IPL 2024: టీ20 క్రికెట్‌లో నయా హిస్టరీ.. కోల్‌కతాపై పంజాబ్ పెనుసంచలన విజయం

  • 262 పరుగుల లక్ష్యాన్ని 18.8 ఓవర్లలోనే ఛేదించిన పంజాబ్ కింగ్స్
  • సెంచరీతో కోల్‌కతా బౌలర్లను ఊచకోత కోసిన జానీ బెయిర్‌స్టో
  • అద్బుత ఇన్నింగ్స్ ఆడిన శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్
  • టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక లక్ష్య ఛేదనలో నిలిచిన మ్యాచ్
Jonny Bairstow powers Punjab Kings to highest ever successful chase in T20 history against Kolkata Knight Riders in IPL 2024

విధ్వంసం కాదది ఊచకోత.. సంచలనం కాదది పెనుసంచలనం.. సిక్సర్లు, ఫోర్లతో మైదానం మోతెక్కింది.. వెరసి ఈడెన్ గార్డెన్స్ సాక్షిగా టీ20 క్రికెట్ హిస్టరీలో నయా చరిత్ర నమోదయ్యింది. జానీ బెయిర్‌స్టో విశ్వరూపం, శశాంక్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్ ఫలితంగా కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 262 పరుగుల లక్ష్యం చిన్నబోయింది. కేవలం 18.4 ఓవర్లలోనే టార్గెట్‌ని ఫినిష్ చేసి టీ20 క్రికెట్‌ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్య ఛేదనను పంజాబ్ కింగ్స్ నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో జానీ బెయిర్‌స్టో దుమ్ములేపాడు. 48 బంతుల్లో ఏకంగా 108 పరుగులు బాది కొండంత లక్ష్యాన్ని సునాయాసంగా మార్చివేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి.

ఇక నయా సంచలనం శశాంక్ సింగ్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 28 బంతులు ఎదుర్కొన్న శశాంక్ ఏకంగా 68 పరుగులు పిండుకున్నాడు. అద్భుతమైన 8 సిక్సర్లు, 2 ఫోర్లు బాదాడు. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కూడా అదరగొట్టాడు. కేవలం 20 బంతుల్లోనే 54 పరుగులు కొట్టి భారీ లక్ష్య ఛేదనలో అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. తొలి వికెట్‌గా క్రీజులోకి వచ్చిన పంజాబ్ బ్యాటర్ రూసో కూడా రాణించాడు. 16 బంతుల్లో 26 పరుగులు బాదాడు. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కాగా పంజాబ్ బ్యాటర్ల ధాటికి కోల్‌కతా బౌలర్ల దగ్గర సమాధానం లేకుండాపోయింది. మరో 8 బంతులు మిగిలివుండగానే 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారంటే ఊచకోత ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బౌలర్ ఎవరైనా బాదడమే పనిగా విరుచుకుపడ్డారు. సునీల్ నరైన్‌కు మాత్రమే ఒక వికెట్ పడింది. మరో వికెట్ రనౌట్ రూపంలో ఆ జట్టుకు లభించింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా అదరగొట్టింది. ఆ జట్టు ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ తొలి వికెట్‌కు 138 పరుగులు బాదారు. దీంతో ఆ జట్టుకు భారీ స్కోరు సాధించేందుకు బాటలు పడ్డాయి. మిగతా బ్యాటర్లు కూడా సహకారం అందించడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 261 పరుగుల రికార్డు స్థాయి స్కోరు నమోదు చేసింది. సునీల్ నరైన్ 32 బంతుల్లో 71 పరుగులు, ఫిలిప్ సాల్ట్ 37 బంతుల్లో 75 పరుగులు బాది స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు. సాల్ట్ ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు, 6 ఫోర్లు బాదగా.. నరైన్ 9 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. మిగతా బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ 23 బంతుల్లో 39 పరుగులు, ఆండ్య్రూ రస్సెల్ 12 బంతుల్లో 24 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 10 బంతుల్లో 28 పరుగులు, రింకూ సింగ్ 5, రమణ్ దీప్ సింగ్ 6 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2 వికెట్లు, సామ్ కర్రాన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ ఒక్కోటి చొప్పున వికెట్లు తీశారు.

More Telugu News