Revanth Reddy: ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి... హైటెన్షన్ వైర్‌లాంటి వాడిని: కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్

  • మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాడి మసైపోతావని హెచ్చరిక
  • కారు షెడ్డుకు పోయింది... ఇక అది బయటకు వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా
  • బీఆర్ఎస్ పదేళ్లలో పాలమూరుకు చేసిందేమీ లేదని విమర్శ
Revanth Reddy counter to KCR

తమతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి... మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాడి మసైపోతావని హెచ్చరించారు. తాను హైటెన్షన్ వైర్ లాంటివాడినని... ముట్టుకుంటే షాక్ కొడుతుందన్నారు. ఆయన శుక్రవారం మహబూబ్ నగర్ లోక్ సభ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కారు షెడ్డుకు పోయిందని... ఇక అది బయటకు వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ఆ కారు పూర్తిగా పాడైపోయిందన్నారు.

కాంగ్రెస్ హయాంలో పాలమూరు కోసం ఎన్నో ప్రాజెక్టులు చేపట్టామని, కానీ బీఆర్ఎస్ పాలించిన పదేళ్లలో ఈ జిల్లాను ఏడారిగా మార్చారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాను తీసుకు వచ్చారా? అని బీఆర్ఎస్‌ను ప్రశ్నించారు. పార్లమెంట్‌లో నిద్రపోవడానికే బీఆర్ఎస్‌కు ఓటేయాలని చురక అంటించారు. లోక్ సభ ఎన్నికల్లో పాలమూరులో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

పాలమూరును కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఇక్కడి నుంచి కేసీఆర్ గెలిచారు కానీ చేసింది మాత్రం సున్నా అని విమర్శించారు. గతంలో పాలమూరుకు మంత్రి పదవులు కూడా దక్కలేదన్నారు. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయన్నారు.

More Telugu News