శ్రీ కుంకుళ్లమ్మ క్షేత్రం

శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరిగే క్షేత్రాల్లో 'శ్రీ కుంకుళ్లమ్మ క్షేత్రం' ఒకటి. మహిమాన్వితమైన ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని 'ద్వారకా తిరుమల'లో దర్శనమిస్తుంది. పూర్వం ద్వారక మహర్షి తపస్సు చేసుకున్న ఈ ప్రదేశంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఇక్కడి ఉపాలయంగా ... ఆ స్వామి సోదరిగా కుంకుళ్లమ్మ వారు నిత్యపూజలు అందుకుంటూ వుంటుంది.

కుంకుడు చెట్టులో ఆవిర్భవించిన కారణంగా ఇక్కడి అమ్మవారిని 'కుంకుళ్లమ్మ'గా కొలుస్తూ వుంటారు. ఈ క్షేత్రంలో వేంకటేశ్వర స్వామిని దర్శించిన భక్తులు, ఆ తరువాత తప్పని సరిగా కుంకుళ్లమ్మ వారిని దర్శించుకోవడం ఆనవాయతీగా వస్తోంది. గర్భాలయంలో అమ్మవారు త్రిశూలం ధరించి చక్కని ముక్కెరతో ... విశాలమైన నేత్రాలతో కళకళలాడుతూ కనిపిస్తూ వుంటుంది.

ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతూ వుంటాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడి అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అద్భుతంగా అలంకరిస్తూ వుంటారు. అమ్మవారిని దర్శించిన భక్తులు పూలు ... గాజులు ... నూతన వస్త్రాలను సమర్పిస్తూ వుంటారు. ఇక్కడి అమ్మవారు చల్లని తల్లియనీ, సంతానం ... సౌభాగ్యం ... సంపదలు స్థిరంగా ఉండేలా అమ్మవారు అనుగ్రహిస్తుందని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. నవరాత్రి సందర్భంగా అమ్మవారికి జరిగే ప్రత్యేక ఉత్సవాల్లో పాల్గొని పునీతులవుతుంటారు.


More Bhakti News