ankur warikoo: పుచ్చిపోయిన తుంటి ఎముక నుంచి సిక్స్ ప్యాక్ దాకా.. ఒక రచయిత ఫిట్ నెస్ ప్రయాణం ఇదీ!

  • ఇన్ స్టాగ్రాం వేదికగా ఫొటోలను షేర్ చేసిన ఫిట్ నెస్ ఫ్రీక్
  • 43 ఏళ్ల వయసులో 10 కిలోల బరువు తగ్గడంతోపాటు సిక్స్ ప్యాక్ సాధించినట్లు వెల్లడి
  • తనకు పునర్జన్మ ఇచ్చిన జీవితానికి రుణపడి ఉంటానంటూ భావోద్వేగ పోస్ట్
From Decaying Hip Bone To 6 Pack Abs Author Ankur Warikoo Talks About His Fitness

ప్రముఖ రచయిత, వ్యాపారవేత్త, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ తన ఫిట్ నెస్ ప్రయాణాన్ని తాజాగా ఇన్ స్టాగ్రాం లో నెటిజన్లతో పంచుకున్నారు. 43 ఏళ్ల వయసులో 10 కిలోల మేర బరువు తగ్గడంతోపాటు 6 ప్యాక్ ను సాధించిన తీరును వివరించారు. ఫిట్ నెస్ కు ముందు, సిక్స్ ప్యాక్ తో ఉన్న తన ఫొటోలను పోస్ట్ చేశారు.

“2012లో 32 ఏళ్ల వయసులో అవాస్క్యులర్ నెక్రోసిస్ అనే వ్యాధి బారినపడ్డా. దీనివల్ల నా కుడి తుంటి ఎముక పుచ్చిపోయింది. దీంతో డాక్టర్లు నన్ను వాకింగ్ చేయొద్దన్నారు” అని అంకుర్ వారికూ చెప్పుకొచ్చారు. సర్జరీ చేయించుకున్నాక కొన్ని నెలలపాటు మంచానికి పరిమితమయ్యానని తెలిపారు. ఆ తర్వాత కోలుకున్నాక 5 నెలలపాటు చేతి కర్రల సాయంతో నడిచినట్లు గుర్తుచేసుకున్నారు. కానీ ఇవేవీ ఆయన తిరిగి ఫిట్ నెస్ సాధించకుండా నిరోధించలేకపోయాయి.

వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాక జీవితంలో తొలిసారి జిమ్ లో చేరినట్లు అంకుర్ వారికూ ఇన్స్టాగ్రాంలో రాసుకున్నారు. అలాగే రన్నింగ్ కూడా మొదలుపెట్టినట్లు చెప్పారు. “అదే ఊపులో ఒక మారథాన్ లో పాల్గోవాలని నిర్ణయించుకున్నా. అయితే తొలినాళ్లలో కాస్త ఇబ్బందిపడ్డా 10 నెలల తర్వాత 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ పూర్తి చేసినట్లు అంకుర్ వారికూ వివరించారు.

అయితే ఆయనకు అప్పటికీ సంతృప్తిగా అనిపించలేదట. దీంతో సిక్స్ ప్యాక్ సాధించాలని తనకు తానే సవాల్ విసురుకున్నారట. “ఆ రోజు నా ఒంట్లో కొవ్వు శాతం 26గా ఉంది. పొట్ల దగ్గర కొవ్వు స్థాయి 10 శాతంకన్నా తక్కువగా ఉంటేనే కండరాలు కనిపిస్తాయి. దీనికోసం నా ఆహారం, నిద్ర వేళలు సహా నా జీవితం మొత్తాన్నీ మార్చుకున్నా. రోజూ వ్యాయామం చేయడం నా దినచర్యలో భాగమైంది. దీంతో సిక్స్ ప్యాక్ సాధించా. ఫిట్ గా మారా” అని అంకుర్ వారికూ తెలిపారు.

ప్రస్తుతం 43 ఏళ్ల వయసులో తాను ఫ్యాట్ ఫ్రీగా మారానని చెప్పారు. “పదేళ్ల కిందట మొదలుపెట్టిన నా దినచర్య, ఆలోచనా విధానం నా జీవితాంతం కొనసాగుతుంది. పునర్జన్మ ఇచ్చిన ఈ రెండో జీవితానికి ఎంతో రుణపడి ఉంటా” అని అంకుర్ పేర్కొన్నారు. ఆయన పోస్ట్ కు 82 వేలకు పైగా లైక్ లు లభించాయి.

More Telugu News