నడచివచ్చిన వేంకటేశ్వరుడు

ఆపదమొక్కులవాడిగా శ్రీవేంకటేశ్వరుడు అశేష భక్త జనకోటిచే నిత్యనీరాజనాలు అందుకుంటున్నాడు. ఆర్తితో ... అనురాగంతో ఆయనను పిలవాలేగానీ, రవ్వంత సేపైనా ఆయన రాకుండా ఉండలేడు. అలా భక్తుడు పిలిచినదే తడవుగా నేరుగా ఆయన చేను దగ్గరికే వేంకటేశ్వరస్వామి వచ్చిన విషయం ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

కొద్దిపాటి భూమిని సాగుచేసుకుంటూ జీవితాన్ని గడిపే రైతును అనుగ్రహించడానికి స్వామి తరలి వచ్చిన ఆ క్షేత్రం ఖమ్మం జిల్లా 'గార్ల'లో దర్శనమిస్తుంది. చేను దగ్గర పనిచేసుకుంటూ భక్తుడు ప్రార్ధించగానే, స్వామివారు నేరుగా అక్కడికే నడుచుకుంటూ వచ్చేశాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయిన ఆ భక్తుడు స్వామికి నమస్కరించి, ఆ విషయం చెప్పడానికి ఊళ్లోకి పరిగెత్తుకు వచ్చాడు.

ఆయన అందరినీ తీసుకుని వెళ్లేలోగా స్వామి శిలగా మారిపోయాడు. ఊళ్లో వాళ్లంతా కలిసి స్వామికి పూజలు చేయడం ఆరంభించారు. ఇదంతా జరిగి కొన్ని వందల సంవత్సరాలు గడిచాయి. అప్పట్లోనే కొంతమంది రాజులు ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేస్తే, ఆ తరువాత వచ్చిన రాజులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. స్వామివారి నిత్య కైంకర్యాలకి అవసరమైన ఖర్చు నిమిత్తం మాన్యాలను రాసిచ్చారు.

స్వయంభువు వేంకటేశ్వరుడు కావడం వలన, భక్తుడి కోసం రావడం వలన ఈ క్షేత్రానికి ఎంతో విశిష్టత ఏర్పడింది. సాధారణ రోజుల్లో భక్తుల రాక ఓ మాదిరిగా వుంటుంది గానీ, పర్వదినాల్లో భక్తుల సంఖ్య బాగానే వుంటుంది. ఇక ఇదే గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కూడా స్వయంభువుగా దర్శనమిస్తాడు.

చుట్టుపక్కల గ్రామాల భక్తులు తొలి పంటలో కొంత భాగాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన తరువాతనే మిగతాది సొంతానికి ఉపయోగిస్తారు. గార్ల ప్రజలు ఈ రెండు ఆలయాలను రెండు కళ్ళుగా చూసుకుంటూ వుంటారు ... నిరంతరం స్వామివారి సేవలో తరిస్తూ వుంటారు.


More Bhakti News