రిషభ్ శెట్టి కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో గతంలో వచ్చిన 'కాంతార' సంచలన విజయాన్ని సాధించింది. దాంతో ప్రీక్వెల్ ను పాన్ ఇండియా స్థాయిలోనే ప్లాన్ చేశారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో కీలకమైన పాత్రను రుక్మిణి వసంత్ పోషించడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఈ రోజునే థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిందనేది చూద్దాం.

కథ: కదంబరాజుల పాలనలో ఒక భాగంగా 'కాంతర' అటవీ ప్రాంతం ఉంటుంది. అయితే కదంబుల సామంత రాజు ఆ అడవి పరిసర గ్రామాలపై అధికారాన్ని కలిగి ఉంటాడు.  కాంతార అడవిలో 'ఈశ్వర పూదోట'గా చెప్పుకునే ప్రదేశానికి ఆయన వెళతాడు. పరమశివుడు తపస్సు చేసుకోవడానికి పార్వతీదేవి సృష్టించిన పూదోటగా అక్కడి వారు నమ్ముతుంటారు. ఆ ప్రాంతంలో సుగంధ ద్రవ్యాలను పండుతుండటంతో స్వాధీనం చేసుకోవాలని భావిస్తాడు. అందుకోసం గూడెం ప్రజలపై దాడి చేయించబోయి తానే మరణిస్తాడు. 

తండ్రి మరణాన్ని ప్రత్యక్షంగా చూసిన రాజశేఖరుడు (జయరామ్), 'కాంతార' అడవిలో బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడని అక్కడి ప్రజలు చెప్పుకునే మాటను నమ్ముతాడు. వారసుడిగా 'బాంగ్రా' సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. తన పిల్లలైన కులశేఖరుడు (గుల్షన్ దేవయ్య) .. కనకావతి (రుక్మిణి వసంత్)లకి 'కాంతార' అడవిని గురించి చెబుతూనే వస్తాడు. ఆ అడవి జోలికి వెళ్లకూడదని ఆయన హెచ్చరిస్తూనే వస్తాడు.  

అడవిలో గిరిజనులకు దొరికిన బరిమి (రిషభ్ శెట్టి) పెరిగి పెద్దవాడవుతాడు. కండబలం .. గుండె బలం కారణంగా అతనే ఆ గూడానికి నాయకుడవుతాడు. అదే సమయంలో 'బాంగ్రా' సింహాసనాన్ని  కులశేఖరుడు అధిష్ఠిస్తాడు. అతని హయాంలోనే అడవి సంపదను అమ్ముకునే హక్కు తమకే ఉందని 'బరిమి' భావిస్తాడు. అందుకు అవసరమైన సుగంధ ద్రవ్యాల కోసం  'ఈశ్వరపూదోట'లోకి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. తండ్రి మాట వినకుండా 'ఈశ్వర పూదోట' వైపు వెళ్లడానికి కులశేఖరన్ ప్రయత్నిస్తాడు. పర్యవసానంగా చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేది కథ.    


విశ్లేషణ: గతంలో వచ్చిన 'కాంతార' విషయానికి వస్తే, అడవి నేపథ్యంలో ఒక గ్రామం .. వరాహ అవతారంతో ఉన్న సెంటిమెంట్ .. దానిని వేటాడకూడదనే నిబంధన .. స్థానికంగా ఉండే దొర స్వార్థం .. మొదలైన అంశాల చుట్టూ తిరుగుతుంది. ఈ కథ విషయానికి వస్తే, కాంతారలో పండుతున్న సుగంధ ద్రవ్యాలపై కన్నేసిన రాజులు .. అక్కడి దైవశక్తిని దిగ్బంధించిన క్షుద్రశక్తులతో తలపడే కథానాయకుడి చుట్టూ తిరుగుతుంది. 

