largest snake: గుజరాత్ లో బయటపడ్డవి ‘భూమ్మీద సంచరించిన అతిపెద్ద పాము’ అవశేషాలే!

  • 2005లో వెలికితీసిన వాసుకి ఇండికస్ వెన్నెముక శిలాజం అతిపెద్ద పాము అవశేషంగా నిర్ధారణ
  • సుమారు 50 అడుగుల పొడవు, టన్ను బరువు ఉండొచ్చని శాస్త్రవేత్తల అంచనా
  • కోట్ల ఏళ్ల కిందట సంచరించిన టైటనోబోవా పాముకన్నా పెద్దది అయ్యుండొచ్చన్న పరిశోధకులు 
scientsists found fossil of largest snake ever existed in gujarat

గుజరాత్ లో 2005లో వెలికితీసిన ఓ పాము వెన్నెముక శిలాజం భూమ్మీద ఇప్పటివరకు జీవించిన అతిపెద్ద పాము అవశేషమని శాస్ర్తవేత్తలు వెల్లడించారు. ఆ పాము టీ రెక్స్ కన్నా పొడవైనదని తెలిపారు. ఐఐటీ రూర్కీకి చెందిన శాస్ర్తవేత్తలు 2005లో గుర్తించిన పాము శిలాజంకి వాసుకి ఇండికస్ అని పేరుపెట్టారు. తాజాగా దాన్ని జెయింట్ స్నేక్ గా నిర్ధారించారు. వివిధ జాతులు ప్రత్యేకించి సరీసృపాల (రెప్టైల్స్) ఆవిర్భావం, పరిణామ ప్రక్రియలో భారత్ తో ఉన్న సంబంధం ఈ పరిశోధన తెలియజేస్తుందని చెప్పారు. 

పాము శిలాజానికి చెందిన 27 వెన్నెముక భాగాలను పరిశోధకులు గతంలో కనుగొన్నారు. వాటిలో కొన్ని ఎముకలు భారీ కొండ చిలువను పోలి ఉన్నాయి. అలాగే అవి విషపూరితం కానివి అయ్యుండచ్చని శాస్ర్తవేత్తలు భావించారు. పాము పొడవు సుమారు 50 అడుగులు ఉండొచ్చని అంచనా వేశారు. అలాగే దాని బరువు సుమారు ఒక టన్ను అంటే ఏకంగా వెయ్యి కిలోలు ఉండొచ్చని లెక్కగట్టారు. ఆ పరిశోధనకు సంబంధించిన వివరాలు ‘స్ప్రింగర్ నేచర్’ లో సైంటిఫిక్ రిపోర్ట్స్ పేరిట గురువారం ప్రచురితం అయ్యాయి.

“దాని భారీ ఆకారంబట్టి వాసుకి చాలా నెమ్మదిగా కదులుతూ మాటు వేసి దాడి చేసే జీవి. అనకొండలు, కొండచిలువల్లా వాసుకి కూడా తన ఆహార జీవిని మెలితిప్పి ఊపిరాడకుండా చేసేదే. నాటి భౌగోళిక ఉష్ణోగ్రతలు ప్రస్తుతంకన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పాము గుజరాత్ తీర ప్రాంతంలోని చిత్తడి నేలల్లో జీవించేది” అని ఈ పరిశోధనకు సారథ్యం వహించిన ప్రధాన రచయిత, ఐఐటీ రూర్కీ పోస్ట్ డాక్టోరల్ రీసెర్చర్ (పేలియెంటాలజీ) దెబాజిత్ దత్తా ‘ద గార్డియన్’కు వివరించారు.

హిందూ పురాణాల ప్రకారం నాగదేవతల రాజు అయిన వాసుకి పేరును ఈ పాము శిలాజానికి పెట్టారు. సుమారు ఆరు కోట్ల సంవత్సరాల కిందట ప్రస్తుత కొలంబియా ప్రాంతంలో టైటనోబోవా అనే భారీ పాము జీవించేది. అది సుమారు 43 అడుగుల పొడవుతో ఒక టన్నుకన్నా ఎక్కువ బరువు ఉండేదని శాస్ర్తవేత్తల అంచనా. “వాసుకి వెన్నెముక శిలాజం టైటనోబోవాకన్నా కాస్త పెద్దగా ఉండటంతో ఈ పాము పొడవు టైటనోబోవా పొడవుతో పోల్చదగ్గది. అయితే టైటనోబోవాకన్నా వాసుకి ఆకారంలో పెద్దదా లేక సన్నదా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేం” అని ఐఐటీ రూర్కీ ప్రొఫెసర్, ఈ పరిశోధన పత్రాల సహ రచయిత సునీల్ బాజ్ పాయ్ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం జీవిస్తున్న అతిపెద్ద పాము ఆసియాకు చెందిన రెటికులేటెడ్ పైథాన్. దీని పొడవు 33 అడుగులు. వాసుకి శిలాజం పొడిబారిన, చెత్తతో నిండిన ప్రాంతంలో లభించినప్పటికీ అది భూమిపై సంచరించినప్పుడు ఆ ప్రాంతం చిత్తడిగా ఉండేదని బాజ్ పేయ్ వివరించారు.

శాస్ర్తవేత్తలు గుర్తించిన ఈ విషయం పాముల పరిణామ క్రమాన్ని తెలియజేయడమే కాకుండా కాలానుగుణంగా భూమిపై ఖండాలు ఎలా పక్కకు జరిగియో, జీవజాతులు ప్రపంచమంతా ఎలా విస్తరించాయో తెలుసుకోవడంలో దోహదపడనుంది.

More Telugu News