జడల రామలింగేశ్వరుడు

పరమశివుడు లింగరూపంలో ఆవిర్భవించిన అతి ప్రాచీనమైన క్షేత్రాలలో 'శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి' క్షేత్రం ఒకటి. అత్యంత మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం, నల్గొండ జిల్లా నార్కట్ పల్లి సమీపంలో వెలుగొందుతోంది. ఇక్కడి శివలింగంపై జడల మాదిరిగా రేఖలు ఉండటం వలన ... ఈ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించడం వలన ... కొండ దిగువున పార్వతీదేవి కొలువైవున్న కారణంగా ఈ స్వామిని పార్వతీ జడల రామలింగేశ్వరుడిగా పిలుస్తూ వుంటారు.

కొండపై గుహలో కొలువుదీరిన ఈ స్వామి పిలిస్తే పలుకుతాడని భక్తులు చెబుతుంటారు. త్రేతాయుగంలో 21 మార్లు భూప్రదక్షిణ చేసిన పరశురాముడు, క్షత్రియులను సంహరిస్తూ వచ్చాడు. ఆ పాపానికి పరిహారంగా ఆయన 108 ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠించాడు. అలా ఆయన ప్రతిష్ఠించిన చివరి శివలింగం ఇదేనని స్థలపురాణం చెబుతోంది. పరశురాముడి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన శివుడు, కలియుగం చివరి వరకూ తాను ఈ కొండపై ఉంటానని మాట ఇచ్చాడని అంటారు. ఆనాటి నుంచి స్వామివారికి నిత్యం పూజలు జరుగుతూనే వున్నాయి.

నాటి నుంచి నేటి వరకూ ఒక సర్పం స్వామివారికి ప్రదక్షిణలు చేసి వెళుతుండటం ఇక్కడి విశేషం. కొండ పై భాగాన 'మూడు గుండ్లు'గా పిలవబడే రాతి బండల మధ్యలోని మరొక శివలింగాన్ని కూడా భక్తులు దర్శించుకుంటూ వుంటారు. ఈ క్షేత్రానికి హనుమంతుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తుంటాడు. ప్రతియేటా ఈ స్వామిచెంత మండల దీక్ష తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా వుంటుంది.

ఇక భూత ప్రేత పిశాచ బాధలతో సతమతమైపోతోన్న వారికి స్వామివారి పాదుకలను తాకించడం ఆనవాయతీగా వస్తోంది. ఏడాదికి ఒకసారి జరిగే గ్రామోత్సవంలో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు. స్వామివారిని దర్శించి కృతజ్ఞతలు చెప్పుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన మానసిక పరమైన ... శారీరక పరమైన వ్యాధులు తొలగి పోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.


More Bhakti News