పవన్ కల్యాణ్ చాలా కాలంగా రాజకీయాలలో బిజీగా ఉంటూ వస్తున్నారు. అందువలన తన వెసులుబాటుకు తగినట్టుగా ఆయన ఆ మధ్య కాలంలో చాలా చిన్న సినిమాలను .. రీమేకులను ఎంచుకుంటూ ముందుకు వెళ్లారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన చేసిన 'హరిహర వీరమల్లు' అభిమానులను నిరాశపరిచింది. ఆ తరువాత ప్రాజెక్టుగా ఆయన చేసిన సినిమానే 'ఓజీ'. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
కథ: సత్యా దాదా (ప్రకాశ్ రాజ్) ముంబైలో ఒక పోర్టును నిర్మిస్తాడు. ఆయన ఇద్దరు కొడుకులలో ఒకరైన పార్థు (వెంకట్) పోర్టుకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజున ఆ పోర్టుకు ఒక కంటెయినర్ వస్తుంది. ఆ కంటెయినర్ అంతా అత్యంత ప్రమాదకరమైన 'RDX'తో ఉంటుంది. అయితే ఆ కంటెయినర్ ను వదిలితే ముంబై ప్రమాదంలో పడుతుందనే ఉద్దేశంతో సత్యా దాదా దానిని దాచేస్తాడు.
మాఫియా సామ్రాజ్యాన్ని గడగడలాడించే 'ఒమీ' (ఇమ్రాన్ హాష్మి)కి సంబంధించిన కంటెయినర్ అది. దాని కోసం ముందుగా తన తమ్ముడైన జిమ్మీ (సుదేవ్ నాయర్)ను పంపిస్తాడు. ఆ తరువాత నేరుగా తాను రంగంలోకి దిగుతాడు. సత్యా దాదా కొడుకైన పార్ధుని చంపేసిన జిమ్మీ, ఆ తరువాత సత్యా దాదాను వెతుక్కుంటూ బయల్దేరతాడు. ఈ విషయం గీతమ్మ ( శ్రేయా రెడ్డి)కి తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితులలో సత్యా దాదాను రక్షించగలిగేవాడు ఒక్క 'ఓజీ' మాత్రమేనని ఆమె భావిస్తుంది.
అయితే 'ఓజీ' ముంబై విడిచి వెళ్లిపోయి 15 ఏళ్లు అవుతూ ఉంటుంది. గతంలో అతని అండదండలు చూసి సత్యా దాదాకి భయపడిన వాళ్లంతా, ఇప్పుడు ధైర్యంతో ముందుకు వస్తుంటారు. సత్యా దాదాను కాపాడటానికి ఓజీ ముంబైకి వస్తే, అతనిని తాను చంపాలనే పగతో గీతమ్మ కొడుకు అర్జున్ (అర్జున్ దాస్) ఉంటాడు. తన భార్య కన్మణి (ప్రియాంక మోహన్) కూతురు 'తార'తో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్న 'ఓజీ'కి, సత్యా దాదా ఆపదలో ఉన్నాడనే విషయం తెలుస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? సత్యా దాదాతో అతనికి గల సంబంధం ఏమిటి? ఎందుకు అతనికి దూరంగా ఉంటున్నాడు? 'ఓజీ'పై అర్జున్ ఎందుకు పగతో రగిలిపోతున్నాడు? ఒమీ ఉద్దేశం ఏమిటి? అనేవి ఆడియన్స్ ను వెంటాడే సందేహాలు.
విశ్లేషణ: ఈ కథ 1940లలో మొదలవుతుంది. అక్కడి నుంచి 70వ దశకాన్ని టచ్ చేసి వచ్చి 90లలో సెటిలవుతుంది. ఆ కాలం నాటి కాస్ట్యూమ్స్ .. వాతావరణంలోనే కథ ముందుకు వెళుతూ ఉంటుంది. కథ ప్రకారం చాలా పాత్రలు తెరపైకి వచ్చి వెళుతూ ఉంటాయి. పవన్ తరువాత ప్రధానమైన పాత్రల స్థానాలలో ఇమ్రాన్ హష్మీ .. ప్రకాశ్ రాజ్ .. శ్రేయారెడ్డి .. అర్జున్ దాస్ పాత్రలు కనిపిస్తాయి. ప్రియాంక మోహన్ ఉన్నప్పటికీ ఆమె పాత్ర నామమాత్రమే.
