రకు సరైనా క్యారెక్టరైజేషన్స్‌ లేకపోవడం వల్ల ఎవరి పాత్ర మెప్పించదు. ఈ మధ్య కాలంలో మంచి కమెడియన్స్‌గా ట్రెండింగ్‌లో ఉన్న సత్య,  వెన్నెల కిషోర్‌ పాత్రలు కూడా వినోదాన్ని పంచడంలో విఫలమయ్యాయి. నిహారిక పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. సాంకేతికంగా ఫర్వాలేదనిపించుకున్న, నిర్మాణ విలువలు చాలా నాసిరకంగా ఉన్నాయి. కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఆ ప్రభావం బాగా కనిపిస్తుంది. 

ఫైనల్‌గా : ఈ సినిమా ప్రారంభంలో నలుగురు స్నేహితులు చేతిలో బ్యాట్‌, బాలు.. వికెట్స్‌ ఏమీ లేకుండా.. అవి ఉన్నట్లుగా భావించి క్రికెట్‌ ఆడుతుంటారు. అప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి మరో వ్యక్తితో ఏంటీ సార్‌.. వాళ్ల చేతిలో ఏమీ లేకుండా క్రికెట్‌ ఆడినట్లుగా నటిస్తున్నారు ఎందుకని? అంటే వాళ్లు అంతేనండి.. అలా ఆడుతూ అందరిని బకరాలను చేస్తుంటారు అంటాడు.. ఈ సన్నివేశం ఖచ్చితంగా 'మిత్ర మండలి' సినిమా రిజల్ట్‌కు కరెక్ట్‌గా సరిపోతుంది.  

ఈ సినిమా కథను దర్శకుడు చెబుతుంటే తాను రెండున్నర గంటలు కడుపుబ్బ నవ్వుకున్నానని.. ఆ కామెడీని భరించలేక తనకు కడుపునొప్పి వచ్చిందని ఈ చిత్ర ప్రెస్‌మీట్‌లో చెప్పారు నిర్మాత బన్నీవాస్‌. అయితే  సినిమా చూసిన వాళ్లకు నిజంగా  అప్పుడు బన్నీవాస్‌కు దర్శకుడు ఈ కథ, ఈ సన్నివేశాలే  చెప్పాడా? లేక అది వేరే సినిమా కోసం అలా దాచిపెట్టుకున్నారా? అనే సందేహం రాకమానదు. సినిమా అంటే ఓ బాధ్యత, సినిమా అంటే ఆడియన్స్‌ మీ మీద పెట్టుకున్న నమ్మకం.. 

ఇలాంటి కథ లేని కథలతో, వినోదం లేని వినోదంతో ప్రేక్షకులను అలరించాలని ఆశపడటం అత్యాశే అవుతుంది. కామెడీ సినిమా అనే ట్యాగ్‌ చేసి ఎలాంటి కామెడీని తెరకెక్కించినా ప్రేక్షకులు చూస్తారు అనే నిర్లక్ష్యం ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్‌లో కనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమా మిత్ర మండలి చేసిన విఫల ప్రయత్నమనే చెప్పాలి.