Hyderabad: ప్రియురాలితో ఫోన్‌లో మాట్లాడుతూ ఉరేసుకున్న యువకుడు

Young man committed suicide while talking to girl friend in Hyderabad
  • హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లో ఘటన
  • విభేదాల కారణంగా యువకుడిని దూరం పెట్టిన యువతి
  • మంగళవారం రాత్రి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పిన యువకుడు
  • స్నేహితుడికి చెప్పి అప్రమత్తం చేసే లోపే దుప్పటితో ఉరేసుకున్న యువకుడు

ప్రియురాలితో ఫోన్‌లో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పి ఉరేసుకున్నాడో యువకుడు. హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన 29 ఏళ్ల ఇమ్రోజ్ పటేల్ ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపడంతో ఇమ్రోజ్‌ను కొంతకాలంగా యువతి దూరం పెట్టింది.

తీవ్ర మనస్తాపానికి గురైన ఇమ్రోజ్ మంగళవారం రాత్రి తన ఫ్లాట్ నుంచి యువతికి ఫోన్ చేశాడు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు చెప్పడంతో ఆమె షాకైంది. వెంటనే అక్కడికి సమీపంలోనే ఉండే స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. అతడు ఇమ్రోజ్ ఫ్లాట్‌కు వెళ్లి చూసేసరికే ఘోరం జరిగిపోయింది. దుప్పటితో ఉరివేసుకున్న ఇమ్రోజ్ విగత జీవిగా కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News