సుజీత్ అల్లుకున్న ఈ కథ విషయానికి వస్తే, కొత్త పొట్లం విప్పి తాజాగా బయటికి తీసేందేమీ కాదు. కాకపోతే స్క్రీన్ ప్లేలోని వేగం .. పవన్ కల్యాణ్ స్టైల్ .. తమన్ నేపథ్య సంగీతం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళతాయి. గోరంత ఎమోషన్ చుట్టూ సుజిత్ కొండంత యాక్షన్ ను డిజైన్ చేసుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ తో ముడిపడిన ఈ యాక్షన్ ఎపిసోడ్స్ పవన్ ఫ్యాన్స్ తో విజిల్స్ వేయిస్తాయి. ఖడ్గాలు .. కత్తులు .. తుపాకులతో తెరపై ఓజీ చేసిన హల్ చల్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తాయి.
తెరపై చాలా పాత్రలు ఉన్నప్పటికీ పవర్ అనేది పవన్ పాత్రలో మాత్రమే కనిపిస్తుంది. శ్రేయా రెడ్డి పాత్రను ఫరవాలేదు అనే స్థాయిలో వాడుకున్నప్పటికీ, అర్జున్ దాస్ కి సంబంధించిన ట్రాక్ తేలిపోతుంది. ఇక విలన్లు అంచలంచెలుగా కనిపిస్తూ కాస్త విసుగు తెప్పిస్తారు. అలాగే హీరోయిన్ వైపునుంచి అల్లుకున్న ట్రాక్ కూడా రొటీన్ గా అనిపిస్తుంది. అయినా ఈ సినిమాలో కథ గురించి చెప్పుకోవడం కంటే, పవన్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో సుజీత్ అలా చూపించాడు అంటేనే కరెక్టుగా ఉంటుంది.
పనితీరు: సుజీత్ ఎంచుకున్న కథలో కొత్తదనమేమీ కనిపించదు. కానీ స్క్రీన్ ప్లే తో ఆయన ఈ కథను పరిగెత్తించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ ను డిజైన్ చేయించుకున్న తీరు బాగుంది. అయితే కథ ఆరంభంలో జపాన్ .. టోక్యో అంటూ హడావిడి చేయడంతో ఏం జరుగుతుందనేది ఆడియన్స్ కి అర్థం కాలేదు. కథ విషయాన్ని కాసేపు పక్కన పెట్టేస్తే, పవన్ ను స్టైలీష్ గా చూపించడంలో తను సక్సెస్ అయ్యాడు అంతే.
పవన్ కల్యాణ్ కాస్త ఒళ్లు చేసి బాగున్నాడు. హ్యాండ్సమ్ లుక్స్ తో .. స్టైల్ తో .. మంచి మార్కులు కొట్టేశాడు. తన మార్క్ కంటెంట్ కావడంతో ఆయన చెలరేగి పోయాడు. ఆయన తరువాత ఎవరు బాగా చేశారు అనే ప్రశ్నకి ఆన్సర్ లేదు. ఎందుకంటే తెర మొత్తాన్ని ఆయన మాత్రమే ఆక్రమించిన సినిమా ఇది. ఇక ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ స్థానంలో కనిపిస్తుంది. కాకపోతే ఆ పాత్రలో ఉన్న విషయం చాలా తక్కువ.
ఈ సినిమాకి అసలైన హీరోలు సుజిత్ - తమన్ అని పవన్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంటులో అన్నారు. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూసిన తరువాత పవన్ మాట నిజమేనని అనిపిస్తుంది. రవి కె చంద్రన్ - మనోజ్ పరమహంస ఫొటోగ్రఫీ బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ ఓకే.
ముగింపు: పవన్ కంటూ ఒక బాడీ లాంగ్వేజ్ ఉంది. ఆయనకంటూ ఒక డైలాగ్ డెలివరీ ఉంది. తెరపై వాటిని చూడటానికే అభిమానులు ఇష్టపడతారు. ఆయన కదలికనే కథగా భావిస్తారు . అంతకుమించి పెద్దగా పట్టించుకోరు. అందువల్లనేనేమో సుజిత్ కథను లైట్ తీసుకుని, పవన్ పాత్రపైనే పూర్తి ఫోకస్ పెట్టాడు. అభిమానులకు తెరపై పవన్ ను పవన్ లా చూడక చాలా కాలమైంది. అలాంటివారి ముచ్చట తీర్చడంలో సుజీత్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
'ఓజీ'- మూవీ రివ్యూ!
OG Review
- తెరపై హ్యాండ్సమ్ గా కనిపించిన పవన్
- తన మార్క్ స్టైల్ తో చెలరేగిన పవర్ స్టార్
- స్క్రీన్ ప్లేను పరిగెత్తించిన సుజీత్
- విశ్వరూపం చూపించిన తమన్
- పవన్ స్టైల్ పైనే ఆధారపడి నడిచే కంటెంట్
Movie Details
Movie Name: OG
Release Date: 2025-09-25
Cast: Pawan Kalyan,Priyanka Mohan,Prakash Raj,Emraan Hashmi,Sriya Reddy, Arjun Das
Director: Sujeeth
Music: Thaman
Banner: DVV Entertainment
Review By: Peddinti
Trailer