అసలైన ఆస్తిపాస్తులు

రోజు రోజుకీ ధనానికి ప్రాధాన్యత పెరిగిపోతుంది. ధనం కోసం కొందరు ఎలాంటి మార్గాన్నయినా అనుసరించడానికి సిద్ధపడుతుండటం చూస్తున్నాం. సుఖం ... సంతోషం కేవలం ధనంలో మాత్రమే వుందని భావించే వారు, కాసుల కోసం కన్నవాళ్ళని కూడా వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు. అయితే అసలైన ఆస్తి పాస్తులు తల్లిదండ్రులు మాత్రమేననే విషయం మనకి 'నభగుడు' వృత్తాంతం చాటిచెబుతోంది.

శ్రాద్ధ దేవుడికి నభగుడితో కలిపి తొమ్మిది మంది కుమారులు వున్నారు. గురుకులంలో 'నభగుడు' విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వచ్చే లోగా మిగతా వారు ఆస్తి పాస్తులను పంచుకుని వివాహాలు కూడా చేసుకున్నారు. తనకి రావలసిన ఆస్తి గురించి అడిగిన నభగుడికి, వాళ్లు తల్లిదండ్రులను అప్పగించారు. సోదరుల తీరు బాధ కలిగించినా, కన్నవాళ్ళను సంతోషంగా తన వెంట తీసుకు వచ్చి వారికి అండగా నిలిచాడు నభగుడు.

దాంతో శ్రాద్ధదేవుడు అతణ్ణి అక్కడికి దగ్గరలో జరుగుతున్న సత్రయాగానికి వెళ్లి వైశ్వదేవ సూక్తులు పఠించమని చెప్పాడు. అలా చేస్తే స్వర్గానికి వెళుతున్న వేద పండితులు వారి సంపదను అతనికి ఇచ్చి వెళతారని అన్నాడు. తండ్రి చెప్పినట్టుగానే చేసిన నభగుడు, వారు అప్పగించిన సంపద చూసి ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు. అయితే అంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఆ ధనం తనకి చెందుతుందని అడ్డుతగలడంతో నిరాశగా వెనుదిరిగాడు.

జరిగింది తెలుసుకున్న శ్రాద్ధదేవుడు ... ఆ వచ్చినది శివుడేనని నభగుడితో చెప్పాడు. దాంతో శివుడి గురించి నభగుడు ప్రార్ధించగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. తల్లిదండ్రుల పట్ల అతనికి గల ప్రేమానురాగాలకు సంతోషిస్తూ, సిరిసంపదలతో పాటు బ్రహ్మ జ్ఞానాన్ని కూడా ప్రసాదించాడు.


More Bhakti News