ఒక వైపున ధర్మం కోసం .. మరో వైపున దైవం కోసం పోరాడే ఒక యువకుడి కథగా ఇది కనిపిస్తుంది. రిషభ్ శెట్టి అల్లుకున్న కథ, అత్యాశ .. తాంత్రిక సాధన .. విశ్వాసం అనే మూడు అంశాల చుట్టూ నడుస్తుంది. ఎంచుకున్న లొకేషన్స్ .. కథను పరిగెత్తించిన విధానం .. పెట్టిన ఖర్చు పాన్ ఇండియా స్థాయిలోనే కనిపిస్తాయి. అప్పుడప్పుడు జానపదాన్ని .. సోషియో ఫాంటసీని కలిపి చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. 

కథా కథనాల తరువాత యాక్షన్ సన్నివేశాలు ఎక్కువ మార్కులు కొట్టేస్తాయి. రథంపై ఫైట్ .. ఫారెస్టులో వర్షంలోను .. తాంత్రీకులతో ఫైట్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. రిషభ్ - రుక్మిణి వసంత్ పాత్రల పరిచయం .. ప్రేమ సీన్స్ ఆకట్టుకుంటాయి. రాజుగా జయరామ్ .. యువరాజుగా గుల్షన్ దేవయ్య ఆ పాత్రలకు కరెక్ట్ కాదేమో .. వాటిని సరిగ్గా డిజైన్ చేయలేదేమో అనిపిస్తుంది. మొదటి నుంచి చివరివరకూ ఆ పాత్రలు పేలవంగానే మిగిలిపోతాయి. ప్రీ క్లైమాక్స్ లోను .. క్లైమాక్స్ లోను  దైవం ఆవేశించినట్టుగా రిషభ్ శెట్టి చేసిన యాక్టింగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. అయితే వరాహ రూపం ప్రాధాన్యతను సంతరించుకున్న ఈ కథలో, ఈ సారి శివుడికి .. నందీశ్వరుడికీ .. చండీదేవికి ముడిపెట్టడం కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుందంతే. 

పనితీరు
: ఒకప్పుడు అడవులను ఆశ్రయంగా చేసుకున్న గిరిజనులు .. ఆ అడవులను తాంత్రిక శక్తులకు నిలయంగా చేసుకున్న తాంత్రికులు .. అడవులను ఆక్రమించాలానే పాలకుల దురాశ చుట్టూ తిరిగే ఈ కథను రిషభ్ శెట్టి తయారు చేసుకున్న తీరు, తెరపై దానిని ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటాయి. క్షుద్ర శక్తుల బారి నుంచి తాము నమ్మిన దైవాన్ని .. దుష్ట శక్తుల బారి నుంచి తనని నమ్మిన ప్రజలను కాపాడే బాధ్యతను కథానాయకుడి భుజాలపై పెట్టడం బాగుంది. 

రిషభ్ శెట్టి నటన ఒక రేంజ్ లో కనిపిస్తుంది. యువరాణిగా రుక్మిణి వసంత్ అందంగా మెరిసింది. జయరామ్ .. గుల్షన్ దేవయ్య పాత్రలు పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి. అరవింద్ ఎస్. కశ్యప్ కెమెరా పనితనం బాగుంది. ఫారెస్టు నేపథ్యంలోని సన్నివేశాలను గొప్పగా ఆవిష్కరించారు. అజనీశ్ లోక్ నాథ్ నేపథ్యం సంగీతం ఈ కథకి మరింత సపోర్ట్ చేసింది. సురేశ్ మల్లయ్య ఎడిటింగ్ నీట్ గానే అనిపిస్తుంది. 

ముగింపు: ఒక వైపున స్వార్థపరులైన రాజుల నుంచి .. మరో వైపున తాంత్రిక శక్తుల బారి నుంచి 'కాంతార'ను కాపాడుకునే కాపరి కథ ఇది. కథాకథనాల పరంగా .. యాక్షన్ సీక్వెన్స్ పరంగా .. నేపథ్య సంగీతం పరంగా .. లొకేషన్స్ పరంగా ఈ సినిమా మెప్పిస్తుంది. కాకపోతే ఈసారి వరహానికి బదులుగా 'పులి'కి ప్రాధాన్యతను ఇవ్వడం, కథ ఈశ్వర శక్తి చుట్టూ తిరగడం కొత్తగా అనిపిస్తుంది.