రథాన్ని కదలనివ్వని స్వామి !

శ్రీవేంకటేశ్వర స్వామిని అనుక్షణం ఆరాధించే మహా భక్తురాలిగా 'వెంగమాంబ' పేరు తిరుమలలోనే కాకుండా, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా పాకిపోయింది. తిరుమల చేరుకున్న భక్తులు, ఆమెని కలుసుకుని మనస్పూర్తిగా నమస్కరించుకున్న తరువాతనే తిరుగు ప్రయాణం కట్టేవారు. అయితే తన గురించి అంతా గొప్పగా చెప్పుకోవడం గురించి వెంగమాంబ అసలు పట్టించుకోలేదు. నిరంతరం ఆమె స్వామివారి సేవలోనే నిమగ్నమవుతూ వుండేది.

ప్రతి సేవకి ఆమె ముందుగా రావడం స్వామివారికి తులసి మాల సమర్పించడం ... హారతి ఇవ్వడం అర్చకులకు కాస్త చిరాకును కలిగించింది. దాంతో వాళ్లు ఆమె మనసుకి కష్టం కలిగించే విధంగా ప్రవర్తించారు. ఒకవైపు స్వామి ఆరాధన గురించిన తపన ... మరో వైపున ఆలయంలోకి అడుగుపెడితే అవమానం. ఈ రెండింటి మధ్య పడి వెంగమాంబ మానసిక సంఘర్షణని అనుభవించింది. మనసుకి కష్టంగా వున్నా ఆలయానికి వెళ్లకపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చింది.

అయితే గర్భాలయంలోని స్వామి వెంగమాంబ రాకకోసం ... ఆమె సమర్పించే తులసిమాల కోసం ఎదురుచూడసాగాడు. రోజులు గడుస్తున్నా వెంగమాంబ రాకపోవడంతో, ఆమె మనసు ఎంతగా బాధపడిందనేది స్వామివారికి అర్థమైంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరుసటి రోజున మాడవీధుల గుండా కదిలిన స్వామివారి రథం వెంగమాంబ ఇంటిముందు ఆగిపోయింది. ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అది అడుగు కూడా ముందుకు కదలలేదు. దాంతో అర్చకులకు తాము చేసిన పొరపాటు అర్థమైంది.

వెంటనే వాళ్ళు పరుగున వెంగమాంబ దగ్గరికి వెళ్లి తమ తప్పును మన్నించమని కోరారు. స్వామివారి రథం కదలాలంటే ఆమె హారతి ఇవ్వాలని చెప్పారు. స్వామివారు తన కోసం నిరిక్షిస్తున్నారనగానే ఇక వెంగమాంబ ఉండలేకపోయింది. ఆయన దివ్య మంగళ రూపాన్ని దర్శించాలనే ఆత్రుతతో హారతి పళ్ళెం తీసుకువచ్చి హారతి ఇచ్చింది. అంతే స్వామి రథం అలపై పడవలా సున్నితంగా కదిలింది. ఈ దృశ్యం చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఈ సంఘటనతో వెంగమాంబ భక్తి ప్రపత్తులు మరింత వెలుగులోకి వచ్చాయి.


More Bhakti News