Varla Ramaiah: పెన్షన్ల పంపిణీపై సచివాలయంలో ఎన్డీయే నేతల ధర్నా... ఒక్క ప్రాణం పోయినా సీఎస్ దే బాధ్యత అంటూ వర్ల ఫైర్

  • ఇటీవల పెన్షన్ల సందర్భంగా అవాంఛనీయ పరిణామాలు
  • ఇంటి వద్దకే పెన్షన్లు అందించాలంటూ నేడు సీఎస్ ను డిమాండ్ చేసిన ఎన్డీయే నేతలు
  • సీఎస్ జవహర్ రెడ్డికి వినతిపత్రం సమర్పణ
Varla Ramaiah fires on CS Jawahar Reddy over pensions issue

ఇటీవల పెన్షన్ల పంపిణీ సందర్భంగా అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో, ఈసారి పెన్షన్ల పంపిణీకి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఎన్డీయే కూటమి నేతలు ఇవాళ సచివాలయంలో సీఎస్ చాంబర్ వద్ద ధర్నా నిర్వహించారు. పెన్షన్లను ఇంటి వద్దనే అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

టీడీపీ నేతలు సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మే 1వ తేదీ వస్తోందని, రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై సహేతుక నిర్ణయం తీసుకోవాలని, ఈసీ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని సీఎస్ ను కోరారు.  

ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. కొన్ని వారాల కిందట పెన్షన్ల కోసం సచివాలయాలకు వచ్చిన వృద్ధులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పెన్షన్లను ఇంటివద్దకే అందించాలని ఈసీ స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చినా సీఎస్ ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. 

పెన్షన్ కోసం ఎవరూ ఇబ్బంది పడకుండా చూడాలని కోరినా, సీఎస్ తమ విన్నపాన్ని లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మే నెలలో పెన్షన్ పంపిణీలో ఒక్క ప్రాణం పోయినా సీఎస్ దే బాధ్యత అని స్పష్టం చేశారు. 

టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా స్పందిస్తూ... పెన్షన్లు తీసుకునేందుకు వచ్చిన వృద్ధులు చనిపోతే శవరాజకీయాలు చేశారని మండిపడ్డారు. కొందరు అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈసీ ఆదేశాలను పరిగణనలోకి తీసుకోకుండా సీఎస్ కాలయాపన చేస్తున్నారని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.  

జనసేన నేత శివశంకర్ స్పందిస్తూ... పెన్షన్ల పంపిణీలో సీఎస్ జవహర్ రెడ్డి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, తిరిగి ఈసీకి లేఖలు రాయడం ఏంటని ప్రశ్నించారు. 

బీజేపీ నేత సూర్యనారాయణరాజు మాట్లాడుతూ, ఇంటింటికీ పెన్షన్ల పంపిణీపై సీఎస్ నుంచి స్పందన లేదని అన్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల కుట్రను ప్రజలు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు.

More Telugu News